Suryaa.co.in

Entertainment Telangana

మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

– పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే
– పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు

హైదరాబాద్: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

ఇరువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాచకొండ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది.

పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

మోహన్ బాబుపై నమోదైన కేసులను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదైనట్లు తెలిపారు. నిన్న జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో పోలీసుల నోటీసులు అందుకున్న మంచు మనోజ్ ఈ రోజు విచారణకు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు.

మోహన్ బాబు ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే నిత్యం గస్తీ ఏర్పాటు చేయడం కుదరదని.. రెండు గంటలకు ఓసారి పోలీసులు అక్కడి పరిస్థితులను గమనించి వస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో.. రెండు గంటలకోసారి పోలీసులు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.

LEAVE A RESPONSE