విద్యా వ్యవస్థను 40 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు

-జగన్‌పై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఫైర్‌

ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసింది. 40 సంవత్సరాల క్రితం ఉన్న రిజల్ట్ ను ఇప్పుడు జగన్ తీసుకొచ్చాడు. 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కావడం అంటే రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. 6.22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 4.14 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు.

వైసీపీ నాయకులు దొంగల్లా జూమ్ మీటింగ్ లో దూరి పవిత్ర కార్యాన్ని అపవిత్రం చేశారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఇలా వ్యవహరించడం సబబుకాదు. ఫెయిల్ అయిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిలో మనోధైర్యాన్ని నింపాలిగానీ ఇలా వెకిలి పనులకు పాల్పడరాదు. ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగాకూడా లేదు. విద్యార్థులు ఘోరంగా ఫెయిల్ కావడంతో వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. రిజల్ట్ ను చూసి కరోనావల్ల రెండు నెలలు ఆలస్యంగా స్కూళ్లు తెరిచామని, కాస్త సిలబస్ తగ్గించామని ప్రభుత్వం సమర్థించుకోవడంలో అర్థంలేదు.

ఇంత ఘోరమైన ఫలితాలు రాష్ట్రంలో ఎప్పుడూ రాలేదు. విద్యార్థుల సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించింది. వైసీపీ ప్రభుత్వం మూడున్నర కోట్లు దోచుకోవడానికే ‘నాడు-నేడు’ పెట్టింది. రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.. వారికి స్వాంతన చేకూర్చడానికి లోకేష్ ప్రయత్నిస్తుంటే గందరగోళం సృష్టించారు. విద్యార్థుల జీవితాలను బలిగొన్న పాశ్చాత్తాపం వైసీపీ ప్రభుత్వానికి లేదు.

ప్రశ్నప్రతాలను లీకుల మీద లీకులు చేశారు. పదవ తరగతి పరీక్షల సమయంలో విద్యాశాఖ మంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డిలు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఫలితాలు వచ్చాక కార్పొరేట్ పాఠశాలల్లో రిజల్ట్ తగ్గి ఉండకపోవచ్చుగానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వైసీపీ నాయకులకు అనవసరంగా నోరు పారేసుకోవడం తప్ప వాస్తవాలు దగ్గర పెట్టుకొని మాట్లాడటం రాదు.

చంద్రబాబునాయుడు హయాంలో విద్యాశాఖకు ప్రాధాన్యతనిచ్చి విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుతూ పోయారు. జగన్ ఉత్తీర్ణతా శాతాన్ని అమాంతం తగ్గించేశారు. పర్సనల్ ఐడెంటిఫీకేషన్ తో రీ వెరిఫికేషన్, రీ వ్యాల్యుయేషన్, రీకౌంటింగ్ జరపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు.

Leave a Reply