వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ప్రతిపక్షనేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుర్మార్గాలు, దుష్ప్రచారాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. తప్పుడు ప్రచారం చేసే టీడీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తుంటారు. తాజాగా చంద్రబాబు నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి టీడీపీ భేటీలపై వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ స్టోరీని పోస్టు చేశారు.
ఆ స్టోరీ ఏంటంటే..
“గత రెండు రోజులుగా టీడీపీ నియోజకవర్గ నేతలతో పార్టీ నేత చంద్రబాబు నాయుడు ముచ్చటిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు, దూకుడు పెంచాలని వారిని ఆయన కోరారని తెలుగుదేశం అనుకూల పత్రికల్లో బుల్లిబుల్లి వార్తలొస్తున్నాయి. శాసనసభ స్థానాల వారీగా పార్టీ ‘బాధ్యులను, ఆశావహులను’ ఎన్నికలకు ఇరవై మాసాల ముందు తొందరపెడుతూనే, హుషారు చేయడం 43 సంవత్సరాల పరిశ్రమ ఉన్న పార్టీ అధినేత ఇన్నాళ్లకు చేస్తున్న మంచి పని అని తెలుగుదేశం నేతలు, శ్రేణులు సంబరపడుతున్నాయట. ఓ పక్క ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. మరోపక్క టీడీపీ యంత్రాంగం నీరసించి మూలుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలను, కార్యకర్తలను ముందుకు పరిగెత్తించడానికి ముఖ్యమంత్రిగా దాదాపు 14 ఏళ్ల అనుభవం ఉన్న నారా నాయుడు అప్పుడప్పుడైనా అమరావతి నివాసానికి రావడం మంచి పరిణామమే! రావడమే కాదు 2024 అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడడం, అభ్యర్థిత్వాలను ‘తాత్కాలికంగా ఖరారు చేయడం’ కూడా పచ్చచొక్కాల పార్టీ వారికి శుభవార్తే. ‘పార్టీ అసెంబ్లీ ‘టిక్కెట్’ నీకే. ‘డబ్బులు’ కూడబెట్టుకోండి.’ అంటూ ‘కాబోయే’ కేండిడేట్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయడం తెలుగు ప్రజలకేమోగాని టీడీపీ శ్రేయస్సు కోరే పత్రికలకు ఆనందదాయకంగా ఉందట.”