-గోరంత సాయం కొండంత ప్రచారం చంద్రబాబు నైజం
-పచ్చమీడియాకు పైత్యం
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
గోదావరి ప్రజలు వరదల కంటే చంద్రబాబునాయుడిని చూస్తేనే ఎక్కువగా భయపడతారని, గతంలో గోదావరి పుష్కరాల్లో షూటింగ్ పేరుతో ఓవర్ యాక్షన్ చేస్తూ 27 మంది నిండు ప్రాణాలు బలిగొన్న సంఘటన అక్కడి ప్రజలకు నేటికీ పీడకలగా వెంటాడుతూనే ఉందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో వరద ప్రాంతాల పర్యటన అంటున్న చంద్రబాబు తన బిల్డప్పులతో మళ్ళీ ఏ ఉపద్రవం తీసుకొస్తాడోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజలు నిన్ను తరమకుండా చూసుకోవాలని చంద్రబాబుకు హితవుపలికారు.
హెలికాప్టర్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన చంద్రబాబు ధీటుగా బదులిచ్చారు. గతంలో చంద్రబాబు హెలికాప్టర్లో టిఫిన్ చేసి.. గ్రామానికి రూ. 500 తక్షణ వరద సహాయం ఇవ్వాలని అధికారులకు అదేశించిన విషయాన్ని గుర్తుచేసారు. చంద్రబాబులా గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకోవాలని తెలియని సీఎం జగన్ రూ.8.5 కోట్లు విడుదల చేసి మరీ ప్రచారానికి దూరంగా ఉండి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
పచ్చకుల మీడియా పైత్యానికి, ఊహాజనిత రాతలకు హద్దే లేకుండా పోయిందని, ఇక ప్రైవేటుకే మద్యం షాపులంటూ కట్టు కథలు వండి వారుస్తోందని అన్నారు. మద్యం షాపుల నిర్వహణ బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ శాపనార్థాలు పెట్టిందని, బెల్టు షాపులు ఎత్తేసినప్పుడు విపరీతంగా శోకాలు పెట్టిందని గుర్తుచేసారు.
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా జగదీప్ ధంఖర్ ను ఎంపిక చేశారన్న వార్త తనను ఎంతో సంతోషానికి గురిచేసిందని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉపరాష్ట్రపతిగా అద్భుతమైన సహకారం అందిస్తారని, ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తారని నమ్ముతున్నానని అన్నారు.
సింగపూర్ ఓపెన్ 2022 లో మహిళల సింగిల్స్ విభాగంలో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు బంగారు పథకం కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఈ సీజన్లో ఆమెకు ఇది మూడవ టైటిల్ సాధించడం గర్వంగా ఉందని, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు.