కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, భరోసా
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు ఉమ్మడి జిల్లాలలో భువనేశ్వరి పర్యటించనున్నారు. బాధిత కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, భరోసా కల్పించనున్నారు.
ఈ నెల 3 నుండి 5 వరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. విశాఖపట్నం విమానాశ్రయం నుండి రేపు ఉదయం 10గంటలకు విజయనగరం వెళ్తారు. విజయనగరం లోని 29వ వార్డులో కోరాడ అప్పారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలంలోని, పెరుమల్లి గ్రామంలో మైలేపల్లి పోలయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం బొబ్బిలి నియోజకవర్గం, చీకటిపేట మండలం, మోదుగువలస పంచాయతీలో గులిపల్లి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మూడు కుటుంబాలను పరామర్శించిన అనంతరం రాజాం నియోజకవర్గంలో బస చేయనున్నారు. తరువాత రోజు శ్రీకాకుళం జిల్లా లో భువనేశ్వరి పర్యటన ఉంటుంది.