Suryaa.co.in

Telangana

క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటు

– మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: తెలంగాణాను త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ కు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ పరిశోధన, అభివృద్ధిలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రానికి సిలికాన్ వ్యాలీ సంస్థలను తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.

‘ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేథ’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్ వెస్టిన్ హోటల్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏఐజి ఛైర్మన్ డా. నాగేశ్వరరెడ్డి, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన డా. డియన్ హో, నారాయణ విద్యాలయ వైస్ ఛైర్మన్ వీరేన్ శెట్టి, ప్రపంచ ఆరోగ్యసంస్థ డిజిటల్ హెల్త్ విభాగం సభ్యుడు డా. రాజేంద్ర గుప్తా లు పాల్గొన్న ఈ సదస్సులో శ్రీధర్ బాబు కీలకోపన్యాసం చేశారు.

నాలుగో పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథను విస్తృతంగా వినియోగించే దిశగా ముందుకు నడుస్తుందని అన్నారు. రేడియాలజీ రోగనిర్దారణ పరీక్షల్లో స్పెషలిస్టు వైద్యులకు ఇప్పటికే ఏఐ తోడ్పడుతోందని, పరిశోధనల ద్వారా దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా పరిశోధనలు జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాక్సిన్ కేంద్రంగా ఘనత సాధించడంలో, హెల్త్ సైన్సెస్ లో నగరాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన పారిశ్రమిక వేత్తలు, సంస్థలకు ఆయన కృతజ్ణతలు తెలిపారు.

ఏఐజిలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్సును ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్యరంగానికి దిక్సూచిగా మారిన డా. నాగేశ్వరరెడ్డి తమ పరిశోధనలను ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం ప్రతిష్ట పెంచాలని శ్రీధర్ బాబు కోరారు. ఏఐజిలో కృత్రిమ మేథతో పనిచేసే ‘మిరా’ అనే వర్చ్యువల్ వైద్య సహాయకురాలిని ప్రవేశ పెట్టి ఈ రంగంలో ఆయన ఆదర్శప్రాయులుగా మారారని శ్రీధర్ బాబు కొనియాడారు.

ఆసుపత్రుల్లో రోగుల సమాచారాన్ని పొందుపర్చడంలో పలు పలు సంస్థలు ఇప్పటికే ఏఐ సహాయాన్ని తీసుకుంటున్నాయని, ఇది రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. వైద్య సంస్థలు, పరిశ్రమల్లో కృత్రిమ మేథను వినియోగించే సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. వైద్య సంరక్షణలో కృత్రిమ మేథ వినియోగంపై ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలో తాము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి పరిశ్రమకు అవసరమైన నిపుణులను తయారు చేస్తున్నామని వెల్లడించారు. ఏఐ సిటీని ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ గా రూపొందిస్తామని చెప్పారు. జిసిసి కన్సార్టియం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ రంగాలకు మరో కన్సార్టియం ఏర్పాటు చేసామని శ్రీధర్ బాబు తెలిపారు. బికాం, బిబిఏ చదువుతున్న విద్యార్థులను కోర్సు రెండో సంవత్సరం నుంచే బ్యాంకింగ్ , ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ ఉద్యోగాలకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దుతామని తెలిపారు.

దేశంలో ఏటా ఈ రంగంలో 20 వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతున్నా నిపుణుల కొరత వల్ల అభ్యర్థులు దొరకడం లేదని ఆయన అన్నారు. సైన్స్, ఫార్మా డిగ్రీ విధ్యార్థులను కోర్సు పూర్తయ్యేలోగా నైపుణ్యం సమకూర్చి ఉద్యోగానికి సంసిద్ధలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర హెల్త్ సైన్సెస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయిక్రిష్ణ, టీజీఐఐసీ సిఇఓ వి.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE