– ఏడాదిలో తాగునీరు, రోడ్లు,డ్రైనేజి సదుపాయాలు కల్పిస్తా
– తాడేపల్లి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్
తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు నావద్ద ఉన్నాయి, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు, రోడ్లు, డ్రైనేజి, పార్కులు, హెల్త్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు.
తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… జగన్ మూడు రాజధానుల నిర్ణయం వల్ల తాడేపల్లి ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణానది చెంతనే ఉన్నా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి లేదు. భవిష్యత్ లో తాడేపల్లి రూరల్ అభివృద్ధికి కృషిచేస్తాం. గత ఎన్నికల్లో నేను ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. వీవర్స్ శాలను ఏర్పాటుచేసి వారికి అండగా నిలుస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మంగళగిరిలో ఐటీ పరిశ్రమ తెచ్చి 150 మంది ఉద్యోగాలు కల్పించా. మంగళగిరిని ప్రపంచస్థాయి ఆభరణాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం, నియోజకవర్గంలో 30వేల మందికి పైగా స్వర్ణకారులు ఉన్నారు. గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుచేసి, అధునాతన సాంకేతక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తాం. జెమ్స్ అండ్ జ్యుయలరీ కేంద్రంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం. చేనేతలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తామని తెలిపారు.
2017-18లో తాడిపత్రి మున్సిపాలిటీ దేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా అవార్డు పొందింది. అదే విధంగా మంగళగిరిని కూడా తయారు చేయాలన్నది నా లక్ష్యం. తాడేపల్లి, మంగళగిరి కార్పోరేషన్ ఏర్పాటుచేసి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు, వారి కుట్రలను తిప్పకొడతాం. ఓడినచోటే గెలవాలన్న కసితో అయిదేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ సేవలందిస్తున్నా. మంగళగిరి ప్రజలకు ఏ సమస్య తలెత్తినా ఒక్క మెసేజ్ తో స్పందిస్తా. సమస్య చెప్పిన వెంటనే 3గంటల్లో స్పందించాలని ఇప్పటికే గ్రామకమిటీ అధ్యక్షులకు ఆదేశాలిచ్చానని చెప్పారు. నన్ను, పెమ్మసాని చంద్రశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: పెమ్మసాని
గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటే అందుకు కారణం చంద్రబాబునాయుడే. ఏపీలో జగన్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది. తిరిగి టీడీపీని గెలిపించుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యం. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్ లాంటి పట్టణంలో కేవలం 45 శాతం మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ పరిస్థితి ఇక్కడ రాకూడదు. ప్రతి వ్యక్తి తనని తాను లోకేష్ లా భావించి పనిచేయాలి. లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తెస్తూ తాడేపల్లి పట్టణంలో తాగునీటి సమస్య తీర్చడంతో పాటు, డ్రెయిన్లు, స్మశాన వాటిక ఏర్పాటుచేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేస్తోంది కానీ.. చెత్తను సేకరించడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.