Home » బీజేపీకి వచ్చేది 178 సీట్లేనట!

బీజేపీకి వచ్చేది 178 సీట్లేనట!

-‘పువ్వు’ అనుకున్నంత నవ్వదా?
– ఆరెస్సెస్ అంతర్గత నివేదిక?
– యుపిలో 53, మధ్యప్రదేశ్‌లో 22?
– రాజ్‌పుట్ల ఉద్యమంతో బీజేపీకి భారీ నష్టం?
– ఉత్తరాదిలో బ్రాహ్మణ, బనియాలు దూరం?
– విద్యాధికుల్లో ఎలక్టోరల్ బాండ్స్ ప్రభావం
– ఎక్కువ సీట్లు మళ్లీ యుపిలోనే
– ఆరెస్సెస్ నివేదిక పేరుతో సోషల్‌మీడియాలో హల్‌చల్
-అదంతా కాంగ్రెస్ దుష్ప్రచారమేనంటున్న బీజేపీ

( మార్తి సుబ్రహ్మణ్యం)

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవన్న ఆర్ధికవేత్త, రాజకీయ వేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ జోస్యం నిజమేనా? బీజేపీకి 200 సీట్లు కూడా రావన్న కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ, కేంద్రమాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా మాటలు నిజమేనా?.. ఏమో.. వారి మాటలు నిజమో కాదో, తెలియదు. కానీ బీజేపీ మార్గదర్శి ఆర్‌ఎస్‌ఎస్ కూడా, బీజేపీకి 200 సీట్లు లోపలే వస్తాయని నివేదిక ‘ఇచ్చారంటున్న’ వైనం మాత్రం ఆశ్చర్యమే. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 178 ఎంపీ సీట్లు వస్తాయన్నది ‘సంఘ’జనుల ఉవాచ.

రానున్న ఎన్నికల్లో 300 స్థానాల లక్ష్యంతో బరిలో దిగిన బీజేపీ ఆశయం నెరవేరే సూచనలు కనిపించడం లేదా? బీజేపీని నడిపించే ఆరెస్సెస్.. తాజాగా తన నివేదికలో పార్టీ 178 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసిందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. నిజానికి ఇది గత కొద్దిరోజుల నుంచే ఉత్తరలాది సోషల్‌మీడియాలో చక్కర్లుకొడుతోందట. అది తాజాగా తెలుగు రాష్ట్రాలకూ విస్తరించడం చర్చనీయాంశమయింది. ఆరెస్సెస్ నివేదిక ప్రకారం.. యుపిలో 53 అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో22, రాజస్థాన్ 14, గుజరాత్ 18 స్దానాలు రావచ్చని పేర్కొన్నట్లు సమాచారం.

ఉత్తరాదిలో బలమైన సంఖ్యాబలం ఉన్న రాజపుట్ల ఉద్యమ ప్రభావం బీజేపీపై ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. బీజేపీ ప్రముఖుడు ఇటీవల రాజ్‌పుట్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అవి యుపి, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న రాజ్‌పుట్ల మనోభావాలను దారుణంగా దెబ్బతీశాయి. దానితో ఆ వర్గం ఉత్తరాదిలో, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిపింది. దానితో నష్టనివారణకు దిగిన బీజేపీ రంగంలోకి దిగి, ఆ వ్యాఖ్యలు చేసిన నేతతో క్షమాపణ కూడా చెప్పించింది. పాపం ఆయన ఒకసారి కాదు.. డజన్ల సార్లు క్షమాపణ చెప్పినా వారి కోపం చల్లారలేదు. ఆ ప్రభావం కూడా రే పటి ఎన్నికల్లో బీజేపీపై ఉండవచ్చని, అటు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

బ్రాహ్మణ, బనియా, సైనీ వర్గాలు బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్నారని సంఘ్ తన నివేదికలో విశ్లేషించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ-1, 2 అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ, బనియా, క్షత్రియులకు ప్రాధాన్యం దారుణంగా తగ్గిపోయి, ఓబీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా, ఆయా వర్గాల్లో బీజేపీపై అసంతృప్తికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

ఇటీవల సంచ లనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం కూడా, బీజేపీని విద్యావంతుల నుంచి దూరం చేసిందన్నది మరో విశ్లేషణగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఎస్‌బీఐ వెల్లడించిన రాజకీయ పార్టీల వివరాల జాబితాలో, ఈడీ-సీబీఐ కేసులకు గురైన కంపెనీలన్నీ తర్వాత, బీజేపీకి భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చాయన్న కధనాలు, మీడియా-సోషల్‌మీడియాలో బాగా ప్రచారమయ్యాయి. ఏయే కంపెనీ బీజేపీకి ఎంతెంత విరాళాలు ఇచ్చిందన్న వివరాలు గత కొద్దిరోజు నుంచి మీడియాలో శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. అది సహజంగానే బీజేపీకి కొంత నష్టం కలిగి ఉండవచ్చంటున్నారు. పైగా బీజేపీ అభ్యర్ధుల ఎంపికలో కూడా లోపాలున్నాయని.. ఇవన్నీ కలగలసి బీజేపీకి 178 సీట్లు వచ్చేందుకు కారణమవుతున్నాయని విశ్లేషించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఆరెస్సెస్ సర్వే పేరిట.. సోషల్‌మీడియాలో చలామణి అవుతున్న ఈ వివరాలు చాలాకాలం నుంచి, ఉత్తరాదిలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే తెలుగురాష్ట్రాల్లో ఇది కొద్దిరోజుల నుంచే ఇది సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆరెస్సెస్ నాయకత్వం కూడా స్పందించినట్లు లేదు.

అయితే బీజేపీ నేతలు మాత్రం.. సంఘ్ ఆవిధంగా బహిరంగంగా నివేదిలివ్వదని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఆడుతున్న ప్రచారనాటకంగా కొట్టిపారేస్తున్నారు. అందులో కొన్ని రాష్ట్రాల్లో పేర్కొన్న స్థానాలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply