Suryaa.co.in

Telangana

వానాకాలం కొనుగోళ్లు.. 9 లక్షల టన్నులు

తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారినప్పటినుంచి ఏ యేటికాయేడు ధాన్యం దిగుబడి పెరుగుతున్నట్టే.. ధాన్యం కొనుగోళ్లు కూడా కొనసాగుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్లు కూడా కొనసాగుతున్నాయి. ఏడేండ్లుగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఒకటి రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు కూడా చేరుతున్నాయి. కరోనా వంటి మహమ్మారి పంజాతో ఆపత్కాలం దాపురించినప్పుడు సైతం..
లాక్‌డౌన్‌ వంటి నిర్బంధాలు ఎన్ని ఉన్నప్పటికీ.. మార్కెట్‌యార్డులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. దేశంలోనే మొట్టమొదటిసారి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొని భారత ఆహార సంస్థకు అందించింది. కరోనా కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయజాలని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసింది.
ఇంత పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. ఈ వానకాలంలో 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. కోటి టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనావేస్తున్నారు. ఈ వానకాలానికి కేంద్ర ప్రభుత్వం 60 లక్షల టన్నులు సేకరించడానికి అంగీకరించింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 4569 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. సోమవారం వరకు 9.58 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 1.44 లక్షల మంది రైతుల నుంచి రూ.1,844 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

LEAVE A RESPONSE