-వైసీపీది నేర చరిత్ర… రక్త చరిత్ర
-మాజీమంత్రి నక్కా ఆనందబాబు
ఎన్టీరామారావు కుమార్తె ఉమామహేశ్వరి మరణాన్ని వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతి లు చిలవలు, పలవలు చేయడం దుర్మార్గం. సిగ్గుమాలిన దివాళాకోరు రాజకీయాలకు తెరలేపారు. ఉమామహేశ్వరి అనారోగ్యంతో ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. వైసీపీ నాయకులు దాన్ని రాజకీయం చేస్తున్నారు.
మానవత్వం గల మనుషులైతే సానుభూతి ప్రకటించి వదిలేయాలి. లేదా మాకు సంబంధం లేదులే అని ఊరుకోవాలి. ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయానికి ఏ విధంగా వినియోగించాలని చూస్తున్నారు. విషం చిమ్మడం వైసీపీ నాయకులకు వెన్నెతో పెట్టిన విద్య. కొత్త కొత్త వార్తలు వండి వారుస్తున్నారు. విజయసాయిరెడ్డి పనిలేనివాడిలా నాలుగైదు ట్వీట్లు పెట్టారు.
మూడు దశాబ్దాల నేర చరిత్ర గల కుటుంబం నుండి వచ్చిన వారు కూడా మాట్లాడటమేనా? తండ్రి చనిపోతే శవాన్ని పక్కన పెట్టి సంతకాల సేకరణ చేసి పదవి కోసం వెంపర్లాడిన వ్యక్తి జగన్. రాజశేఖర్ రెడ్డి హత్య రిలయన్స్ వారు చేయించారని అమాయక యువకుల్ని రెచ్చగొట్టి ఉమ్మడి రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ లు, డీలర్ షిప్ లు, మాల్స్ లను పగులగొట్టి తగులబెట్టించారు. నాడు అమాయకులపై కేసులు పెట్టించారు. మొన్నటి వరకు ఆ యువత కోర్టుల చుట్టూ తిరిగారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అదే రిలయన్స్ వాళ్లని తీసుకొచ్చి ఎంపీ పదవి ఇచ్చి గౌరవించాడు.
జగన్ బాబాయి వివేక హత్య జరిగితే బుద్దితక్కువ విజయసాయిరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని స్టేట్ మెంట్ ఇచ్చాడు. సీబీఐ రంగంలో దిగాక విజయసాయి ఎటుపారిపోయాడో తెలియదు. పథక రచన చేసి వివేకానందరెడ్డి శవం వద్దకు రావడానికి జగన్ కు 12 గంటల సమయం పట్టింది. చంద్రబాబునాయుడు కుట్ర వల్లనే బాబాయి చనిపోయాడని జగన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఉదయన్నే నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. నేడు సీబీఐ నిజాలు నిగ్గు తేలుస్తోంది. దీనికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు.
లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ కుటుంబంపై అంత ప్రేమ ఉంటే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని అసెంబ్లీలో మాటలతో అవహేళన చేస్తుంటే నోరు తెరవలేదు. వైసీపీవారు ఇచ్చే ఎంగిలి మెతుకులకు, డబ్బులకు, పదవులకు కక్కుర్తి పడ్డ లక్ష్మీపార్వతి కి చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు. సైకిల్, జెండా చంద్రబాబునాయుడు లాక్కున్నారని మాట్లాడుతున్నావు, అవి నీ బాబు సొత్తు కాదుగా? టీడీపీ లక్షలాది కార్మికుల శ్రమ.
ఎన్టీరామారావు కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీని, ఫ్యామిలీని రెండు కళ్లుగా చూశారు. కార్యకర్తలు ఆరోజు చంద్రబాబుకు నాయకత్వం మార్పిడి చేశారు తప్ప మరొకటి కాదు. లక్ష్మీపార్వతి చేతుల్లో పార్టీ నాశనం కావడం ఇష్టంలేక చంద్రబాబునాయుడు చేతుల్లో పెట్టారు.
చంద్రబాబుకు ఎన్టీఆర్ పై ఎనలేని గౌరవం. జగన్ బాబాయిని ఎవరు చంపారు, రిలయన్స్ వారికి ఎందుకు ఎంపీ పదవి ఇచ్చారో వాటిపై లక్ష్మీపార్వతి మాట్లాడాలి. విజయసాయి ట్విటర్ లో కారుకూతలు కూయడం కాదు వివేకా ను ఎవరు హత్య చేశారో చెప్పాలి. వైసీపీది నేర చరిత్ర. రక్త చరిత్ర గురించి చంద్రబాబుకు తెలియదు, వైసీపీ నాయకులకే తెలుసు. ఎన్టీరామారావు, తెలుగుదేశం పార్టీ కి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు చేయని తప్పు లేదు.
రామకృష్ణ సినీ స్టుడియోని తగులబెట్టారు. ఎన్టీఆర్ థీయేటర్స్ ని పగులగొట్టారు. ఎన్టీఆర్ ను అవమానించారు. లక్ష్మీపార్వతి వైసీపీలో చేరి టీడీపీ, చంద్రబాబు, లోకేష్ లను విమర్శించడం సిగ్గుచేటు. వైసీపీ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్టును లక్ష్మీపార్వతి చదవడం అవివేకం. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ నీచ సంస్కృతికి చరమగీతం పాడాలి. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు.