‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే: దేశంలో మోస్ట్ పాప్యులర్ సీఎంగా నవీన్ పట్నాయక్.. టాప్ టెన్ లో లేని తెలుగు సీఎంలు!
నవీన్ కు 71.1 శాతం మంది ఓట్లు
రెండో స్థానంలో బెంగాల్ సీఎం మమత
ఆమెకు 69.9 శాతం మంది అనుకూలం
67.5% ఓట్లతో సీఎం స్టాలిన్ కు మూడో స్థానం
దేశంలోనే మోస్ట్ పాప్యులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ రాష్ట్రంలోని 71.1 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాప్యులారిటీపై ఆయారాష్ట్రాల వారీగా ‘ఇండియా టుడే’ చేసిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం.
ఒడిశాలో 2,743 మందిని అభిప్రాయాలు అడగ్గా 71.1 శాతం మంది నవీన్ పట్నాయక్ కే మొగ్గు చూపారు. నవీన్ పట్నాయక్ తర్వాతి స్థానాల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ లు ఉన్నారు. బెంగాల్ లో 4,982 మందిని ప్రశ్నించగా.. 69.9 శాతం మంది మమతా బెనర్జీ పాప్యులర్ సీఎంగా ఓటేశారు. తమిళనాడులో స్టాలిన్ కు అనుకూలంగా 67.5 శాతం మంది ఉన్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి 61.8 శాతం, కేరళ సీఎం పినరయి విజయన్ కు 61.1 శాతం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 57.9 శాతం, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు 56.6%, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కు 51.4 శాతం మంది ఆమోదం తెలిపారు. 44.9 శాతం ఓట్లతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రంలో మాత్రమే బీజేపీకి అనుకూల ఓట్లు 50 శాతం దాటాయని సర్వేలో తేలింది. బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్, ఉత్తరాఖండ్, యూపీ, మధ్యప్రదేశ్ ల సీఎంల పాప్యులారిటీ 40 నుంచి 50 శాతం మధ్యనే ఉండడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లోని బీజేపీ, దాని మిత్రపక్షాల సీఎంల పాప్యులారిటీ 35 నుంచి 40 శాతంగానే ఉంది. హర్యానా, పుదుచ్చేరి, గోవాల్లో ఆ రేటింగ్ మరింత దారుణంగా ఉండడం బీజేపీని మరింత కలవరపరిచే అంశం. ఆయా రాష్ట్రాల్లో 27 నుంచి 35 శాతం మధ్యే ఉంది. అత్యల్పంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు 27 శాతం ఓట్లే పడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నా ఆయా రాష్ట్రాల సీఎంలపై మాత్రం ప్రతికూల ధోరణితో ఉన్నట్టు ఈ సర్వేను బట్టి అర్థమవుతోంది.