– అదే లండన్ వేదికగా గర్వంగా దేశ కీర్తిని పెంచనున్న వైనం!
లండన్‌లో మనవడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డులు బద్దలు కొడితే, అదే వేదికగా నాన్నమ్మ నారా భువనేశ్వరికి IOD డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025 లభించడం నిజంగా ఒక అరుదైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన అచీవ్మెంట్!
ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) లండన్ అందించే ఈ అపురూప గౌరవం, ఆమె 31 సంవత్సరాల అసాధారణ వ్యాపార నాయకత్వం మరియు నిస్వార్థ సామాజిక సేవకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు. ప్రజాసేవ, సామాజిక సాధికారతకు ఆమె చేస్తున్న నిబద్ధతతో కూడిన కృషికి గుర్తింపుగా లభించిన ఈ పురస్కారాన్ని, ఆమె నవంబర్ 4న లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో IOD సంస్థ నుంచి స్వీకరించనున్నారు.
ఈ అవార్డు దక్కించుకోవడం ద్వారా భువనేశ్వరి గతంలో ఈ గౌరవం పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా వంటి మహానుభావుల జాబితాలో చేరి, ఈ అవార్డు యొక్క అసాధారణ ప్రాముఖ్యతను నిరూపించారు. ఒక గృహిణిగా జీవితం ప్రారంభించి, అత్యవసర పరిస్థితుల్లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సారధ్యాన్ని స్వీకరించి, సంస్థను విజయాల శిఖరాలకు తీసుకెళ్లిన ఆమె జీవితం… క్రమశిక్షణ, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చనేందుకు నిలువెత్తు ఉదాహరణ.
వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడమే కాక, భువనేశ్వరి తమ తండ్రి పేరుతో స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ మానవతామూర్తిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు విద్యాదానం, అత్యవసరంలో ఉన్న వారికి రక్తదానం, మారుమూల గ్రామాలలో ఉచిత వైద్య సేవలు, మహిళా ఉన్నతి కోసం అలుపెరుగని కృషి వంటి కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా అందిస్తూ, ఆమె వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
ఇదే స్ఫూర్తిదాయకమైన అంతర్జాతీయ లండన్ వేదికలో, ఇటీవలే కుటుంబానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు మనవడు నారా దేవాన్ష్. లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ హాల్లో జరిగిన కార్యక్రమంలో, దేవాన్ష్‌కు ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 దక్కింది.
హంగేరియన్ చెస్ మాస్టర్ లాస్లో పోల్గార్ రచించిన ప్రసిద్ధ సంకలనం నుండి 175 కఠినమైన చెస్ పజిల్స్‌ను కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో పరిష్కరించి, “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్”గా ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ అద్భుతమైన “చెక్ మేట్ మారథాన్”లో దేవాన్ష్ కనబరిచిన వేగం, ఖచ్చితత్వం మరియు అద్భుతమైన నిర్ణయ సామర్థ్యం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈ రికార్డుతో పాటు, దేవాన్ష్ ఇప్పటికే టవర్ ఆఫ్ హనోయ్ పజిల్‌ను పూర్తి చేయడం మరియు 9 చెస్‌బోర్డులను సరిగ్గా అమర్చడంలో మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించడం విశేషం.
ఒకే కుటుంబంలో… అదే లండన్ నగరంలో… నాన్నమ్మకు సేవా గౌరవం, మనవడికి మేధో ప్రతిభ గౌరవం లభించడం దేశానికే గర్వకారణం. నారా భువనేశ్వరి గారి అత్యున్నత గౌరవం మరియు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు విజయాలు, భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తూ, దేశ కీర్తిని ప్రపంచ వేదికపై మరింత పెంచుతాయని ఆశిద్దాం!