Suryaa.co.in

Features

4 శాతం పెరిగిన ముస్లిం జనాభా, 4 శాతం తగ్గిన హిందువులు

60 ఏళ్ల కాల వ్యవధిలో భారత దేశ జనాభాలో ముస్లింల వాటా 4 శాతం పెరిగింది, హిందువుల వాటా దాదాపు అంతే స్థాయిలో తగ్గింది. మిగత మతాల జనాభా వాటాలో పెద్దగా మార్పు లేదు.పదేళ్లకోసారి చేసే జనగణన, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) డాటాను పరిశీలించిన ప్యూ రీసెర్చ్ సెంటర్ భారత్‌లో మత కూర్పులో చోటుచేసుకున్న మార్పులు, అందుకు దారి తీసిన కారణాలపై జరిపిన విశ్లేషణలో ఈ అంశం వెల్లడైనది.
భారతదేశంలో ముస్లింలు ఇప్పటికీ ఇతర మతాలవారికన్నా సగటున ఎక్కువమంది సంతానాన్ని కలిగి ఉన్నారని, జైనులు సగటున అతి తక్కువ మంది సంతానాన్ని కలిగి ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. మొత్తంగా చూస్తే భారత్‌లో అన్ని మతాల సంతానసాఫల్య రేటు క్రమంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది.
‘‘రెలీజియస్‌ కంపోజిషన్‌ ఆఫ్‌ ఇండియా’’ పేరిట ప్యూరిసెర్చ్‌ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 1951లో 36.1 కోట్లుగా ఉన్న భారత్ జనాభా 2011 నాటికి 120 కోట్లకు పెరిగింది.హిందువుల జనాభా 30.4 కోట్ల నుంచి 96.6 కోట్లకు, ముస్లింల జనాభా 3.5 కోట్ల నుంచి 17.2 కోట్లకు పెరిగింది. క్రైస్తవుల జనాభా 80 లక్షల నుంచి 2.8 కోట్లకు పెరిగింది.
2015 గణాంకాల ప్రకారం భారత్‌లో ముస్లింలలో అత్యధిక సంతానోత్పత్తి రేటు 2.6 ఉంది. అంటే సగటున ప్రతి 100 మంది ముస్లిం మహిళలు 260 మంది పిల్లలను కంటున్నారు. హిందువుల్లో ఈ సంతానోత్పత్తి రేటు 2.1 గా ఉంది.
అంటే సగటున ప్రతి 100 మంది హిందూ మహిళలు 210 మంది పిల్లలను కంటున్నారు. ప్రధానమైన ఆరు మతాలలో జైనుల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. వీరిలో సంతానోత్పత్తి రేటు 1.2గా ఉంది. 1992తో పోల్చితే సంతానోత్పత్తి రేటులో తగ్గుదల నమోదైంది. 1999లో ముస్లింలలో సంతానోత్పత్తి రేటు 4.4, హిందువులలో సంతానోత్పత్తి రేటు 3.3గా ఉండేది.
మిగతా భారతీయ మహిళల కంటే ముస్లిం మహిళలు ఎక్కువ మంది సంతానాన్ని కనడం మొత్తం మత కూర్పులో చోటుచేసుకున్న స్వల్ప మార్పునకు కారణమని స్టెఫానీ క్రామర్ అన్నారు.మతపరంగా జనాభా కూర్పులో వ్యత్యాసాలకు సంతానోత్పత్తి రేటు కొంత వరకు కారణం కావొచ్చు.
ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2020 నాటికి హిందువుల సగటు వయసు 29 కాగా ముస్లింల సగటు వయసు 24, క్రిస్టియన్ల సగటు వయసు 31.ప్రపంచంలోని హిందువుల్లో 94 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. అలాగే, ప్రపంచంలోని సిక్కు మతస్థులలో 90 శాతం భారత్‌లోనే ఉన్నారు. అందులోనూ పంజాబ్ రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉన్నారు. ఇక జైనులు కూడా భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు.
120 కోట్ల భారత జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. ప్రపంచ హిందూ జనాభాలో 94 శాతం భారత్‌లోనే నివసిస్తున్నారు. భారతదేశ మొత్తం జనాభాలో ముస్లింల శాతం 14.2. ఇండోనేసియా తరువాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్. క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు భారత జనాభాలో 6 శాతం ఉన్నారు.
30 వేల మంది తమను తాము నాస్తికులుగా చెప్పుకొన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందనివారు 80 లక్షల మంది భారత్‌లో ఉన్నారు. ప్రధానమైన ఈ ఆరు మతాలు కాకుండా మరో 83 మతాలు భారత్‌లో ఉన్నాయి.

LEAVE A RESPONSE