Suryaa.co.in

Andhra Pradesh

నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ నాటకాలు

-దళిత ద్రోహి జగన్‌కు బుద్ధి చెప్పాలి
-తప్పులను ప్రశ్నిస్తే దాడులు, హత్యలా?
-వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైంది
-జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ

దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్‌రెడ్డి, దళిత ద్రోహుల పార్టీ వైసీపీ అని మరోసారి రుజువైందని జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండపేట నుంచి తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి ఆశ్రయం ఇచ్చింది వైసీపీ అని, ప్రస్తుతం ఆయనను దళితులకు శిరోముండనం కేసులో కోర్టు దోషిగా తేల్చిందన్నారు. దళిత వ్యతిరేక నాయకులకు జగన్‌ పార్టీ బహిరంగంగా ఆశ్రయం కల్పిస్తుందన్న దానికి ఇదే నిదర్శనమన్నారు.

నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ప్రతి వేదికపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. దళితులను అవమానపరిచిన హత్యలు చేసిన వారిని అందలం ఎక్కిస్తున్నారని అన్నారు. నాడు దళితుడిని చంపిన అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లే చేసి మళ్లీ పార్టీలోకి తెచ్చుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్‌ సుధాకర్‌ నుంచి దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల అంబేద్కర్‌ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్‌కుమార్‌ను కొందరు శాడిస్టులు నిర్బంధించి నాలుగుగంటలపాటు చిత్రహింసలు పెట్టారని, దాహం వేసి నీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారన్నారు. ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనలు కోకొల్లలుగా జరిగాయన్నారు.

దళితులపై ఈ జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో రోజుకో దాడి జరుగుతుందని, ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే వారిపై శిరోముండనాలు, హత్యలు, వేధింపులు, దమనకాండలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి దళిత వ్యతిరేకికి దళితులంతా ఏకమై తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ కార్యనిర్వా హక కార్యదర్శి ధారా ఏసురత్నం, గండేపల్లి మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పెదపాటి శుభకర్‌, రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు పోలినాటి ధర్మానందకుమారి, జగ్గంపేట మండలం ఎస్సీ సెల్‌ కార్యదర్శి వీరభద్రల జగన్‌, జగ్గంపేట టౌన్‌ టీడీపీ అధ్యక్షురాలు గెద్దాడ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE