తమ్ముళకు లోకేష్ ముందస్తు తాయిలాలు

– అవకాశాలు కోల్పోయిన వారికి అందలం
– పొత్తులో సీట్లు రాని త్యాగధనులకు పదవులు
– పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేసిన వారి జాబితా
– పోలీసు కేసులు ఎదుర్కొన్న వారి చిట్టా సేకరణ
– తెరవెనుక ఉండిపనిచేసిన వారి వివరాల సేకరణ
– అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ పదవులు
– కొందరికి ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, కార్పొరేన్ చైర్మన్లు
– జిల్లా స్థాయి నేతలకు డైరక్టర్, మేయర్, కార్పొరేటర్ పదవులు
– నేతల స్థాయిని బట్టి పదవుల పంపిణీ
– ఇప్పటినుంచే సిద్ధం చేస్తున్న లోకేష్
– దానికోసం ప్రత్యేకంగా యంత్రాంగం ఏర్పాటు
– పార్టీకి పనిచేసిన వారి రుణం తీర్చుకోనున్న లోకేష్
– లోకేష్ ప్రయత్నాలలో క్యాడర్‌లో పెరుగుతున్న విశ్వాసం
( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేన-బీజేపీ పొత్తుతో నష్టపోతున్న టీడీపీ ప్రముఖులు, పోటీ చేసే అవకాశం రాని తమ్ముళ్లు, వైసీపీతో ఐదేళ్లు క్షేత్రస్థాయిలో ఉండి పోరాడిన యోధులను గుర్తించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్థాయిని బట్టి తగిన పదవులిచ్చేందుకు టీడీపీ యువనేత లోకేష్ , ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించారు. పొత్తులో సీట్లు దక్కని వారితోపాటు.. గత ఐదేళ్లలో పార్టీ కోసం ఆస్తులు కోల్పోయి, పోలీసుకేసులకు గురయిన వివిధ స్థాయి నేతలను గుర్తించే వ్యవస్థను లోకేష్ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన జిల్లాల వారీగా సమాచారం తెప్పించుకుని, ఆ వివరాలను ఆ యంత్రాంగానికి పంపిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల్లో పొత్తు వల్ల కొందరికి మోదం. మరికొందరికి ఖేదం సహజం. అయితే సీటు రాని వారిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా పిలిపించి మాడ్లాడుతున్నారు. ఏ పరిస్థితిలో సీటు దక్కలేదన్న అంశాన్ని వారికి వివరిస్తున్నారు. ఓటు బదిలీ అవసరంపై దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ త్యాగాలను గుర్తుంచుకుంటామని హామీ ఇస్తున్నారు.

తాజాగా పిఠాపురం సీటు జనసేనకు పోవడంతో అక్కడి ఇన్చార్జి వర్మ వర్గం నిరుత్సాహానికి గురైంది. దానితో బాబు ఆయనను పిలిపించారు. అధికారం వచ్చిన తర్వాత పార్టీ ఇచ్చే, తొలి ఎమ్మెల్సీ సీటు వర్మదేనని ప్రకటించారు. ఈవిధంగా వారి స్థాయి, నియోజకవర్గాల్లో ఆయా నేతల ప్రభావం, కులబలం వంటి అంశాల ఆధార ంగా చంద్రబాబు వారికి పదవులిస్తామని భరోసా ఇస్తున్నారు. ఫలితంగా ఆవేశంగా చంద్రబాబు నివాసానికి వెళ్లిన వారంతా ఉత్సాహంతో బయటకు వస్తున్నారు.

అయితే యువనేత లోకేష్ అందుకు భిన్నంగా..త్యాగధనులను గుర్తించే వ్యవస్థను ఇప్పటినుంచే ఏర్పాటుచేయడం ద్వారా, వారిలో నమ్మకం కలిగిస్తుండటం విశేషం. మాట ఇచ్చే విషయంలో చంద్రబాబు కంటే లోకేష్ స్థిరంగా ఉంటారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. ఆ ప్రకారంగా పొత్తులో సీట్లు పోయిన వారికి అవకాశం బట్టి ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్, జడ్పీ చైర్మన్ పదవులివ్వాలని నిర్ణయించారు.

అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రభావితం చేయగల నాయకులకు డైరక్టర్, మేయర్, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక తెరవెనుక ఉండి పార్టీ కోసం పనిచేసిన ప్రముఖులనూ గుర్తించి, గౌరవించాలని నిర్ణయించారు. ఇలా పార్టీకి వివిధ రూపాల్లో సేవలు చేసిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులిచ్చి గౌరవించడం ద్వారా, వారి రుణం తీర్చుకోవాలన్నది లోకేష్ ఆలోచనగా కనిపిస్తోంది.

ఆ మేరకు లోకేష్ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దానికోసం కొంతమంది సిబ్బందిని నియమించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన వద్దకు వచ్చిన నాయకుల వివరాలతోపాటు, తాను తెప్పించుకున్న సమాచారాన్ని ఆ వ్యవస్థకు పంపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో రాష్ట్ర-జిల్లా స్థాయి నాయకుల పేర్లు ఉన్నాయంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా, నియోజకవర్గ స్థాయి వడ పోత కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది.

పొత్తు వల్ల అవకాశాలు రాని వారిని గుర్తించడంతోపాటు, గత ఐదేళ్లలో క్షేత్రస్థాయిలో ఉండి పోరాడిన వారి పేర్లను ఇప్పటినుంచే ఎంపిక చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్థాయి, చేసిన పోరాటాలను బట్టి నామినేటెడ్ పదవులివ్వాలన్నది లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఐదేళ్లలో వ్యయప్రయాసలోర్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన వారిని కూడా గుర్తిస్తున్నారు. కాగా లోకేష్ తన పర్యటనల సందర్భంలో పార్టీకి పనిచేస్తున్న వారికి, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని హామీ ఇస్తున్న విషయం తెలిసిందే.

అయితే దానిని వ్యవస్థీకృతం చేయడం ద్వారా, పార్టీ నేతలు-శ్రేణుల్లో నమ్మకం-భరోసా కల్పించేందుకు, లోకేష్ చేస్తున్న ముందస్తు ప్రయత్నాలపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. బహుశా రాజకీయ పార్టీలలో ఈవిధంగా త్యాగధనులను ముందస్తుగా గుర్తించే వ్యవస్థ ఏర్పాటుచేయడం ఇదే ప్రథమంగా కనిపిస్తోంది.

Leave a Reply