Suryaa.co.in

Features

మారుతి దివ్యచరణాలపై ఎమ్మెస్ అద్భుత చరణాలు!

(నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి)

*శ్రీ హనుమాను*
*గురుదేవు చరణములు*
*ఇహపరసాధక శరణములు..*
*బుద్ధిహీనతను*
*కలిగిన తనువులు*
*బుద్భుదములని*
*తెలుపు సత్యములు..*

ఈ చాలీసా..ఆ స్వరం..
ఎమ్మెస్ రామారావు
జీవితసారం..
ఆయన అనుభవసారం!

వాయుసేనలో కొలువు చేస్తున్న కొమరుడు
యుద్ధసమయంలో కనిపించకుండాపోతే
అంజనా కొమరుడు..
వాయునందనున్నే
నమ్ముకుని ప్రార్థించగా
తిరిగివచ్చెనట సుతుడు..
పుట్టుకొచ్చిందపుడు
పవనసుతుని స్తుతి..
ఆంజనేయుని సన్నుతి…
తెలుగులో హనుమానచాలీసా..
రాసిన ఈ రామారావు అభినవ తులసీదాసా..!

ఎమ్మెస్ రామారావు ఆలపిస్తుంటే
హనుమాన్ చాలీసా
అదేమి మైమరపు..
అదెంత పారవశ్యం..
కళ్ళెదుట కనిపించే దృశ్యం
మారుతి మన ముందు కూర్చున్నట్టే…
రామయ్య తండ్రి కటాక్షం దొరికేసినట్టే!

చిన్నప్పుడే శృతి
చేశాడట గొంతు
అవి కాదండోయ్
లొల్లాయి పాటలు..
అవే పాటల పూదోటలు..
సినీ నేపథ్యగానానికి బాటలు
అంతవరకు ఎవరి పాటలు
వారే పాడుకునే నాయకులు
కాలేదు ఆకట్టుకునే గాయకులు..
ఎమ్మెస్ సవరిస్తే గొంతు..
కొనసాగింపు అయింది
ఎందరో గాయకుల వంతు..!

ఆ స్వరంలో మార్దవం..
శిలలనైనా కరిగించే మాధుర్యం..
ఎంతటి ఆర్ధ్రత..
ఆలాపనలో ఒక విలక్షణ శైలి
తనే రచించుకున్న పద్యాలకు
తానే నిర్వచించుకున్న
అద్భుత రాగాలు..
భక్తి తరంగాలు..!
ఆ చిరంజీవి చాలీసా
చేసింది ఈ సుందర రాముని
జన హృదయాల్లో చిరంజీవిగా..!

హనుమాన్ చాలీసా అందించిన
ఎమ్మెస్ రామారావు గారికి
కృతజ్ఞతలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE