కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయె..
అది నిజమే..
తెలుగులో హాలీవుడ్ స్థాయిలో కౌబాయ్ సినిమా తియ్యాలన్న కృష్ణ కల నిజమైంది..
పద్మాలయ బ్యానర్
హిట్టు కొట్టింది..
సూపర్ స్టార్ కౌబాయ్ పాత్రలకు పెట్టింది పేరయ్యాడు
జైత్రయాత్రలతో జెండా ఎగరేసాడు..!
మోసగాళ్ళకు మోసగాడు..
యాభై సంవత్సరాల
నాటి చిత్రం..
ఇప్పటికీ కళ్ళ ముందు
కదలాడే విచిత్రం..
రాజస్థాన్ ఎడారులు..
సిమ్లా మంచుకొండలు..
టిబెట్ సరిహద్దులు..
టైట్ ప్యాంటులు..
తలపై టోపీలు..
బొడ్డులో తుపాకీలు..
బుల్లెట్లు..బూట్లు..
అవి చేసే చప్పుళ్ళు..
ఇప్పటికీ చెవుల్లో రింగురింగు
గుర్రాల డెక్కల శబ్దాలు..
పాత్రల పేర్లు..
గుహల్లో నివాసాలు..
చూస్తున్నది తెలుగు సినిమానా
గ్రెగరీ పెక్ మెకన్నాస్ గోల్డా..
అదో ప్రపంచం..
పంచరంగుల పంచతంత్రం!
కొన్ని కృష్ణకే చెల్లు..
తెలుగులో ఇంగ్లీష్ సినిమా
చూపించిన ధ్రిల్లు..
సీతారామరాజుగా
ఎక్కుపెట్టిన విల్లు…
పండంటికాపురంలో
మమతలు కలబోసిన ఇల్లు..
పాడిపంటలులో బోట్లకు
పడిన చిల్లు..
కురుక్షేత్రం సినిమాస్కోప్
హరివిల్లు…
సింహాసనం 70 ఎం ఎం
థియేటర్లు హౌస్ ఫుల్లు..
ఇవన్నీ ఆయన్ను చేశాయి
డేరింగ్ నిర్మాతగా..
డాషింగ్ హీరోగా..!
మూడువందలకు పైగా
సినిమాల్లో నటించినా
మోసగాళ్ళకు మోసగాడు
ఎప్పటికీ స్పెషల్..
తుపాకీ పేల్చి కొనపై ఊదితే
అబ్బో..ఆ స్టైలే వేరు..
గుర్రంపై స్వారీ
అదో స్టోరీ..పెద్ద హిస్టరీ..
నాగభూషణం తో లాలూచీ
ఉరి నుంచి తప్పించే ప్లాన్లు
అదే నాగభూషణంతో పేచీ
ఎడారిలో నీళ్ళు కూడా ఇవ్వకుండా తాను తాగుతూ
ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా.. ఏడిగుందా
సల్లగుందా అబ్బాయా..
ఆ పాట..ఆట..అదరహో..
కృష్ణ సాహో..!
అంతిమంగా
నిధి దొరికిన వేళ
యుద్ధాలు..చేజింగులు..
తుపాకీల మోతలు..
విలన్ల వెతలు..
గిలిగింతలు..చక్కిలిగింతలు
థియేటర్లలో రెండ్రూపాయల క్లాస్ టికెట్టుతో..
నలభై పైసల నేల టికెట్టుతో మరో ప్రపంచంలో విహారం..
సినిమా సూపర్ హిట్టు..
తెలుగు సినిమా నిర్మాణం
మరో మెట్టు..!
పద్మాలయ ఫిలింస్
సంచలనం
*మోసగాళ్లకు మోసగాడు*
విడుదలై నేటికి
యాభై ఒక్క
సంవత్సరాలు పూర్తి..
(27.08.1971..)
హీరో కృష్ణకి అభినందనలతో..
(విజయనగరంలో మా వెంకటేశ్వర టాకీస్ లో విజయవంతంగా ఆడిన మూవీ)
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286