Home » గులక రాయితో మరో ‘’జగన్నాటకం’’

గులక రాయితో మరో ‘’జగన్నాటకం’’

-బ్లూ మీడియా, పోలీసు తొత్తులతో తప్పుడు కథనాలు
-బీసీ బిడ్డలను బలిచేసి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర
-టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇరికించే యత్నం
-జగన్‌ మెప్పుకోసం పనిచేసే పోలీసులు మూల్యం చెల్లించుకుంటారు
-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

నాడు కోడి కత్తి నాటకం, నేడు గులకరాయి డ్రామాతో జగన్‌రెడ్డి అధికారం కోసం మరో జగన్నాట కానికి తెరలేపారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

సానుభూతికోసం జగన్‌ ఆడిన జగన్నాటకం
జగన్‌పై హత్యాయత్నం అనేది జగన్మోహన్‌ రెడ్డి ఆడిన జగన్నాటం. అదొక పెద్ద డ్రామా. గులకరాయి లేదు, హత్యా ప్రయత్నం లేదు. జగన్‌ బస్సు యాత్రకు జనం నుంచి ఆదరణ లేదు. అందుకే అసహనంతో జగన్‌ రెడ్డి ప్లాన్‌ చేసి జనాల్లో సానుభూతిని పొందేందుకు బూటకపు రాయి డ్రామాకు తెరలేపారు. గతంలో కోడికత్తి, వివేకా హత్యను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నేడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు అంతా సాక్షి పత్రికలోనే..
పోలీసు కమిషనర్‌, సాక్షి పత్రిక ఒకటేనా? అనే అనుమానం కలుగుతోందని వర్ల రామయ్య వ్యాఖ్యానిం చారు. పోలీసుల దర్యాప్తు అంతా సాక్షి పత్రికలోనే రావడం ఏంటని ప్రశ్నించారు. సాక్షి తప్పుడు కథనాలు అల్లుతుంటే దానికి పోలీసు అధికారులు జీ హుజూర్‌ అనటం సబబేనా అని మండిపడ్డారు. ప్రజాశక్తి, విశాలాంధ్ర, హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలకు అందని సమాచారం ఒక్క సాక్షికే ఎలా చేరుతోందని ప్రశ్నించారు. సతీష్‌ అనే వ్యక్తిని ఈ రోజు అరెస్టు చేస్తున్నట్లుగా ఈనాడు, జ్యోతిలో రాలేదని.. ఒక్క సాక్షిలోనే ఎలా వచ్చిందని, పోలీసులు, సాక్షి పత్రిక కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

అమాయకుల అరెస్టులపై విజయవాడ సీపీ సమాధానం చెప్పాలి
ఓ అమాయకుడిని అరెస్టు చేసే ముందు తన ప్రశ్నలకు విజయవాడ సీపీ సమాధానం చెప్పాలన్నారు. జగన్‌ గులక రాయి ఘటన జరిగి నేటికి ఆరు రోజులు అవుతోంది… అయినా ఇంతవరకు ఆ రాయి పోలీసులకు ఎందుకు చిక్కలేదన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైన దుర్గారావుపై ఎందుకు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ప్రశ్నించారు. సీఈఓకు ఏం రిపోర్టు పంపారో ఇన్వెస్టిగేషన్‌ అధికారులు వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. అనవసరంగా అమాయకులైన బీసీ వడ్డెర కుర్రాళ్లని బలిచేసి అధికారంలోకి రావడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గులకరాయి సంఘటనలో ఫెయిల్యూర్‌ అయిన సెక్యూరిటీ సిబ్బందిని ఎందుకు ఇంకా సస్పెండ్‌ చేయలేదని, వారిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరారు.

చిన్న గులకరాయి తగిలితే అది హత్యాయత్నమా?
గతంలో చంద్రబాబుపై విసిరిన రాయి సెక్యూరిటీ ఆఫీసర్‌కు తగిలితే హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఎర్రగొండపాలెం చంద్రబాబు పర్యటనలో ఎన్‌ఎస్‌జీ ఉద్యోగి తల పగిలితే హత్యా యత్నం కేసు ఎందుకు పెట్టలేదు? చిన్న గులకరాయి వచ్చి తగిలితే అది హత్యాయత్నమా? ఇదెక్కడి న్యాయం అని వర్ల రామయ్య మండిపడ్డారు.

ఓటమి భయం… వెల్లంపల్లి పలాయనం
బొండా ఉమాకు గెలుపు ఖాయమైంది కాబట్టే.. వెల్లంపల్లి పలాయనం చిత్తగిస్తున్నారని తెలుసుకుని జగన్‌ రెడ్డి ఈ గులకరాయి డ్రామాకు ప్రణాళికలు రచించారని వర్ల తెలిపారు. అందులో భాగంగానే ముందుగా కరెంట్‌ కట్‌ చేయించి బస్సులో నుంచి బయటకు రాని జగన్‌ బస్సుపైకి వచ్చి నిలబడి… డబ్బులు, సారాయి ఇచ్చి యువతను తరలించి రాయి డ్రామాకు తెరలేపారన్నారు. గులకరాయి దొంగ నాటకం అంతా డ్రామా అని ప్రజలకు తెలిసిపోవడంతో వైసీపీ నాయకులు మౌనం వహించారన్నారు.

అధికారులు తప్పు చేసి తిప్పలు తెచ్చుకోవద్దు
అధికారం ఎవరికీ సొంతం కాదని.. జగన్‌ కోసం తప్పటడుగులు వేయొద్దని పోలీసులకు వర్ల రామ య్య సూచించారు. అక్కడక్కడా జగన్‌ మెప్పు కోసం కొంతమంది అధికారులు తప్పటడుగులు వేస్తున్నా రని.. జగన్‌ కోసం తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారని.. తప్పకుండా వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే అధికారమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. పోలీసు అధికారులు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.

Leave a Reply