Suryaa.co.in

Andhra Pradesh National

పీవీ మాటలను తలపిస్తున్న రాహుల్‌ గాంధీ పంచదార పలుకులు

-ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనన్న పీవీ గారి మాటలను తలపిస్తున్న రాహుల్‌ గాంధీ పంచదార పలుకులు
( వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)

భారత్‌ జోడో యాత్ర పేరుతో దక్షిణాది నుంచి ఉత్తరాదికి కాలినడకన బయల్దేరిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుక్రవారం దివంగత కాంగ్రెస్‌ ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావు మాటలు గుర్తుకొచ్చే రీతిలో మాట్లాడారు. యాత్ర మొదలైన కన్యాకుమారి సమీపంలో విలేఖరులతో మచ్చటిస్తూ, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాననీ, ఒక వేళ తాను పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడకపోతే దానికి కారణం ఏమిటో సవివరంగా చెబుతానని 52 ఏళ్ల యువ నేత రాహుల్‌ సెలవిచ్చారు.

తాను ఇదివరికే వెలగబెట్టిన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీపై యువరాజు రాహుల్‌ ఇంత గందరగోళంగా, అంతులేని గోప్యతతో ఎందుకు మాట్లాడుతున్నారో కాంగ్రెస్ సానుభూతిపరులకు సైతం అర్ధంకావడం లేదు. దేశం సంక్షుభిత సమయంలో ఉండగా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పీవీ నరసింహారావు గారు అనేక క్లిష్ట సమస్యలపై కేంద్ర సర్కారు నిర్ణయాలను వాయిదా వేసేవారు. ఆయన ‘నిర్ణయరాహిత్యం’, ఉదాసీన వైఖరిపై విమర్శలు ఓ సందర్భంలో వెల్లువెత్తాయి. అప్పుడు ఆయన ‘ ఏ విషయంపైనైనా ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయం తీసుకోవడం కిందికే వస్తుంది,’ అని ముసిముసి నవ్వులతో మీడియాతో అన్నారు.

పీవీ గారి మాదిరిగానే రాహుల్‌ జీ కూడా తాను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత రాజీనామా చేసిన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని మళ్లీ తీసుకోవడంపై ఏ నిర్ణయం ప్రకటించకుండా తాత్సారం చేస్తున్నారు. ఆయన ఈ విషయంలో చేస్తున్న జాప్యం, ‘నిరాసక్త’ వైఖరి మహానుభావుడు పీవీ గారి మాటలను గుర్తుకు తెస్తున్నాయి. ఆ రోజుల్లో సర్వ శక్తిమంతుడైన ప్రధాని కాబట్టి పీవీ ఏం మాట్లాడినా చెల్లింది.

మరి, కుటుంబ నియోజకవర్గం అమేఠీలో స్వయంగా ఓడిపోయి, పార్లమెంటు దిగువ సభలో కాంగ్రెస్‌ బలాన్ని 44 నుంచి 52 సీట్లకు మాత్రమే పెంచగలిగిన రాహుల్‌ ఇప్పుడు ఎడాపెడా మాట్లాడితే కుదరదు. ఆయన మాటల్లో స్పష్టత ఉండాలి. చేతల్లో సైతం పారదర్శకత కనిపించాలి. పార్లమెంటులోకి అడుగుబెట్టి (2004) 18 సంవత్సరాలు దాటిపోయాక కూడా రాహుల్‌ భయ్యా రాజ మకుటం చూసి పారిపోయే ‘రిలక్టంట్‌ ప్రిన్స్‌’ మాదిరిగా కబుర్లు చెబితే జనం మెచ్చరు. ‘వినమత్రత’తో రంగరించిన ఆయన మాటలు అహంభావానికి, రాజరిక మానసిక ధోరణికి అద్దం పడుతున్నాయని అనుకునే ప్రమాదం కూడా ఉంది.

LEAVE A RESPONSE