-ఎవరికి వారే లెక్కలు వేసుకోవాలి… గడపగడపకు వచ్చే ప్రజాప్రతినిధులను నిలదీయాలి
-ఏపీలో కొత్తగా వచ్చే పరిశ్రమలు లేవు… ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చే ఛాన్స్ లేదు
-ప్రజలపై పన్నులు వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని సర్కార్ ప్లాన్
-బీసీ ఎస్సీ లంటే తమకు గౌరవమని… ఆడబిడ్డలను అవమానిస్తారా? ఇదేనా మన సంస్కారం??
-పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చ తెస్తున్నా సి బి సి ఐ డి విభాగం
-సి బి సి ఐ డి కి అతి స్వేచ్ఛ ను ఇవ్వడం సరికాదు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది ఎంత?, ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో కొట్టేసింది ఎంత??, ఎవరికి వారే లెక్కలు వేసుకోవాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు సూచించారు. బటన్ ఒక్కడు కార్యక్రమం అంతా మోసమని, ఈ విషయాన్ని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాలన్నారు. 2018-19 ఆర్థిక వార్షిక సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చింది ఎంతో, ప్రజలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది ఎంతో లెక్కలు వేసుకొని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలన్న ఆయన, ఈ విషయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తీసుకు వెళ్ళమని సూచించాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంతో చేయాలని అనుకుంటున్నారని,. కానీ ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని ప్రజా ప్రతినిధులుగా చెప్పమని వారిపై ఒత్తిళ్ళు పెంచామన్నారు.. ప్రజా ప్రతినిధులు ఎలాగో ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేదు కాబట్టి, ప్రభుత్వం తమకు ఇచ్చింది ఎంత?, తమ వద్ద నుంచి వసూలు చేసిన అది ఎంత?? స్పష్టంగా వివరిస్తూ ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోస్టు కార్డు పై వివరంగా రాసి, పోస్ట్ చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చింది తక్కువ, ప్రజల నుంచి కొట్టివేసింది ఎక్కువ, రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా కొట్టేసేందుకు పథక రచన చేస్తుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అధికారులతో సమావేశమై పగడ్బందీగా పన్నులను వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారని తెలిపారు.
ప్రజలపై కొత్త పన్నులు వేసి ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలన్నది దానిపై కసరత్తు చేయాలని ఆదేశించినట్లు తెలిసిందన్నారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు వస్తున్న ఆదాయం ఎంత?, ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నది ఎంత?? అన్నదానిపై కూలంకషంగా చర్చించారు. అమ్మఒడి పథకం ద్వారా ఒక కుటుంబానికి 15000 వేలు లు ఆదాయం… అంటే ఇందులో 2000 రూపాయల కటింగ్ పోను, 13000 వేలు లభించింది అనుకుందామ న్నారు.. అయితే అమ్మ వాడి పథకం వెయ్యి చదరపు అడుగుల ఇల్లు ఉన్న వారికి, 300 యూనిట్ల విద్యుత్ ను వినియోగించే వారికి లభించదన్న ఆయన, ఈ పథకం కేవలం దిగువ మధ్యతరగతి వర్గాల వారికే లభించే అవకాశం ఉందన్నారు. ఇక 60 ఏళ్ల వృద్ధుల విషయానికి వస్తే, భార్యాభర్తల్లో ఒకరికి పెన్షన్ లభిస్తుందని, వారికి స్కూల్లో చదివే చిన్నపిల్లలు ఉండే అవకాశం లేదు కాబట్టి అమ్మఒడి పథకం వర్తించదని స్పష్టం చేశారు. “”నిత్యం ప్రజల శ్రేయోభిలాషి… ప్రజల శ్రేయస్సుకోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడే విశిష్ట విలువలున్న, విశిష్ణున్ని మించిన వైఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి” పేదల సంక్షేమం కోసం మద్యం క్వార్టర్ పై , గత ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో పోలిస్తే నూట నలభై రూపాయలు అదనంగా పెంచారన్నారు.
ఒక దిగువ మధ్యతరగతి కుటుంబీకుడు రోజుకు ఒక క్వార్టర్ చొప్పున తాగిన, రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా ఏటా అతని వద్ద నుంచి 51 వేల రూపాయలను దో చేస్తుందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. మద్యం ఆదాయం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం వల్లే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతున్నాయని ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, బ్రాండెడ్ విస్కీ, బ్రాందీ లను విక్రయించే వారు అన్నారు. అప్పట్లో క్వార్టర్ 60 రూపాయలు ఉండగా, జగనన్న పెద్ద మనసుతో దాన్ని 200 రూపాయలు చేశారని ఎద్దేవా చేశారు.
గతంలో ఇల్లు కట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షా ఎనభై వేల రూపాయలతో, చిన్న ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యేదని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో అదనంగా నిర్మాణ దారుడు పై లక్ష రూపాయల భారం పడుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక ట్రాక్టరు ఆరువందలకు లభిస్తే, ప్రస్తుతం అరు వేలైన లభించే పరిస్థితి లేదన్నారు. భారతి సిమెంట్ బ్యాగ్ ధర 400 రూపాయలు దాటిందని, గతంలో సిమెంట్ బ్యాగ్ ధర 240 నుంచి 250 వరకు పలికే దని వెల్లడించారు.. భారతి సిమెంట్ బ్యాగు ధర నాలుగు వందలకు చేరుకోవడంతో, ఇతర సిమెంటు కంపెనీలు కూడా తమ బ్యాగు ధరలు అనివార్యంగా పెంచాయన్నారు. లేకపోతే కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయన్న సాకుతో కంపెనీని మూసివేసే అవకాశం లేకపోలేదన్నారు..
విద్యుత్ బిల్లులు గతంలో 300 రూపాయలు వస్తే, ఇప్పుడు మూడు వేల ఆరు వందల రూపాయలు వస్తున్నాయన్న ఆయన, ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా 40 శాతం పెంచారని చెప్పారు. ప్రజలపై డ్రైనేజీ , చెత్త పన్ను చాలవన్నట్టు గా భూ సర్వే ద్వారా శాశ్వత భూ హక్కులను కల్పిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సర్కార్, విచిత్రమైన ఓ టి ఎస్ పథకాన్ని
ప్రవేశపెట్టిందని విమర్శించారు.
సెలూన్లు ప్రారంభిస్తున్న మంత్రులు
రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు ఎలాగో రావని, ఇద్దరు మంత్రులు విడదల రజిని, జోగి రమేష్ లు సెలూన్ లను ప్రారంభించారన్నారు. సెలూన్లలను ప్రారంభించిన ఔదార్యాన్ని అభి నందించాలా? ఇంకా రాష్ట్ర అభివృద్ధి ఎలాగో లేదని బాధ పడలా అన్నది అర్థం కావడం లేదన్నారు.
గౌతు లచ్చన్న మనుమరాలిని అవమానిస్తారా?
స్వాతంత్ర సమరయోధులు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన సర్దార్ గౌతు లచ్చన్న ఎంతో మహోన్నతమైన నాయకుడని, ఆయన మనవరాలు గౌతు శిరీష ను ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేసిందన్న కారణంగా వేధించడం దారుణమని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. గౌతు లచ్చన్న 1948లో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఏక కాలం లో విజయం సాధించి, ఆ తరువాత ఎంపీ పదవిని త్యజించి, ఎంపీగా ఓటమిపాలైన ఎన్ జి రంగా ను గెలిపించి పార్లమెంటుకు పంపించారన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన గౌతు లచ్చన్న తో పోలిస్తే, ఇప్పుడు తామే అంత అని చెప్పుకుంటున్న నేతల అడ్రస్ కూడా ఎవరికీ తెలియదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.. గౌతు లచ్చన్న తోపాటు ఆయన కుమారుడు గౌతు శ్యామ్ సుందర శివాజీ కూడా ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని అని తెలిపారు. అటువంటి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీషను ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు పలాస నుంచి గుంటూరు సిబిసిఐడి కార్యాలయానికి పిలిపించి, ఏడు గంటలపాటు వేధించడం పోలీస్ జులుం కు పరాకాష్ట అని పేర్కొన్నారు. తగుదునమ్మా అంటూ ఈనెల 20వ తేదీన గౌతు శిరీషను మరొకసారి గుంటూరుకు రావాలని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా, వేధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గౌతు శిరీష ఈ కేసులో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, న్యాయస్థానం ఎలాగో పోలీసులకు చివాట్లు పెడుతుందని చెప్పారు. గౌతు శిరీష కచ్చితంగా న్యాయస్థానం వేసవి సెలవుల అనంతరం ప్రారంభం కాగానే ఆశ్రయించాలని సూచించారు. ఎవరైనా తప్పు చేస్తే నోటీసులు ఇవ్వాలని, అంతేకాని తప్పు చేయకుండానే ఎవరికైనా ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు.
పోలీసుల జులుం ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలకు విశదీకరించారని విషయం తెలిసిందే నన్న ఆయన, ఒక ఎంపీని సిఐడి అధికారులు కస్టడీ లోనే చంప బోయారన్నారని బాబు పేర్కొనడాన్ని గుర్తు చేశారు. అవును… తనని పోలీసులు నిజంగానే కస్టడీలో చంప బోయారని చెప్పారు. తన వ్యవహారంలో సుమోటోగా పోలీసులు కేసు వేశారని, ఫిర్యాదు చేసింది ఎవరో చెప్పకుండా, కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. అతి చేసే పోలీసులపై కేసులు వేసి శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. న్యాయస్థానాలకు వెళ్లి, పోలీసులు చేసే అతిని ప్రస్తావించాలని సూచించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు ఈ వ్యవహారంలో పోలీస్ కస్టడీకి అడగకుండానే, జుడిషియల్ కస్టడీ పంపడం అరుదైన సంఘటన అని, ఈ ఘనత సాధించిన రాష్ట్ర డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డిని అభినందిస్తున్నానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీబీసీఐడీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్ర పోలీసు వ్యవస్థ కి మాయని మచ్చగా తయారయిందని ఆయన అన్నారు. సిబిసిఐడి అధికారులకు అతిగా స్వేచ్ఛ నివ్వడం సరికాదని పేర్కొన్నారు. బీసీ ఎస్సీ లంటే తమకు గౌరవమని సామాజిక బస్సు యాత్ర చేసిన మంత్రులను తను సూటిగా ప్రశ్నిస్తున్నానని, ఒక మహా నేత మనుమరాలు అవమానించడమే బీసీలకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు.. ప్రజలు దీన్ని హర్షిస్తారా ? అని నిలదీశారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పార్టీ మీటింగ్ లో తోడ కొడితే, అడ్డగోలుగా అసహ్యపు కామెంట్లు చేస్తారా? అంటూ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. గ్రీష్మ తాత గారు ఆయన తన హయాంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గా ఎన్నికై, ఆ తరువాత హైకోర్టు జడ్జి గా కూడా విధులను నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతిభా భారతి స్పీకర్ గా పని చేశారని, తాత, తల్లి బాటలోనే గ్రీష్మ కూడా ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడాన్ని గౌరవించాలన్నారు.
బీసీల అంటే బలహీనవర్గాలు కాదని బ్యాక్ బోన్ కులాలని చెప్పుకునే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లు గౌతు శిరీష, గ్రీష్మ ల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూసి, బిసి ఎస్సి లకు ఇచ్చే గౌరవం ఇదేనా?, ఇదే మన సంస్కార మా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కూడా బెదిరింపులా?
తన నియోజకవర్గంలో తన పేరిట ఎవరైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి పోలీసులకు ఫోన్ చేసి వాటిని తొలగించాలని బెదిరిస్తున్నారన్నారు. ఎవరైనా మీరే తొలగించండి అంటే… మేము తొలగిస్తే ఎవరైనా వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అందుకే మీరే తొలగించాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ మేము తొలగించకపోతే ఏం చేస్తారని ప్రశ్నించిన వారిని, ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం కింద కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. తన ఇంటి ముందే జగన్మోహన్రెడ్డి నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసిన ఎటువంటి చర్యలు తీసుకొని పోలీసులు, తన ఫ్లెక్సీలను ప్రైవేటు స్థలాలలో ఏర్పాటుచేసిన తొలగించే వరకు విశ్రమించడం లేదని విరుచుకుపడ్డారు.. మీకు కటౌట్ ఉంటే, తనకు కంటెంట్ ఉందని… కంటెంట్ ఉన్న వారిని కటౌట్లు ఉన్నవాడు ఏమీ చేయలేడని అన్నారు. పోలీసులు గుర్తించాల్సిన విషయం ఒకటి ఉన్నదని పోలీసు ప్రభుత్వము పోయి, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నవాళ్లు చెప్పినట్లుగా ఆడిన పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఎంపీల గౌరవం పెంచితే మంచిదే కదా
బందర్ లో తిష్టవేసి ఎంపీల గౌరవం పెంచుతామని వల్లభనేని బాలశౌరి పేర్కొనడాన్ని తాను స్వాగతిస్తున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎంపీలకు మినహా ఎవరికీ గౌరవం లేదన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి లకు తప్పితే, ఇతర ఎంపీలకు గౌరవమే లేదన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సమస్యలు సృష్టించే వ్యక్తి కాదని, సమస్యలు పరిష్కరించే వ్యక్తిని పేర్కొన్నారు. తమ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఆయన వ్యవహరించారని, నాని తో పాటు ఎన్నో సమావేశాలలో పాల్గొన్న వ్యక్తిగా ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకం ప్రచారం ఫ్లెక్సీలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చిత్రాలే ఉండడాన్ని కేంద్రమంత్రి భారతీ పవర్ తీవ్రంగా ఆక్షేపించారని తెలిసిందన్నారు. ప్రధాన మంత్రి మోడీ ఫోటో ఎక్కడ అని ప్రశ్నించడంతో బిక్క ముఖం వేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వంతయిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ లను కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిర్మిస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు, మన్ రేగా ద్వారా రాష్ట్రానికి విడుదలయిన నిధుల వివరాలను వెల్లడించారు. రాష్ట్రానికి, కేంద్రం దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా మన్ రేగా నిధుల విడుదల చేసిందని తెలిపారు. ఈ జాబితాలో ఏపి రెండవ స్థానంలో ఉందని, అయినా కూడా కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారని విమర్శించారు.