Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేయలేదు… కాళ్లు, చేతులే కాదు మొత్తం శరీరాన్నే కట్టిపడేసింది

-సీల్డ్ కవర్ లో కేసు డైరీ సమర్పించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించడం టర్నింగ్ పాయింట్
-అవినాష్ రెడ్డి పై ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసులు… ప్రాసిక్యూట్ చేయాలని కోరిన సిబిఐ
-వైఎస్ వివేక హత్య గురించి జగన్మోహన్ రెడ్డి ముందే తెలిసిన ఇప్పటి వరకు చెప్పలేదన్న దర్యాప్తు సంస్థ
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ చేతులెత్తేసిందని సాక్షి దినపత్రిక ప్రత్యేక కథనాన్ని రాయడం విడ్డూరంగా ఉంది. ఈ కేసు విచారణలో సిబిఐ చేతులెత్తేయడం కాదు కాళ్లు, చేతులే కాదు మొత్తం శరీరాన్నే కట్టిపడేసే విధంగా చార్జిషీట్ దాఖలు చేసింది. అయినా ఇదే తుది చార్జిషీట్ అన్నట్లుగా సాక్షి దినపత్రిక తన కథనంలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటివరకు సీబీఐ కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసినట్లు, తదుపరి విచారణ అనంతరం కోర్టుకు మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు.

శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… శివ శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తో పాటు పలువురి పేర్లను ప్రస్తావిస్తూ వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లుగా తమ విచారణలో రూడీ అయ్యిందని సిబిఐ తన చార్జిషీట్లో స్పష్టంగా వెల్లడించింది. అయినా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి తనను ఎవరూ చూడలేదన్నట్లుగా సాక్షి దినపత్రిక వ్యవహార శైలి ఉన్నది. సాక్షి దినపత్రికలో అబద్ధాలు రాసేస్తే, అది చదివి ప్రజలు ఇతర పత్రికల లో వచ్చే వార్త కథనాలను చదవకుండానే నమ్మేస్తారనుకోవడం అమాయకత్వం.

సెక్షన్ 173 (8) సి ఆర్ పి సి లో భాగంగా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉందని, విచారణలో వెలుగులోకి వచ్చే నిజాలను చార్జిషీట్ రూపంలో సమర్పిస్తామని పేర్కొన్న విషయాన్ని సాక్షి దినపత్రిక యాజమాన్యం విస్మరించడం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రస్తుత చార్జిషీట్ తోనే అంతా అయిపోలేదని, ముందుంది ముసళ్ళ పండగ అని రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇనిస్టెంట్ మెసేజ్ ( ఐ ఎం ఓ ) యాప్ ను ఉపయోగించుకొని పలువురు మాట్లాడుకున్నట్లుగా వైఫై రూటర్ ద్వారా సిబిఐ అధికారులు గుర్తించారు.

కొన్ని నెంబర్లను గుర్తించి వాటి పూర్తి డేటా వివరాలను సేకరిస్తున్నారు. ఆ నెంబర్లలో అవినాష్ రెడ్డి నంబర్ కూడా ఉన్నట్లుగా నాకు సమాచారం ఉంది. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొంతమంది అధికారుల నెంబర్లను కూడా గుర్తించి, ఆ ఫోన్ నెంబర్ల డేటా వివరాలను సేకరిస్తున్నారు.

అలాగే హత్య సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి తో బలవంతంగా రాయించుకున్న లేఖ పై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయన్న దానిపై నిన్ హెడ్రిన్ పరీక్ష కోసం సి ఎస్ ఎఫ్ ఎల్ కు సిబిఐ అధికారులు పంపారు.. అలాగే, దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని వివరాలను రాబట్టేందుకు ఫోరెన్సిక్ పరీక్ష కోసం త్రివేండ్రంలోని సిడాక్ పంపినట్లు సీబీఐ అధికారులు తమ చార్జిషీట్లో వెల్లడించారు. ఈ వివరాలన్నీ వచ్చిన తర్వాత కోర్టుకు నివేదిస్తామని పేర్కొన్నారు.

ఆస్తి కోసం జరిగిన హత్య కాదు
ఆస్తి తగాదాల వల్ల వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగలేదని, రాజకీయ విభేదాల వల్లే తన చిన్నాన్న హత్య జరిగినట్లుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరీమణి వైయస్ షర్మిల పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. వైయస్ షర్మిల ప్రకటన ఆధారంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం, ఆ హత్యను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయించినట్లుగా పేర్కొంటూ సాక్షి దినపత్రిక లో నారా సుర రక్త చరిత్ర అనే వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ హత్య గురించి ఏమైనా మాట్లాడే హక్కు నారా లోకేష్ కు ఉన్నదని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

ఎందుకంటే, నారా కుటుంబ పరువును దిగజార్చే విధంగా సాక్షి దినపత్రికలో వార్తా కథనాన్ని వండి వార్చడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం సిబిఐ తన విచారణలో భాగంగా పలువురిని విచారించింది. సిబిఐ అధికారులు సాక్షులు ఇచ్చే వాంగ్మూలాన్ని మాత్రమే నమోదు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిఐడి మాదిరిగా తప్పుడు పనులను చేయరు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ను విచారించి ఆయన వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి నివాసంలో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగేదని, వైఎస్ వివేక హత్య జరిగిన రోజు సమావేశంలో తనతోపాటు సాంబశివారెడ్డి, డి కృష్ణ, జివిడి కృష్ణమోహన్ పాల్గొన్నట్లు చెప్పారు. తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో అటెండర్ వచ్చి డోర్ కొట్టారు. అమ్మ ( వైయస్ భారతి ) పిలిచారని చెప్పగానే జగన్మోహన్ రెడ్డి వెళ్లి వచ్చి తమతో చిన్నాన్న ఇంకా లేరని పేర్కొన్నారు. దానితో సమావేశాన్ని ముగించుకొని మేమంతా ఇంటికి వెళ్ళామని అజయ్ కల్లం వివరించారు.

ఇదే విషయమై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ని కూడా సిబిఐ అధికారులు విచారించగా ఆయన తన వృద్ధాప్యాన్ని అడ్డం పెట్టుకొని సమయం వెల్లడించలేదు. ప్రతిరోజు నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య మేనిఫెస్టో కమిటీ సమావేశాలు జరిగేవని చెప్పుకొచ్చారు. వైఎస్ వివేక హత్య జరిగిన రోజు, జగన్మోహన్ రెడ్డి తో తాము సమావేశమైన సమయంలో ఎవరో వచ్చి డోర్ కొట్టిన మాట నిజం. అది ఎవరో నాకు తెలియదు. పేరు గుర్తుకులేదని పేర్కొన్నారు.

ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిబిఐ ప్రశ్నించగా, తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు సమావేశం ప్రారంభమైందని చెప్పారు. నేను వెళ్లేటప్పటికీ జివిడి కృష్ణమోహన్, సాంబశివారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. సమావేశం కొనసాగుతుండగానే అటెండర్ నవీన్ వచ్చి ఫోన్లో మీతో అవినాష్ రెడ్డి మాట్లాడుతారట అని చెప్పాడు. ఫోన్ తీసుకొని నేను అవినాష్ రెడ్డి తో మాట్లాడగా… వివేకం చిన్నాన్న ఇక లేరు అని చెప్పారు. ఎలా జరిగిందని నేను ప్రశ్నించగా… బాత్రూంలో శవం కనిపించింది. బాత్రూంలో, బెడ్ రూమ్ లో రక్తపు మరకలు ఉన్నాయన్నారు.

వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పిన విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పానని కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం తమ వాంగ్మూలంలో జివిడి కృష్ణమోహన్, కృష్ణల పేర్లను ప్రస్తావించలేదు. వైఎస్ వివేక హత్య సమాచారం జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామున 4:30 నుంచి ఐదున్నర గంటల మధ్య తెలిసింది. అయినా ఉదయం ఎనిమిది గంటల వరకు సాక్షి మీడియాలో గుండెపోటుతోనే వైఎస్ వివేక మృతి చెందినట్లుగా కథనాలు వెలువడ్డాయి.

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం ముందు విజయ్ సాయి రెడ్డి ఏడుపు ముఖంతో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని పేర్కొన్నారు. ఎందుకని వైఎస్ వివేక గుండెపోటుతో మరణించినట్లుగా సాక్షి మీడియా కథనాలను ప్రసారం చేసింది?!. బాత్రూంలో, బెడ్ రూమ్ లో రక్తపు మడుగును చూసిన తర్వాత ఎవరైనా గుండెపోటుతో మరణించారని ఎలా అనుకుంటారు?!. ఇదే విషయాన్ని గతంలో ఒక టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియా ముందు ప్రదర్శించారు.

లోటస్ పాండ్ కథనాలను మ్యాచ్ అయ్యే విధంగా పులివెందులలో డ్రామా
గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మరణించారని లోటస్ పాండ్ కథనాలకు అనుగుణంగా పులివెందులలో డ్రామా నడిచింది. ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల మధ్య వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలు విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎంతగా వారిస్తున్నప్పటికీ సాక్షాలను తారుమారు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గాయాలకు జయప్రకాశ్ రెడ్డి తీసుకువచ్చిన బ్యాండేజీ తో కట్లు కట్టించి, కట్టు కథలను వినిపించారు.

గాయాలను బ్యాండేజీతో కవర్ చేసినప్పటికీ, వస్తున్న రక్తాన్ని కనిపించకుండా ఉండేందుకు పూలమాలను శవం పై కప్పారు. వైయస్ వివేకానంద రెడ్డిని గుండెపోటు అని నమ్మించే విధంగా హత్య చేయాలని తొలుత పథక రచన చేసి ఉంటారు. అది వికటించిన ఆందోళన వల్లే పలుమార్లు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, భారతి రెడ్డికి ఫోన్లు చేసి ఉంటారు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల మధ్యలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పటికీ ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం అనుమానాలకు తావునిస్తోంది.

ఐఎంఓ ద్వారా వీడియో కాల్ మాట్లాడే వెసులుబాటు ఉంది. గతంలో నన్ను లాకప్ లో చిత్రహింసలు పెట్టినప్పుడు ఐఎంఓ ద్వారా అప్పటి సి ఐ డి చీఫ్ సునీల్ కుమార్ వేరే వ్యక్తికి వీడియో కాల్ చేశారు. ఐ ఎం ఓ ద్వారా వీడియో కాల్ చేసి నన్ను చిత్రహింసలను పెట్టేది సునీల్ కుమార్ చూపించగలిగేది ఒక్క జగన్మోహన్ రెడ్డి కేనని నేను భావిస్తున్నాను.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విధానం, ఐ ఎం ఓ డేటా వివరాలను సిబిఐ అధికారులు కోరడం పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య లింకు ఉండి ఉంటుందేమోనని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు.

వివేకాను ఎందుకు హత్య చేశారో చార్జిషీట్లో స్పష్టంగా వివరించిన సిబిఐ
వైఎస్ వివేకానంద రెడ్డిని ఎందుకు హత్య చేశారో చార్జిషీట్లో సిబిఐ స్పష్టంగా పేర్కొంది. కడప ఎంపీ టికెట్ వైఎస్ వివేకానంద రెడ్డి తన కోసం అడగలేదు. వైయస్ షర్మిలకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీనితో వైఎస్ షర్మిలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని కంగారు పడి హత్య చేశారా?, లేకపోతే ఎందుకు ఈ తలనొప్పి అని హత్య చేశారా?? అన్నది తెలియాల్సి ఉందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా ఇతరులు చెబుతున్నట్లుగా, నేరుగా నేను చెప్పలేకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి మరణ వార్త ముందే తెలుసునని పేర్కొనడం ద్వారా సిబిఐ ప్రజల మనసుల్లో అనుమానం మొలికెత్తేలా చేసింది. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్షాలు లేవని సాక్షి దినపత్రికలో రాయడం ఆ అనుమానాలు మరింత బలపడేలా చేస్తోంది .

గూగుల్ టేక్ అవుట్ ఆధారాలతో, దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలంతో ఈ కేసులో నిందితులను సిబిఐ ఫ్రీజ్ చేసింది. కారణాలు ఏవైనా కానీ మెయిన్ ఛార్జ్ షీట్ లో ఉండాల్సిన పేర్లు లేకపోయినప్పటికీ, ఈ కేసులో విస్తృత కుట్ర కోణాన్ని సిబిఐ నిరూపించగలిగింది. గూగుల్ టేక్ అవుట్ ఆధారాలు తప్పని సాక్షి దినపత్రిక తన వార్త కథనంలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. గూగుల్ టేక్ అవుట్ తొలుత ఇండియన్ స్టాండర్డ్ టైం తో కాకుండా, గ్రీన్ టైంలో తీసుకున్నారు.

అయితే తరువాత ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లోనే గూగుల్ టేక్ అవుట్ ఆధారాలను సేకరించి, న్యాయస్థానానికి నివేదించారు. వైఎస్ వివేకా హత్యకు ముందు తర్వాత నిందితులు వైయస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో సమావేశమైన సమయాలను ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లోనే ఆధారాలను రాబట్టగలిగారు.

హత్యకు ముందు రోజు వైయస్ భాస్కర్ రెడ్డి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండగా, వైఎస్ అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ ఆన్ లోనే ఉన్నది. వైయస్ అవినాష్ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి వాట్సాప్ ఆన్ లోనే ఉండడం పరిశీలిస్తే రకరకాల అనుమానాలు తలెత్తడం సహజమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

రెండవ పెళ్లి నేరమైతే… ఆ నేరం ద్వారా పుట్టిన సంతానమే జగన్మోహన్ రెడ్డి
రెండవ పెళ్లి చేసుకోవడమే నేరమని పేర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి , తన ముత్తాత చట్ట విరుద్ధంగా చేసుకున్న రెండవ పెళ్లి ద్వారా జన్మించిన సంతానమే ఆయన అని గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్కడ నుంచి బలపనూరుకు వచ్చారో తెలియని వెంకట్ రెడ్డి తొలుత లక్ష్మమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మంగమ్మ అనే మహిళను కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నారు.

లక్ష్మమ్మకు ఒక కుమారుడు చిన్న కొండారెడ్డి జన్మించగా, మంగమ్మకు ఆరుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు జన్మించారు. కొండారెడ్డికి ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు జన్మించారు. అందులో ఒకరే భాస్కర్ రెడ్డి. ఆయన కుమారుడే అవినాష్ రెడ్డి కాగా, కుమార్తె కుమార్తెనే వైఎస్ భారతి రెడ్డి. చేనేత నేస్తం కార్యక్రమంలో నేతన్నల కష్టాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి తన కష్టాలను చెప్పుకున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అర్థం పర్ధం లేని ఆరోపణలు చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ గురించి అసభ్యంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి పై ఆయన వెంటనే పరువు నష్టం దావా వేయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతారు.

వెంకట్ రెడ్డి చేసుకున్న రెండో భార్య మంగమ్మ మనవడే వైయస్ రాజశేఖర్ రెడ్డి కాగా, ముని మనవడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా ముత్తాత వెంకట్ రెడ్డి కూడా అనుసరించి ఉంటే ఈ రాష్ట్రానికి దరిద్రం దాపురించి ఉండేది కాదని పలువురు అంటున్నారు. ఒక్కరిని వేలెత్తి చూపిస్తే, నాలుగు వేళ్లు మన వైపే చూపిస్తాయని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని ప్రజలు సూచిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

LEAVE A RESPONSE