-ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్, వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
-కొనుగోలు చేసింది ఎవరు?
-జడ్జిలు, సినీ నటుల ఫోన్లూ ట్యాపింగ్‌కు గురయ్యాయి
-ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లపైనా ట్యాపింగ్ పెట్టారు
– దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
– డీజీపీకి ఫిర్యాదు
– చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది రఘునందన్‌రావు దీనిపై తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేయడం ఆసక్తికలిగించింది. తన ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, నాటి తమ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తన కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్యాప్ చేశారని రఘునందన్ రావు వివరించారు.
ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇంచార్జీ హరీష్ రావు, కలెక్టర్ వెంకట రామిరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ డివైస్ కొనుగోలు చేసింది ఎవరని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని రఘునందన్ రావు కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటకలో కుమార స్వామికి లబ్ది చేకూరేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అందేలా శ్రీరాములు యాదవ్ నంబర్ కూడా ట్యాప్ చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ట్యాపింగ్ గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు చెప్పాలని రఘునందన్ కోరారు. సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫోన్లను వదల్లేదన్నారు. వారిలో కొందరికి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూల్ చేశారని ఆరోపించారు. మాజీమంత్రి హరీశ్ రావు బినామీ చానెల్ ఓనర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని రఘునందన్ వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దీనితో బీఆర్‌ఎస్ నాయకులపై ఫోన్ల ట్యాపింగ్ కేసు ఉచ్చు బలంగా బిగిసుకునే ప్రమాదం కనిపిస్తోంది.