Suryaa.co.in

Food & Health

మూర్ఛవ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి

◆ ఎపిలెప్సీకి అను ఇనిస్టిట్యూట్లో అత్యాధునిక చికిత్సలు
◆ అను హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి.రమేష్
◆ నేషనల్ ఎపిలెప్సీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
◆ ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
విజయవాడ: మూర్ఛ వ్యాధి(ఎపిలెప్సీ) పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా మూర్ఛవ్యాధిని నియంత్రించవచ్చని అను హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి.రమేష్ తెలిపారు. నేషనల్ ఎపిలెప్సీ డే సందర్భంగా ఎనికేపాడులోని అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ నందు బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు వంద మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జి.రమేష్ మాట్లాడుతూ మనదేశంలో దాదాపు ఒక కోటి మందికి పైగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అనేక అపోహలున్నాయని, వ్యాధి పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మూర్ఛవ్యాధి రోగులకు అను ఇనిస్టిట్యూట్ నందు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ జి.రమేష్ తెలిపారు. అనంతరం న్యూరో సర్జన్ డాక్టర్ తీగల రమేష్ మాట్లాడుతూ మూర్ఛ వ్యాధిని మెదడుకు ఏర్పడిన ఒక గాయంగా పరిగణించవచ్చని, మెదడు కణజాలంలో విద్యుత్ ప్రసరణల అసమతుల్యతలు మూర్ఛవ్యాధికి దారితీస్తాయని వివరించారు.
మూర్ఛవ్యాధిగ్రస్తుల్లో తీవ్రమైన వణుకులు, నోటి నుండి చొంగ కారుట, నాలుక కరుచుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఈ లక్షణాలు కనిపించిన కొద్దిసేపటికే మరల మామూలు స్థితికి వస్తారని అన్నారు. మూర్ఛ వ్యాధి ఏ వయస్సులోనైనా రావచ్చని, ఒక వ్యక్తికి కనీసం ఈ మూర్ఛ రెండుసార్లు వచ్చినప్పుడు మూర్ఛ వ్యాధిగా పరిగణిస్తారని చెప్పారు. తీవ్రమైన జ్వరం, పుట్టుకతో వచ్చే లోపాలు, తలకు గాయాలు, జన్యు సంబంధ కారణాలతో మూర్ఛవ్యాధి సంభవించవచ్చని పేర్కొన్నారు. అవసరమైన రోగులకు శస్త్రచికిత్సల ద్వారా మూర్ఛవ్యాధిని నయం చేయవచ్చని డాక్టర్ తీగల రమేష్ తెలియజేశారు. న్యూరో ఫిజిషియన్ డాక్టర్ తోట నవీన్ మాట్లాడుతూ మూర్ఛలను సకాలంలో గుర్తించడం, సరైన చికిత్సలు అందించడం ద్వారా ఎపిలెప్సీని నియంత్రించవచ్చని చెప్పారు. మూర్ఛవ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలని, మూర్ఛరోగులకు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు తగిన మద్దతునందించాలని తెలిపారు. మూర్ఛ వ్యాధి ఒక శారీరక అనారోగ్యమే కానీ, మానసిక వ్యాధి కాదని డాక్టర్ నవీన్ స్పష్టం చేశారు. అనంతరం పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నటరాజ్ మాట్లాడుతూ మూర్ఛవ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలకు అను ఇనిస్టిట్యూట్ నందు ఆధునాతనమైన చికిత్సలు లభిస్తున్నాయని తెలిపారు. మూర్ఛవ్యాధి ఎవరిలోనైనా, ఏ సమయంలోనైనా వృద్ధి కాగల అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా పిల్లల్లోనూ, యువకుల్లోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. మూర్ఛ వచ్చినప్పుడు రోగులు అదుపులో పెట్టలేని విధంగా ప్రవర్తిస్తారని, మూర్ఛను మానవాతీత శక్తి అనే అపోహలను విడనాడి, సరైన వైద్య చికిత్సలు తీసుకోవాలని డాక్టర్ నటరాజ్ సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎం.సౌమ్య, అను ఇనిస్టిట్యూట్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE