ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరించిన నారా లోకేష్

తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల లోగోను తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్  హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రవి ప్రసాద్, జనరల్ సెక్రటరీ తుమ్మల రమేష్ నేతృత్వంలోని బృందం నారా లోకేష్ కలిశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 28 నుంచి వచ్చే ఏడాది 28 వరకు నిత్యం నిర్వహించే వివిధ కార్యక్రమాల సమాహారాలను లోకేష్ కు అసోసియేషన్ బృందం వివరించింది. ఇదే సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల బ్రోచర్ కూడా లోకేష్ ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం అందించాలని కోరుతూ సంతకాల సేకరణ కూడా ఈ అసోసియేషన్ చేపట్టిన విషయాన్ని వివరించారు . అందుకు సంబంధించిన సంతకాలన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన బుక్ లెట్ ను కూడా ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ ముత్యాల్లాంటి అందమైన దస్తూరిని( చేతి రాత) తెలుగు పాంట్ గా ఆవిష్కరణ కూడా జరపాలని అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నాన్ని లోకేష్ కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణ కోసం కృషి చేస్తున్న ప్రెసిడెంట్ కనపర్తి రవిప్రసాద్, సెక్రటరీ రమేష్ ను వారి బృందాన్ని లోకేష్ అభినందించారు. వీరు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం సంపూర్ణ సహాకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్మరణ ప్రతి తెలుగు వారి దిన చర్య గా, ఒక వేద మంత్రంగా మారిపోయిందని లోకేష్ అన్నారు. అంతటి మహానుభావుడి శత జయంతి వేడుకలు భుజాన వేసుకున్న రవిప్రసాద్, రమేష్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply