బాబూ..వినరా..ఇది నీ కథే..!

ఆయన..
ఎన్నో వివాదాలకు కేంద్రబిందువు..
ఇంకెన్నో ప్రశంసలకు
హేతువు..
తెలుగునేల అభివృద్ధికి సేతువు…
తెలుగుదేశం పార్టీ మూలవిరాట్టు..
రాజకీయ పరిశోధనల ఆర్యభట్టు..
పదవీ రాజకీయాల కనికట్టు..
భారత రాజకీయాల సామ్రాట్టు..!

*నారా చంద్రబాబు నాయుడు*
సుపరిచితం ఈ నామధేయం
అధికారమే ధ్యేయం..
పదవి వచ్చేదాకా
దానిపైనే దృష్టి..
ఆపై అభివృద్ధి సృష్టి..
అప్పుడప్పుడు అవసరమైన అంశాలపై వక్రదృష్టి..
నేర్చిన కళలు మాత్రం చతుశ్శష్టి..!

రాజకీయ జీవితం ఆసాంతం ఆటుపోటు..
నిందల కాటు..
పరాకాష్టగా వెన్నుపోటు…
పిల్లనిచ్చిన మామ
కట్నకానుకలు ఏమిచ్చాడో
ఏమో కాని…
ఆయన పార్టీని..
ఆయన పదవిని..
చేసుకుని సొంతం..
సై’కిల్’ ని లాగేసుకుని ఆసాంతం..
అప్పుడయ్యాడు ప్రశాంతం!
ఈ మొత్తం కథలో
నందమూరి రెండో నాయకి
అయ్యింది ప్రతినాయకి..
ఆమె అప్పట్లో
రాజ్యాంగేతర శక్తి..
అందుకే ప్రయోగించక తప్పలేదు బాబు యుక్తి..
ఏమో..అది కావచ్చు
అతగాడి కుయుక్తి..!

*ఏదిఏమైనా బాబంటే*
అభివృద్ధి సారథి..
నవ్యాంధ్ర నిర్మాత..
రింగ్ మాస్టర్..
ఘటనాఘట సమర్ధుడు..
జాతీయ రాజకీయాలనూ
ఒకనాడు శాసించిన షోమాన్
ఒక్క గేమ్ వికటించి
బోల్తా పడ్డాడీ విపంచి..!

*విజన్ 2020..*
బాబు బ్రాండు..
ఈలోగా మారిపోయి ట్రెండు
ఆ సమయానికి ఆయనే కుర్సీపై లేకపోయిండు..
ఫిరాయిస్తూ ప్లేట్లు…
కొని తెచ్చుకుని పాట్లు..
ఇప్పుడు పార్టీయే కునికిపాట్లు..
వేస్తూ 2024 కోసం
కొత్త కొత్త ప్లాట్లు..
కేడర్లో నానాటికీ
తగ్గిపోతున్న ప్లేట్లెట్లు!!

*బాబూ…*
గెలుపు వ్యూహాలు ఓకే..
అయితే కాస్త నిజాయితీ..
నందమూరి ఫ్యామిలీ కాదయ్యా
నీ చేతిలో దస్త్రం..
అది నీ పొదిలో అస్త్రం..
వాడుకుని వదిలేయడం కారాదు వేడుక…
అలా చేస్తూ పోతే ఎల్లకాలం పారదు పాచిక..
విశ్వసనీయతే విజయానికి
ఏకైక దారి..
అది పెంచుకుంటేనే దాటగలవు
పరాజయాల ఎడారి..!
జన్మదిన అభినందనలతో..

*ఇ.సురేష్ కుమార్*

Leave a Reply