– మీ రక్తం ఎరుపే కదా?
– మహారాష్ట్ర ఎన్నికల చివరి రోజు ప్రచారంలో మంత్రి సీతక్క విస్తృత ప్రచారం
బల్లార్షా: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉన్న బల్లార్షా, చంద్రపూర్ , రజురా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సోమవారం నాడు పాల్గొన్నారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి విస్తృతంగా పర్యటించారు.
రాజూర కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ లో ప్రసగించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ దోటే ను మరో సారి ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి సీతక్క ఎండగట్టారు. దేశానికి, మహారాష్ట్రకు ప్రమాదకారిగా బీజేపీ మారిందని హెచ్చరించారు.
కుటుంబాలను, పార్టీలను, సమాచాన్ని చీలుస్తూ విద్వంస రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని వెల్లడించారు. కులం, మతం, వర్గం పేరుతో ప్రజలకు చీల్చుతూ..ఆదానీ, అంబానీ, ప్రధాని ఒక్కడై దేశాన్ని లూటి చేస్తున్నారని మండిపడ్డారు. దోపిడి సొమ్మును ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
పది సంవత్సరాల్లో కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిన మేలు శూన్యమని సీతక్క తెలిపారు. రూ.400 ఉన్న వంటింటి గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200 పెంచిన ఘనత బీజేపీ సొంతమని ఎద్దేవ చేసారు. నిత్యవసరల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని గుర్తు చేసారు. ప్రజల భారాలని గుర్తించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారేంటీలను అమలు చేస్తోందని వెల్లడించారు.
గృహిణుల వంటింటి భారన్ని తగ్గించేందుకు రూ.500 కే సిలిండర్ ఇస్తున్నట్లు తెలిపారు. పంటరుణ మాఫీ, 200 యునిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పంట బోనస్…ఇలా ఎన్నో పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే తెలంగాణ తరహాలోనే గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా, సరిహద్దులో గల మహారాష్ట్ర గ్రామాల అభివృద్దికి అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు.
మోదీజీ ఎరుపంటే ఎందుకంత భయం?
ప్రధాని నరేంద్ర మోదీ కి ఎరుపంటే ఎందుకంత భయం అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ.. ఎరుపు రంగు కవర్ తో ఉన్న రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తే ప్రధానికి భయం దేనికని ప్రశ్నలు సంధించారు. ప్రధాన నరేంద్ర మోదీ రక్తం కూడా ఎరుపు రంగులో ఉందని..ఎరుపు రంగు అంటే బెదిరిపోవాల్సిన అవసరం లేదన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అందరికి జీవించే హక్కు, స్వేచ్చా హక్కును, మతస్వేచ్చను కల్పించిన రాజ్యంగాన్ని మార్చడం అంటే ప్రజల జీవించే హక్కును కాలరాయడమే అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్దులను గెలిపించడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మంత్రి కోరారు.