-ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చింది ఆయనే
-అలాంటి ఐఏఎస్-ఐపిఎస్‌లకు కీలక బాధ్యతలు వద్దు
ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రకు సీఎంఓలో కీలక బాధ్యత అప్పగించడంపై సీఎం చంద్రబాబునాయుడుతో కలసి ఎస్వీ యూనివర్శిటీలో చదివిన సామాజిక ఉద్యమకారుడు, వామపక్ష నేత టి.లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్దాడ మాజీ సీఎం జగన్ భక్తుడని, తెలుగు వారి హృదయాలను గాయపరిచిన ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చింది ఆయనేనని గుర్తు చేశారు. ఆ మేరకు లక్ష్మీనారాయణ, సీఎం చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారు. లేఖ పూర్తిపాఠం ఇదీ..
కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి బహిరంగ లేఖ
నమస్తే! మీరు మరొకసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్న శుభ సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఐదేళ్ళుగా రాజ్యాంగం – చట్టాల పట్ల లెక్కలేనితనంతో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసం – విద్వేషం – ప్రజల మధ్య విభజన – విచ్ఛిన్నకర విధానాలతో అప్రజాస్వామిక – అరాచక – అడ్డగోలు – దుష్టపాలన సాగించింది. పరిణతి చెందిన ప్రజలు ఓటు ఆయుధాన్ని విజ్ఞతతో, సమర్థవంతంగా ఎక్కుపెట్టి, దుష్టపరిపాలనకు సమాధికట్టారు.
మీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన, సుపరిపాలన అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కొండంత ఆశతో 175 శాసన సభా స్థానాల్లో 164 మీ కూటమి అభ్యర్థులను భారీ ఆధిక్యతతో గెలిపించి, ఘనవిజయం చేకూర్చారు.
ఈ రోజు ఈనాడు దినపత్రికలో రెండు, మూడు ముఖ్యమైన వార్తలు చదివాను.
(i) ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు.
(ii) సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర.
“ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడ నున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు, ముగ్గురు అధికారులనూ నియమించే అవకాశం ఉంది”.
(iii) కాబోయే ముఖ్యమంత్రిని సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కలుస్తున్నారన్న వార్త. గత ప్రభుత్వ దుష్టపాలనలో భాగస్వాములైన అధికారులను కలవడానికి విముఖత వ్యక్తం చేసినట్లు కూడా మరొక వార్త చదివాను.
ఈ బహిరంగ లేఖ వ్రాయడానికి అవి నన్ను పురికొల్పాయి. ఒక సామాజిక ఉద్యమకారుడిగా గత ప్రభుత్వ దుష్టపాలనపై బలంగా గళమెత్తిన వారిలో నేను ఒకడినని మిత్రులు భావిస్తుంటారు. నేను మిమ్మల్ని చాలా అరుదుగా కలుసుకొన్నా, నన్ను గుర్తుపట్టేంత పరిచయమూ మీతో ఉంది. తిరుపతి విద్యార్థిగా 1977లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఏఐఎస్ఎఫ్)లో పనిచేస్తున్నప్పుడు మీతో పరిచయం మొగ్గతొడిగింది. ఆంధ్రపదేశ్ భవిష్యత్తుపై తీవ్ర మనోవేదనకు గురైన రాష్ట్ర ప్రజల్లో ఒకడిగా నేనూ మీ ప్రభుత్వం నుండి సుపరిపాలనను కోరుకుంటున్నాను. అందుకే, దాదాపు ఐదు దశాబ్దాలుగా ఉన్న పరిచయంతో ఈ బహిరంగ లేఖ వ్రాస్తున్నాను.
“ప్రక్షాళన ఎలా? రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ఎలా పరుగులు పెట్టించాలి?” అన్న శీర్షికతో ఈటీవీ 5వ తేదీన ప్రతిధ్వని చర్చను చేపట్టి, నన్ను ఆహ్వానించింది. నాకున్న అనుభవాలు, చైతన్యం, పరిజ్ఞానంతో నా అభిప్రాయాలను పంచుకున్నాను. ఆ పూర్వారంగంలో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
అసలు విషయానికి వస్తే, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో సిఎంఓ అత్యంత కీలకమైన యంత్రాంగంగా ఉంటున్నది. తాజాగా కొందరు వైఎస్సార్సీపీ నాయకులు సిఎంఓలో పెత్తనం సాగించిన ధనుంజయరెడ్డిపై విమర్శలు చేయడం గమనార్హం. ముద్దాడ రవిచంద్ర చట్టానికి బద్ధుడై నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించే సమర్థుడైన ఐఏఎస్ అధికారి కాదన్న అభిప్రాయాన్ని స్వానుభవంతో చెబుతున్నాను. ఆయన్ను ఏనాడూ కలవలేదు. ఆయన వ్యక్తిగా మంచి వారే కావచ్చు!
రాష్ట్రంలో వైద్య విద్యా రంగం గడచిన ఐదేళ్ళలో అడ్డగోలు నిర్ణయాలతో, అక్రమ జీవోల జారీతో, అవినీతితో భ్రష్టుపట్టిపోయింది. అధ్యాపకుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, వేతన సవరణ విధానంలో మార్పులు, పదహారు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, డా. యన్.టి.ఆర్. వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పు, గత వైస్ – ఛాన్సలర్ జగన్మోహన్ రెడ్డికి భజనపరుడుగా వ్యవహరించడం, యూనివర్శిటీ మూలనిధి రు.450 కోట్లను ప్రభుత్వం లాగేసుకోవడం, వగైరా వగైరా ఆ వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేశాయి. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రగారు పని చేశారు. కృష్ణబాబుగారు ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు. సత్వరం వైద్య విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలపై దృష్టి సారించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ పున్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా ముద్దాడ రవిచంద్రగారు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేక జీవో విడుదల చేసి, నా జీవిత భాగస్వామికి ప్రొఫెసర్ గా న్యాయబద్ధంగా రావలసిన ప్రమోషన్ కు ఎసరు పెట్టారు. అది తప్పని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. తప్పని ఆయనకు తెలుసు. కానీ, జీవోను ఉపసంహరించుకోలేదు. ఆయనతో ఫోన్ లో మాట్లాడినప్పుడు, నా వ్రాత పూర్వక విజ్ఞప్తులపై స్పందించినప్పుడు ఆయనలో నిస్సహాయత గమనించాను. ఫలితం లేకపోవడంతో న్యాయ సాధనలో భాగంగా ఆ సమస్యపైన హైకోర్టులో ఒకదాని తర్వాత ఒకటి చొప్పున మూడు రిట్ పిటిషన్స్ దాఖలు చేశాం.
ఏడాదిన్నర పాటు న్యాయ పోరాటం చేశాం. మూడు రిట్ పిటిషన్స్ లోను హైకోర్టు అనుకూలమైన తీర్పులు ఇచ్చింది. అయినా, పదోన్నతి కల్పిస్తూ జీవో విడుదల చేయడంలో కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు అలసత్వం ప్రదర్శించారు. మంత్రి దగ్గర పైల్ ఉందంటూ జాప్యం చేశారు. ఎట్టకేలకు విధిలేని పరిస్థితుల్లో జీవో జారీ చేశారు. ఇదీ! నా స్వానుభవం.
జగన్మోహన్ రెడ్డి కనుసైగల పాలనలో చట్ట వ్యతిరేకంగా బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులనే అత్యంత కీలకమైన స్థానాల్లో నియమిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయడం సాధ్యమేనా! కాస్త, ఆలోచించండి.
సహృదయంతో ఈ బహిరంగ లేఖలోని అంశాలను తీసుకుంటారని ఆశిస్తూ…
అభివందనలతో
టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు