-సక్సెస్ ఫుల్ గా ఋషికొండ హాం ఫట్
-ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతం… అదేవిధంగా రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఎన్నికలకు ముందు మీకు కూలివానిలాగా పనిచేస్తానని ఒక్క అవకాశం ఇవ్వండి అని బ్రతిమాలిన వ్యక్తులు, ఇప్పుడేమో రాచరికాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఏప్రిల్ నుంచి విశాఖ రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తారని ఉత్తరాంధ్ర పాలెగాడు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ రాజ్యాలేమిటో… పరిపాలించడం ఏమిటో… ఎవరికి వారే రాజులమని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు . బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఒక వ్యవస్థను ఇంకొక వ్యవస్థ మాయ చేస్తోంది. మాయలో పడ్డామని తెలిసికూడా అచేతనవస్థలో ఉన్న వ్యవస్థను సరిదిద్దాలి. మాయలో పడిన వ్యవస్థను సరిదిద్దాలంటే, మరొక వ్యవస్థకు మరమ్మతు చేయాలి. అయినా ఇది మరమ్మత్తుతో బాగుపడే వ్యవస్థ కాదు. బాగుపడని ఈ వ్యవస్థను మార్చాల్సిందేనని పరోక్షంగా న్యాయ, పాలన వ్యవస్థలను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు ఆంక్షలు ఉన్న ఆగని భవన నిర్మాణాలు
ఋషికొండ నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, యదేచ్చగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఋషికొండపై కన్ను వేశారు. జగన్మోహన్ రెడ్డి కన్ను పడితే కొండలైనా కరిగిపోవాల్సిందే. ఋషికొండపై పర్యాటక భవనాలని చెప్పి, ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాస సముదాయానికి సరిపడా భవనాలను నిర్మిస్తున్నారు. గత 12 ఏళ్ల క్రితం ఋషికొండపై నిర్మించిన కాటేజీల స్థానంలో కొత్త కాటేజీలను నిర్మిస్తామని అనుమతులు పొంది, ఇప్పుడు భారీ భవంతులను నిర్మిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఋషి కొండపై 20 వేల చదరపు మీటర్ల లోపు, దాదాపుగా 19 వేల పై చిలుకు చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదే విషయాన్ని విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తాను ఇదే విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో కాటేజీలు నిర్మించిన రెండు ఎకరాల స్థలానికే పరిమితమయి భవన నిర్మాణాలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా, ఇంకా ఎక్కడ నిర్మాణాలను చేపట్టిన సహించబోమని, ఒకవేళ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించిందన్నారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండడం వల్ల, తనని కూడా ఆసక్తి ఉంటే అందులో ఇంప్లిడ్ కావాలని సుప్రీంకోర్టు సూచించింది. గత ఎనిమిది నెలల నుంచి హైకోర్టులో ఋషికొండ ప్రకృతి విధ్వంసం పైన దాఖలైన పిటీషన్ విచారణ కే రావడం లేదు. భవన నిర్మాణాలు చేపడితే సహించబోమని హెచ్చరించిన హైకోర్టు, తమ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని ఆదేశించి సరిపెట్టిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటివరకు నివేదిక అందజేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, కోర్టును మోసగిస్తూనే నిర్మాణాలను యధావిధిగా కొనసాగిస్తోంది. ఋషికొండపై నిర్మిస్తున్నది ఆఫీసు సముదాయాలేనని అందరికీ తెలుసు. అయినా చట్టానికి కళ్ళు లేవు. ఎవరో ఒకరు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే. ఎవరైనా ముందుకు వచ్చి అఫిడవిట్ దాఖలు చేస్తే, పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అడ్వకేట్ జనరల్ వాదిస్తారు. ఆయన మాటలనే న్యాయస్థానం విశ్వసిస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తమ వాదనలు, అరణ్య రోదనగానే మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే అనుమతులు ఎలా ఇచ్చారు?
హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే, ఋషికొండపై అదనపు స్థలంలో భవన నిర్మాణాలకు మునిసిపల్ శాఖ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక ఇవ్వకముందే 12.5 ఎకరాలల్లో నిర్మాణాలకు అనుమతినిచ్చిన మున్సిపల్ శాఖ, ఇప్పుడు ఏకంగా 61 ఎకరాలలో నిర్మాణాలకు అనుమతులను ఎలా ఇచ్చింది. ఋషికొండపై దాదాపు 95 శాతం విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఈ పోరాటంలో తాము ఓడిపోవచ్చు, ఋషికొండను కాపాడుకోక పోవచ్చు. ప్రజల దృష్టికి పాలకుల అరాచకాన్ని తీసుకు వెళ్లడంలో మాత్రం తమ వంతు పాత్ర విజయవంతంగా పోషించామని అన్నారు.
గతంలో ఋషికొండపై
12.5 ఎకరాల ప్రాంగణంలో, 9.5 ఎకరాలను వదిలి , కేవలం రెండున్నర ఎకరాలలో మాత్రమే నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. రెండున్నర ఎకరాలలో భవన నిర్మాణాలకు అనుమతి ఉందని, కొండను మొత్తము తొలచి వేశారు. అదనంగా మరో ఎకరం స్థలంలో కొండను ధ్వంసం చేశామని, దానిని సరి చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పిన మాటలను న్యాయస్థానం విశ్వసించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.. ప్రస్తుతం 12.5 ఎకరాలలో కాదు, 61.5 ఎకరాలలో ఎక్కడైనా భవన నిర్మాణాలను చేపడుతామని ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ చెప్పగానే , ఆగమేఘాలమీద మున్సిపల్ శాఖ అధికారులు అనుమతించడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో నిబంధనలకు లోబడి నిర్మాణాలను చేపడతామని సుప్రీం కోర్టుకు విన్నవించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హైకోర్టు హెచ్చరించినా… అవేవీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. క్షేత్రస్థాయికి వెళ్లి న్యాయమూర్తులు పరిశీలించరు. చట్టానికి కళ్ళు లేవు… న్యాయస్థానాలను మభ్యపెడుతూ , కమిషన్ సభ్యులను ప్రభుత్వ పెద్దలు ఎలా మేనేజ్ చేస్తున్నారో ప్రజలు గ్రహించాలి. వాస్తవాలన్నింటినీ ప్రజా కోర్టు దృష్టికి తీసుకు వస్తున్నాం. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
హవ్వ…ఐదేళ్ల వరకు ఫీజులు చెల్లిస్తామంటే అనుమతిస్తారా?
ఋషికొండపై 20వేల చదరపు అడుగులలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలకు చెల్లించాల్సిన 20 కోట్ల రూపాయల ఫీజులను తాఫీగా, ఐదేళ్ల వరకు చెల్లిస్తామని టూరిజం శాఖ చెప్పగానే మున్సిపల్ శాఖ అనుమతించడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఋషికొండపై కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఎవరిని అనుమతించదు. పట్టపగలే ఋషికొండపై దోపిడీ జరుగుతోంది. ఒకవైపు నిబంధనలను ఉల్లంఘించలేదని చెబుతూనే, మరోపక్క యదేచ్చగా అక్రమ భవన నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. టూరిజం శాఖ నిర్మించే భవనాలను టూరిజానికే వాడుకోవాలనే నిబంధనలేమీ లేవంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు బాహాటంగానే చెబుతున్నారు. అన్నీ తెలిసినప్పటికీ తనలాంటి ప్రజాస్వామ్యవాదులు, విశాఖ ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నామని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ వాసులు ఇప్పటికే తమ ఆస్తులను పోగొట్టుకున్నారు. ఇంకా ఏమేమి పోగొట్టుకోవలసి వస్తుందోనని బెంబేలెత్తి పోతున్నారన్నారు.
పల్లె నిద్రలో భాగంగా పల్లెల్లో నిద్ర చేయడట
పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పల్లెల్లో నిద్రించకుండా, విశాఖపట్నానికి కి వచ్చి పడుకుంటారట అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తారని చెబుతున్న తమ పార్టీ నేతలు, సోమ మంగళవారాలలో మాత్రమే ఆయన స్థానికంగా అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. బుధవారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఏదైనా పల్లెలో చేపట్టి అక్కడ నిద్రించకుండా, విశాఖలోని పోర్టు గెస్ట్ హౌస్ కు వచ్చి నిద్రిస్తారట అని అపహాస్యం చేశారు. గురువారం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకొని వారాంతపు రోజులు అక్కడే గడుపుతారట. తిరిగి ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున విశాఖకు చేరుకుంటారని తమ పార్టీ నేతలు చెబుతున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పల్లె నిద్రలో భాగంగా ముఖ్యమంత్రి ఏ పల్లెకు వెళ్లిన అక్కడ వృక్షాలన్నింటి నరికి వేసే ప్రమాదం ఉంది. బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వెళ్లే ముఖ్యమంత్రి సెక్యూరిటీ కారణాలను సాకుగా చూపి చెట్లను నరికించడం దారుణమన్నారు. ఇక ఋషికొండను సందర్శించే కేంద్ర కమిటీ 500 ఎకరాలలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఔషధ మొక్కలను నాటుతామని ప్రభుత్వం తెలియజేసిందని నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు.
ముఖ్యమంత్రి తోపాటు ఆయన సలహాదారులు, ప్రభుత్వ అధికారులు బస చేయడానికి విశాఖలో ఎన్నో భవనాలు కావాలి. వాటన్నింటికీ ఖర్చును ఎవరు భరిస్తారన్నది ప్రశ్నార్ధకమే. ఒక్క రూపాయి జీతాన్ని తీసుకునే జగన్మోహన్ రెడ్డి, ప్రజలపైనే ఈ భారాన్ని మోపుతారేమోనని అన్నారు. తెనాలి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నెమలి పించాలతో కూడిన నిలువెత్తు దండను వేసిన ఫోటోను రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. నెమలిపించాల దండ కోసం 20 నుంచి 25 నెమళ్ళ బొచ్చు పీకిఉంటారు. నెమలి జాతీయ పక్షి. నెమలిని హింసించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరం. సుమోటో గా కేసు నమోదు చేసి ముఖ్యమంత్రి కి దండ వేసిన వారిపైన, దండ వేయించుకున్న జగన్ పైన కేసులు నమోదు చేయాలి. ఒకవేళ అదే దండ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కి, తనకు వేసి ఉంటే ఈపాటికి తమపై కేసులు నమోదు చేసి ఉండేవారని రఘురామకృష్ణం రాజు అన్నారు. తెనాలి సభకు హాజరైన మహిళలు, వృద్ధులు ఎత్తయిన గోడలని కూడా చూడకుండా దూకి పారిపోవడం గమనార్హం. రాష్ట్రంలోని 175 స్థానాలకు పోటీ చేసే దమ్ము తనకు ఉందని, ప్రతిపక్షాలకు ఆ దమ్ము ఉందా అని జగన్ ప్రశ్నించడం పట్ల, నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చెట్లను చూస్తే భయపడే నీకు అంత దమ్ముందా అంటూ వ్యాఖ్యానిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
రోడ్డు కిరువైపులా ఏపుగా ఉన్న చెట్లను నరికించి, చిన్న మొక్కలు ఉంటే వాటికి మూడు రంగులు వేయడం, చివరకు మొక్కజొన్న పొత్తుల కూడా మూడు రంగులు వేయడం పరిశీలిస్తే, రానున్న రోజులలో సభకు హాజరయ్యే జనాలతో పాటు, అతిధులు కూడా మూడు రంగుల దుస్తులను ధరించాలని నిబంధనలు పెడతారో, ఏమోనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. చర్చీలు కొన్ని చోట్ల కబ్జా అవుతున్నాయని కొంతమంది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, చర్చీల సమస్యలను పరిశీలించి తన దృష్టికి తీసుకురావడానికి ఒక సలహాదారున్ని నియమిస్తానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడాన్ని పరిశీలిస్తే, సలహాదారుల మధ్య తలెత్తే సమస్యలను కూడా పరిష్కరించడానికి ఒక సలహాదారున్ని నియమిస్తారేమోనని తాడేపల్లి కారిడార్ లో చెప్పుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 8 లక్షల పైచిలుకు రైతుల అకౌంట్లోకి కోట్లాది రూపాయలు జమ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందిస్తూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. విజయ సాయి ట్వీట్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అబద్ధం చెబితే… జాతీయ కార్యదర్శి నిజం చెప్పారని వ్యాఖ్యానించారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను ఒక లేఖ రాసినట్లుగా రఘురామకృష్ణం రాజు వివరించారు. ప్రధానమంత్రి బటన్ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ నొక్కి ఆయనే రైతుల ఖాతాలో నగదు జమ చేసినట్లుగా భ్రమింపజేసే ప్రయత్నం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేరును మార్చి రాష్ట్రంలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ గా అమలు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ పథకం పేరును జగనన్న గోరుముద్దగా మార్చారని ప్రధానికి తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. గతంలోనూ తాను ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, మరోసారి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లగా, వారు తీవ్ర హెచ్చరికలు చేసినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. అడిగినన్ని అప్పులు ఇస్తోన్న ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళామని, ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని రఘురామకృష్ణంరాజు తెలిపారు .
విద్య అనేది అందరి హక్కు
విద్య హక్కు ను అందరికీ కల్పిస్తూ, గతంలో తీసుకువచ్చిన చట్టం న్యాయ బాలరిష్టాలను దాటుకుని గత ఏడాది నుంచి అమలులోకి వచ్చిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ నిర్బంధ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు చట్టం తీసుకువచ్చింది. అయితే నిర్బంధ విద్యా విధానానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫీజు వాటా తేలేకపోవడంతో కోర్టు చిక్కులను ఎదుర్కొంది. న్యాయ సమస్యలన్నీ పరిష్కారమైన తరువాత సర్వ శిక్ష అభియాన్ పేరిట రైట్ టు ఎడ్యుకేషన్ ను అమలు చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25 శాతం సీట్లను కేటాయించాలి. ప్రైవేటు స్కూల్లో చేర్చినవారికి ఫీజులో రాయితీ ఇవ్వబడుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ కు ప్రత్యామ్నాయంగా గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను తీసుకువచ్చారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అయితే వాటిని జగన్మోహన్ రెడ్డి ఎత్తివేశారు. తనకు తానే అభినవ వీరేశలింగం గా భావిస్తూ, ప్రైవేటు స్కూళ్ల ఫీజులను నిర్ణయించి ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడి పథకంలో నుంచి ఫీజులను కట్టుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. సర్వ శిక్ష అభియాన్ లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను భరిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థిపై 40 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేస్తుంది. అమ్మ ఒడి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లులకు 15 వేల రూపాయల నుంచి 2000 రూపాయలు తగ్గించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగనన్న ఇచ్చారని చెప్పి అందజేస్తుందంటూ రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. అమ్మ ఒడి పథకంలో భాగంగా ఇంట్లో ఒక్కరికే అర్హత ఉంటుంది . ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వారికి రైట్ టూ ఎడ్యుకేషన్ లో ఫీజు ఎవరు చెల్లిస్తారు?. అమ్మఒడి పథకం కింద డబ్బు ఇచ్చి, కేంద్రం దగ్గర 60 శాతం తీసుకుంటారు.
రైట్ టు ఎడ్యుకేషన్ లో భాగంగా తామే మొత్తం ఫీజును చెల్లించామని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడిపథకం భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాన్ని చేస్తోంది. అమ్మఒడి పథకం లబ్ధిదారులంతా, రైట్ టు ఎడ్యుకేషన్ కు అర్హులే. రైట్ టు ఎడ్యుకేషన్ ను తానేదో క్రియేట్ చేసినట్లుగా జగన్ చెప్పుకునే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఇంగ్లీష్ మీడియానికి, తెలుగు మీడియానికి పోటీ అంటూ తెనాలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదం. రాష్ట్రంలో ఎప్పటినుంచో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లు వాటి సంఖ్యను మరింత విస్తరింప చేశారు. జగన్మోహన్ రెడ్డి తన నాలుగేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయుడిని కూడా కొత్తగా నియమించింది లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు . తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో మధ్య పోరాటం అని పేర్కొన్న జగన్, అదే తెలుగు మాస్టర్ ల చేత ఇంగ్లీష్ పాఠాలు ఎలా చెప్పిస్తున్నారని ప్రశ్నించారు. భాషా ప్రావీణ్యం అనేది అవసరమే. ఇంగ్లీషులో ప్రతి ఒక్కరూ నేర్చుకొని మాట్లాడాలి. అలాగని గురువుల వ్యవస్థ ఎత్తివేసి బైజుస్ ను తీసుకువస్తానంటే, ఇంగ్లీష్ మీడియం తెస్తానంటే ప్రతిపక్షాలు వద్దంటున్నాయని పేర్కొనడం సిగ్గుచేటు. రైట్ టు ఎడ్యుకేషన్ లో భాగంగా వికలాంగులకు కూడా కోటా కేటాయించాలి. 40 శాతం నిధులను చెల్లించవలసి వస్తుందని వారిని అనర్హులుగా చేస్తారా?, ఈ విషయమై వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులకు స్పష్టత ఇవ్వాలి. విద్యా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని సందర్శించి రాష్ట్రంలోనూ అదేవిధంగా పాఠశాలలో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించి, వారిని ఆంగ్ల మధ్యంలో పాఠాలను బోధించేలా తర్ఫీదును ఇవ్వాలన్నారు.
విద్యను అందించగలిగితే… ప్రభుత్వ పథకాలే అవసరం ఉండదు
పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలిగితే ప్రభుత్వ ఉచిత పథకాలు అందించాల్సిన అవసరం ఉండదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. వ్యవస్థను పాడు చేయవద్దని, చదువును ఇవ్వగలిగితే మీరిచ్చే ఉచిత పథకాల అవసరం ఉండదు. నూతన ఉపాధ్యాయులను నియమించి, ప్రభుత్వ పాఠశాలల ను మూసి వేయకుండా విద్యను అందించాలి. నిరుపేదలకు ఎన్నో పథకాలు అందిస్తున్నాం. కోట్లాదిమంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఎందుకంటే అంతమంది పేదలను ప్రభుత్వమే తయారు చేసినట్లే . మెరుగైన మౌలిక వసతులను కల్పించి విద్యను అందిస్తే వారి కాళ్లపై వారే నిలబడతారు. అంతేకానీ పేదలు పేదలు గానే ఉంటే అధికారం తమ చేతుల్లో ఉంటుందనే ఆలోచన విధానాన్ని విడనాడాలని రఘురామ కృష్ణంరాజు హితవు పరికారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని వైయస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు పై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని సూచించింది. అయితే కొన్ని పత్రాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండడం వల్ల విచారణ ఆలస్యం అవుతోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో హంతకులు ఇప్పటికే దొరికినప్పటికీ అసలు సూత్రధారులు ఎవరో తేల్చి తమ పార్టీ మనోవ్యధను తీర్చాలని కోరారు.