ఆయన ఆవేదన..
నేటిభారతం..!
ఆయన ఆవేశం
ప్రతిఘటన..!
ఆయన సంస్కరణ
రేపటిపౌరులు..!
ఆయన ఆలోచన
దేవాలయం..!
ఆయన ఆక్రోశం
దేశంలో దొంగలు పడ్డారు..!
ఆయన ఆక్రందన
వందేమాతరం..!
టి కృష్ణ..
సినిమా ఆయనకి
వినోదం కాదు..
సందేశం పంచే మాధ్యమం..
వ్యాపారం కానే కాదు..
వ్యవహారం..!
తాను అనుకున్నది చెప్పగలిగే ధైర్యం..
తాను నమ్మినది
చూపించగలిగే తెగువ..
వాటితోనే సినిమాకి పెంచాడు విలువ..!
సమాజంలో జరిగే అన్యాయాలు
కృష్ణ కధా వస్తువులు..
వాటిని ఎదిరిస్తూ చేసే పోరాటాలు
ఆయన చూపే పరిష్కారాలు!
నాయికలు వీరనారీమణులు..
నాయకులు ఉదాత్తులు..
విలన్లు కళ్ళ ముందు కదలాడే
మన నేతలే..
వారి ఆగడాల నుంచి పుట్టుకొచ్చిన కథలు..
సగటు మనిషి వ్యధలు..
ఇవే కృష్ణ సినిమాలు..
అవే కృష్ణ తృష్ణ..!
తీసినవి కొన్నే..
కృష్ణ సినిమాల్లో
కసి కనిపించదు…
మార్పు తేవాలన్న తపన..
సమస్యను చూపించి
వినోదించడు..
పరిష్కారం లేకుండా
నినదించడు..
ఊరికే నిందించడు..
ఇన్నిటికీ ఆయన చేతిలోని
ఒకే ఆయుధం సినిమా..
రెండున్నర గంటలు..
ఆ బొమ్మలోనే
దిమ్మ తిరిగే ఎన్నో నిజాలు..
కృష్ణ ఇజాలు..!
ఆయన హీరో..
మానవత్వం పరిమళించే మంచి మనిషి..!
ఒక్కోసారి అతడే
ఇది నా దేహము
శూన్యాకాశము..
ఇలాంటి నిర్వేదం చూపించే అభ్యుదయవాది..!
కధానాయిక..
దుర్యోధన దుశ్శాసన దుర్నిరీతి లోకంలో
ఎదిరించి నిలబడే ధీరోదాత్త..!
ప్రతి పాత్రకు ఓ ప్రయోజనం
మొత్తంగా సినిమాకి
ఒక అర్థం..
సందేశమే దాని పరమార్థం..
ఈ తరం బ్యానర్..
నవతరమే జోనర్..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286