ఎంపీ విజయసాయి రెడ్డి
తెదేపా అధినేత చంద్రబాబుకు పచ్చ మీడియా “విజనరీ” అన్న ట్యాగును తగిలించి ఎంతగా కవర్ చేయాలని చూసినా ఆయన సహజ లక్షణాలైన నయవంచన కర్కశత్వం, మోసం, దగా, కులపిచ్చి, వెన్నుపోటు వంటివి పదేపదే బయటపడుతూనే ఉన రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు అంశాలు వెల్లడించారు. కులాల వారీగా సమాజాన్ని విడగొట్టి సొంత వర్గం మేలుకోసం మాత్రమే చంద్రబాబు పాటుపడ్డాడని అన్నారు. ఏ పార్టీ కూడా బాబును దగ్గరకు రానివ్వడంలేదంటే ఆయన విశ్వసనీయత ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
టీడీపీ ఎన్డీఏ లో చేరుతున్నట్లు ప్రచారం చేసిందీ, ముహూర్తాలు పెట్టిందీ పచ్చ కుల ఛానెళ్లు, పేపర్లేనని అయితే ఇదే విషయంపై చంద్రబాబును అడిగితే వాళ్లనే అడగమని చెప్పడం విడ్డూరంగా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. పొత్తుల కోసం పాకులాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా నష్టపోయానని ఏడిస్తే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
రాష్ట్రానికి కేంద్రం గ్రాంట్ ఇస్తే చంద్రబాబు అండ్ గ్యాంగ్ తట్టుకోలేరు. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా వస్తే వ్యతిరేకంగా లేఖలు రాస్తారు, ధర్నాలు చేయిస్తారని విజయసాయి రెడ్డి చెప్పారు.. చంద్రబాబు సీఎంగా ఉండగా కరెంట్ చార్జీలు పెంచారని ప్రశ్నిస్తే కాల్పులు, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన సంఘటనలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, బాబు కర్కశత్వానికి ఇది ఒక తార్కాణమని అన్నారు.
రైతు బాంధవుడు, పేదల గుండె చప్పుడు, సంక్షేమ పాలనకు మారుపేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని విజయసాయి రెడ్డి అన్నారు.