– జాతీయ పోటీలకు ఎంపికైన ఫెన్సింగ్ క్రీడాకారులను అభినందించిన శాసనసభాపతి తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం : రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా విజేతలుగా నిలవాలని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు.జిల్లా పేరు ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని ఫెన్సింగ్ క్రీడాకారులకి ఆయన సూచించారు.
శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఫెన్సింగ్ క్రీడాకారులను రాష్ట్ర శాసనసభాపతి బుదవారం అభినందించారు.ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో జిల్లాకి చెందిన బాలబాలికలు,సీనియర్లు వివిద విభాగాలలో తమ సత్తా చాటి పతకాలను సాధించారు. అండర్ -14 విభాగంలో దిబ్బ మేఘన(ఫోయిల్ ), బండి శిరీష(సాబర్ ),సీపాన అభిషేక్ (ఇప్పీ), అండర్ -20 విభాగంలో అడంగి విరాజ్ ఆనంద్ (ఇప్పి),తోట రాజ్యలక్ష్మీ(ఇప్పి),సీనియర్ విభాగంలో వైశ్యరాజు జాస్మీన్ (పోయిల్ ),సంపతిరావు శ్రీ సాహితి(ఫోయిల్ )లు పథకాలు సాధించారు.
పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను,జిల్లా అధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ ల ఆద్వర్యంలో తమ్మినేని సీతారాంని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో పతకాలు సాధించిన క్రీడాకారులందరిని కూడా పేరుపేరున తమ్మినేని సీతారాం పరిచయం చేసుకుని అభినందనలను తెలియజేశారు.
ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదన్నారు. నిపుణులైన శిక్షకులు,కోచ్ లు కూడా అందుబాటులో ఉన్నారన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు.క్రీడాకారులు వారు ఎంచుకున్న ఫెన్సింగ్ క్రీడలో మరిన్ని మెళకువలను నేర్చుకుని తిరుగులేని విదంగా పోటీలలో రాణించాలని తమ్మినేని సీతారాం వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి డి.భవానీ,ప్రతినిధి సంపతిరావు నాయుడు, ఎన్.ఐ.ఎస్ కోచ్ జోగిపాటి వంశీ, తైక్వాండో గౌతమ్,తైక్వాండో నవీన్ తదితరులు పాల్గొన్నారు.