Home » ‘పాస్టర్లకు జీతాలు’ .. న్యాయ పరీక్షకు నిలుస్తుందా?

‘పాస్టర్లకు జీతాలు’ .. న్యాయ పరీక్షకు నిలుస్తుందా?

( లగిడి అరుణ్ కుమార్ రాజు)
క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలివ్వాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ నాయినాల జయసూర్యలతో కూడిన హైకోర్టు బెంచ్, దీనిపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది.
క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తామని అధికార వైఎస్సాఆర్ పార్టీ ఎన్నికల సమయంలోనే ప్రకటించింది. అంతేకాదు, ఈ అంశాన్ని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రముఖంగా చేర్చింది. ఈ క్రమంలో తన ఎన్నికల వాగ్ధానాన్ని అమలుపరుస్తూ, పాస్టర్లకు నెలకు రూ. 5వేలు చొప్పున ఇవ్వడానికి నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 మే 14వ తేదీన జీవో ఎంఎస్ నెంబర్ 52 జారీ చేసింది. ఈ జీవో జారీ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనమంతా గొప్పగా భావించే సెక్యులరిజానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మతపరంగా అత్యంత వివక్షాపూరితమైనదిగా అన్ని వర్గాల ప్రజల నుండి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో న్యాయపరీక్షకు నిలుస్తుందా అనేదానిపై ఒక విశ్లేషణ:
రాష్ట్రంలో మతసామరస్యం పరిరక్షణే పాస్టర్లకు నెలనెలా గౌరవ వేతనాలు చెల్లించడం యొక్క ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ప్రముఖంగా ప్రకటించింది. అంతేకాకుండా, ఇప్పటికే హిందూ ఆలయాల్లో పూజారులకు, మసీదులో ఇమామ్, మౌజీన్లకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టే చర్చి పాస్టర్లకు కూడా చెల్లిస్తున్నాం అని సదరు జీవోలో పేర్కొంది.
అయితే, అదే జీవో ప్రకారం అర్చకులకు అందే ఆర్ధిక సహాయం అతడు సేవలందించే ఆలయం యొక్క ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. పాస్టర్ల విషయానికి వస్తే అతను సేవలందించే చర్చి యొక్క ఆదాయం గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు. ఇమామ్, మౌజీన్ల విషయానికి వస్తే, వారికి ఆర్ధిక సహాయం అందజేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో ఒక జీవో జారీ చేసింది.
ఆ జీవో ప్రకారం రాష్ట్రంలోని ఎలాంటి ఆదాయం లేని మసీదులలో సేవలందించే ఇమామ్, మౌజీన్లకు ఆర్ధిక సహాయం అందించే బాధ్యత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా చెల్లించే విధంగానూ, ఈక్రమంలో వారి ఆర్ధిక సహాయానికి అయ్యే వ్యయాన్ని వక్ఫ్ బోర్డు భరించేందుకు అవసరమయ్యే ఆదాయ మార్గాన్ని పటిష్టం చేసుకోవడానికి తగిన సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని స్పష్టం చేసింది. ఆ జీవోలో ఎక్కడా కూడా “మతసామరస్యం కాపాడటానికి” అని పేర్కొనలేదు.
కానీ ఇప్పుడు పాస్టర్లకు ఆర్ధిక సహాయం విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ ఆర్ధిక భారం ప్రజలపై పడింది. 2016 నాటి జీవోతో పోల్చితే ఇమామ్, మౌజీన్లకు అందిస్తున్న ఆర్ధిక సహాయం ఇప్పుడు తాజా జీవో ద్వారా పెంచడం జరిగింది. ఇదే జీవోలో అర్చకులకు అందిస్తున్న ఆర్ధిక సహాయం విషయం కూడా ప్రస్తావించడం ద్వారా వారికి కూడా ప్రభుత్వ ఖాతా నుండి చెల్లింపులు జరుగుతున్నాయి అన్న అపోహ ప్రజల్లో ఏర్పడే అవకాశం కలిగింది. అయితే, అర్చకులకు విషయంలో గమనించాల్సిన రెండు ముఖ్య విషయాలు ఏమంటే.. వారికి అందించే ఆర్ధిక సహాయం ప్రభుత్వ ఖాతా నుండి కాదు.
అంతేకాదు, వారు సేవలందించే ఆలయ ఆదాయం ఆధారంగానే వారికి ఆర్ధిక సహాయం అందుతుంది. నిజంగా ప్రభుత్వం వారిని ఆదుకోవాలి అని భావించే ప్రభుత్వం వారి విషయంలో ఈ ‘ఆలయ ఆదాయం’ అనే మెలిక పెట్టడం గమనార్హం. ఆలయ పూజారికి ఎండోమెంట్స్ ద్వారా అందే జీతాన్ని నిర్ణయించడం ద్వారా ఇప్పటికే హిందూ దేవాదాయ ధర్మాదాయ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఇది ఆజ్యం పోస్తోంది.
ప్రభుత్వ ఆదాయాన్ని మతపరమైన వ్యవహారాలకు ఉపయోగించవచ్చా?:
మత సామరస్యాన్ని సాధించటం తమ లక్ష్యంగా చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఓ మతానికి చెందిన వ్యక్తులకు చెల్లించేoదుకు ప్రజాధనాన్ని వినియోగించవచ్చా? దీనిపై గతంలో వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, చేసిన కీలక వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిద్దాం.
2012 లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మసీదులలో సేవలందించే ఇమామ్‌లకు నెలవారీ గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ (W.P: 358/2012) విచారించిన కలకత్తా హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ తీర్పులో హైకోర్టు పరిశీలనకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి.
1) ఇతర మతాలకు చెందిన వ్యక్తుల అవసరాలను విస్మరిస్తూ రాష్ట్రప్రభుత్వం కేవలం ఒక నిర్దిష్ట మతానికి చెందినవారి ప్రయోజనం కోసం ఆర్ధిక సహకారం అందించడం అంటే ఇతర మతస్థుల పట్ల వివక్ష చూపడమే అవుతుంది.
2) ఇమామ్‌లు మరియు మౌజీన్ల గౌరవ వేతనాల చెల్లింపు కోసం నిధులు సమకూర్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 15 (1) కింద పేర్కొన్న నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించింది.
3) ఈ నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత ప్రభుత్వ శాఖలు ముస్లిముల, ఇతర మతాలకు చెందిన వ్యక్తుల ఆర్ధిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు తగిన తగిన ప్రయత్నం చేయలేదన్నది అర్ధమవుతోంది.
4) భారత రాజ్యాంగంలోని అధికరణం 282లో పేర్కొన్న ‘ప్రజా ప్రయోజనం’ అనే అంశం అధికారణాలు 14, 15(1)లోని నిబంధనలను అతిక్రమించ రాదు.
5) ముస్లిం మతానికి చెందిన అనేక మందిలో ఇమామ్‌లు, మౌజీన్లు కేవలం మసీదుకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే. వీరికి గౌరవ వేతనం ఇవ్వటం అనేది యావత్ ముస్లిం సమాజం ప్రయోజనానికి దోహదపడుతుంది అని చెప్పడం కుదరదు.
1977 నాటి శ్రీ దివి కోదండరామ శర్మ Vs. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో గౌరవనీయ సుప్రీంకోర్టు వెల్లడించిన ప్రకారం హిందూ దేవాలయాలకు చెందిన అర్చకులకు జీతం చెల్లింపు విషయమై స్పష్టతనిస్తూ.. ఆర్చకులకు చెల్లింపుల కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోరాదని, ఆలయ నిర్వహణ చూసుకునే ట్రస్ట్, ఖర్చుల నిమిత్తం భక్తుల నుండి విరాళాలు వసూలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.
2021లో కేరళ హైకోర్టు మదర్సాలో బోధన చేస్తున్న వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారాన్ని అందించడాన్ని సూటిగా ప్రశ్నించింది.
పై తీర్పులను పరిశీలిస్తే.. ప్రభుత్వ నిధుల నుంచి మతపరమైన వ్యక్తులకు చెల్లింపులు జరపడం “ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే” అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ జీవోలో పేర్కొన్న లక్ష్యం అనగా, ‘మత సామరస్యం పరిరక్షణ’ అనేది కూడా న్యాయ పరిశీలనలో వీగిపోతుందని పైన పేర్కొన్న తీర్పుల ద్వారా అర్ధమవుతోంది. ఒక నిర్దిష్ట మతానికి చెందిన కొద్దిమంది వ్యక్తులకు ప్రభుత్వ ఖజానా నుండి వేతనం చెల్లించడం అనేది, వివిధ మతాల మధ్య మత సామరశ్యం పెంపొందించడం కాదు సరికదా, ఆ మతానికే చెందిన ఇతర వ్యక్తుల ప్రయోజనాలకు కూడా ఉపయోగపడదని న్యాయమూర్తులు గత కేసుల్లో తేటతెల్లం చేసారు.
ఇమామ్‌లకు గౌరవ వేతనం చెల్లింపు విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన మరో తీర్పును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిoది. సంబంధిత రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఆదాయం నుండి ఇమామ్‌లకు ఏకరీతిలో జీతం చెల్లించాలని అంతేకాని ప్రజా ధనం నుంచి కాదని గౌరవనీయ న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోవిద్-19 మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఉపశమన చర్యలలో భాగంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూజారులు, పాస్టర్లు, ఇమాములకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే, 2020న సింగిల్-టైం (ఒక్కసారి) చెల్లింపుగా రూ. ఐదు వేలు ఆర్ధిక సహాయం అందించింది. ఇందుకు జాతీయ విపత్తు సహాయ నిది నుండి రూ .33.92 కోట్లు కేటాయించింది. అయితే 2011 నాటి జనాభా లెక్కలలు జాగ్రత్తగా పరిశీలిస్తే క్రైస్తవులు, పాస్టర్ల నిష్పత్తి చాలా నిర్హేతుకంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాలో క్రైస్తవులు 1.39% ఉండగా, 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సింగిల్-టైమ్ పేమెంట్ ఆర్ధిక సహాయం పొందిన పాస్టర్ల సంఖ్య 29,841 మంది. అంటే మొత్తం క్రైస్తవ జనాభాలో 43.99% పొందారు. ఈ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్న క్రైస్తవులలో ప్రతి 24వ వ్యక్తి ఒక పాస్టర్ అన్నమాట!
ఆంధ్రప్రదేశ్ – పాస్టర్లకు కరోనా సమయంలో జరిపిన సింగిల్-టైమ్ చెల్లింపు – లబ్ధిదారులు- రాష్ట్ర జనాభా వారీ వివరాలు:

ఇది ఒక విచిత్రమైన పరిస్థితికి దారితీసింది. కొన్ని ప్రాంతాల్లో, క్రైస్తవుల సంఖ్యకంటే అక్కడి పాస్టర్ల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లా నుండి నమూనా గణాంకాలు:

Source: లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ ఆర్టీఐ చట్టం ద్వారా కరోనా సింగిల్-టైమ్ పేమెంట్ పొందిన క్రైస్తవ పాస్టర్ల వివరాలను పొందింది. ఈ సమాచారం ప్రకారం దాదాపు 60% క్రైస్తవ పాస్టర్లు హిందూ కుల ధృవీకరణ పత్రాలను కలిగి ఉన్నారని, వారిలో ఎస్సీ కుల ధ్రువీకరణ కలిగివున్న వారు అధికం అని సంస్థ పరిశోధనలు నిరూపించాయి. ఇది సంచలనం సృష్టించింది.
తాజాగా పాస్టర్లకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం కోసం జారీ చేసిన జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే చర్చిలు మూడు అర్హత ప్రమాణాలను పాటించాలనే నిబంధన ఉంది:
(ఎ) చర్చిలను సొసైటీస్ చట్టం ప్రకారం రిజిస్టర్ చేయాలి
(బి) చర్చి నిర్మాణం జరిగిన స్థలం ఆ చర్చి పేరిట రిజిస్టర్ అయ్యి ఉండాలి
(సి) సదరు సంస్థకు ఇతర ఆదాయ వనరులు ఉండకూడదు.
కరోనా ఆర్ధిక సహాయం కోసం జారీ చేసిన జీవోలో ఆర్ధిక సహాయం పొందాలనుకునే పాస్టర్లకు విధించిన పాస్టర్ ట్రైనింగ్ సర్టిఫికెట్, ఇతర అర్హతా ప్రమాణాలకు అదనంగా తాజా జీవో మరిన్ని నియమాలను అదనంగా చేర్చింది. అయినప్పటికీ ఈ నియమాలు, అర్హత ప్రమాణాల వల్ల ఈ పథకానికి అప్లికేషన్లు పెట్టుకునే పాస్టర్ల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో అనేక చర్చిలు రిజిస్టర్ కాలేదు. అనేక చర్చిలు పాస్టర్ల వ్యక్తిగత స్థలంలో లేదా ఇండ్లలో (సొంతమైన/అద్దెకు తీసుకున్న) నిర్వహించబడుతున్న అనేక ఉదంతాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరీ దారుణంగా మరికొన్ని చర్చిలు ఏకంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించి నిర్వహించబడుతున్నాయి. వీటన్నిటి దృష్ట్యా తాజా జీవోలో పేర్కొన్న నిబంధనలు వర్తింపజేసినట్లైతే ఆర్ధిక సహాయం కోసం దరఖాస్తు చేసుకునే పాస్టర్లలో నెలవారీ గౌరవ వేతనాలు పొందటానికి అర్హత కలిగిన వారు 1,000 మందికి మించి ఉండరని క్రైస్తవ సమాజ పెద్దలే అభిప్రాయపడుతున్నారు. మెయిన్‌లైన్ చర్చిలుగా ప్రసిద్ది చెందిన ప్రముఖ చర్చిలు నెలవారీ జీతాలు చెల్లిస్తాయి. ఉద్యోగ భర్తీలు, బదిలీలు, ప్రమోషన్లను క్రమం తప్పకుండా చేపడతాయి. అటువంటి చర్చిలకు చెందిన పాస్టర్లు ప్రస్తుత పథకం పరిధిలోకి రాలేరు.
వీటన్నిటి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ఎంఎస్ 52ను న్యాయస్థానంలో న్యాయ విచారణకు నిలుస్తుందా అనేది ఆసక్తికరం. అలాగే, క్రైస్తవ సమాజ విజ్ఞాపనలను ప్రభుత్వం మన్నించి ఇప్పటికే ఉన్న అర్హత ప్రమాణాలు సడలిస్తుందా అనేది వేచి చూడాల్సిఉంది.
Source: www.csisindia.comలో ప్రచురితమైన వ్యాసానికి స్వేచ్ఛానువాదం
(వ్యాసకర్త న్యాయశాస్త్ర విద్యార్థి)

Leave a Reply