Suryaa.co.in

Telangana

దేశం రెండు ముక్కలు కావడానికి ప్రధాన కారణం నెహ్రూ

– అంబేద్కర్ ని నెహ్రూ అడుగడుగునా అవమానించారు
– అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర నెహ్రూది
– మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలు (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సభలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్

హైదరాబాద్‌: అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా, వారి సుపరిపాలనను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఏడాది పాటు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పార్లమెంట్ లో ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా, నైతిక విలువలతో వాజ్ పేయి రాజీనామా చేసి తిరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి తీసుకొచ్చారు.

అటల్ జీ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. అనర్గళంగా ప్రసంగాలు ఇచ్చేవారు. అంధేరా చటేగా సూరజ్ నిఖ్లేగా కమల్ ఖిలేగా అంటూ దూరదృష్టితో భవిష్యత్తు గురించి నినదించారు. అంధకారం అంతమవుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని చెప్పారు. తెలంగాణలో రాజకీయాల్లో పూటకో కండువా కప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఏ పార్టీ నాయకులు ఏ పార్టీలోకి మారుతారో తెలియని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కేడర్ బేస్డ్, ఐడియలాజికల్ బేస్డ్ పార్టీ అని చాటిచెప్పారు.

పీవీ నేతృత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం LOP గా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయి ని ఐక్యరాజ్యసమితి సదస్సుకు భారతదేశం తరఫున నేతృత్వం వహించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది. అటల్ బిహారీ వాజ్ పేయి ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో హిందీలో ప్రసంగించి, భారతీయతను చాటి చెప్పారు.

వాజ్‌పేయి నాయకత్వంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేశారు.వాజ్ పేయి భారతదేశ రక్షణ విషయంలోనూ దౌత్యనీతితో వ్యవహరించారు. లాహోర్ వరకు బస్సు ప్రయాణం చేసి పాకిస్తాన్ కు స్నేహహస్తాన్ని అందించారు.

మొదట దేశాన్ని మత ప్రాతిపదికన రెండు ముక్కలు కావడానికి ప్రధాన కారణం నెహ్రూయేననేది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. నాడు పాకిస్తాన్ దాదాపు 75 వేల కి.మీ మేర భారతదేశాన్ని ఆక్రమించుకుందంటే కాంగ్రెస్ పార్టీయే కారణం.

భారత్-చైనా సరిహద్దు కి సంబంధించి స్పష్టమైన రేఖాచిత్రాన్ని కూడా రూపొందించలేకపోయింది. దీంతో భారతదేశం సరిహద్దు ప్రాంతం ఆక్రమణకు గురైంది.

1971లో పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సమయంలో భారత్ గెలిచినప్పటికీ.. 93,000 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలను బంధీలుగా చేసుకుని, పైచేయి సాధిస్తే.. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎటువంటి షరతులు లేకుండా ఆ సైనికులను విడుదల చేసింది. దేశ భూభాగం పట్ల ఎంత చిత్తశుద్ధి (చెత్తశుద్ధి) ఉందో తెలుసుకోవాలి.

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత సైనికులు పాకిస్తాన్ లో సర్జికల్స్ స్ట్రయిక్స్ చేస్తే.. రుజువులు ఏవంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. వాజ్ పేయి సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలని సుపరిపాలన అందించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం వాజ్ పేయి ఔన్నత్యాన్ని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఔన్నత్యాన్ని జీర్ణించుకోలేక కులాలు, మతాలు, భాష పేరుతో రాజకీయాలు చేస్తోంది.
అంబేద్కర్ ని నెహ్రూ అడుగడుగునా అవమానించారు. అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర నెహ్రూది. అంబేద్కర్ పట్ల అపారమైన గౌరవంతో మోదీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవమిచ్చింది. కాంగ్రెస్ హీన చరిత్ర బయటపడుతుండటంతో ,దేశంలో తుడుచుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మిణుమిణుకుమంటున్నది. రాబోయే రోజుల్లోనూ రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. భారతదేశం వికసిత్ భారత్ గా రూపుదిద్దుకోవాలంటే దేశ రాజకీయాల్లో లక్ష మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వాజ్ పేయి కన్న కలలు సాకారమవుతున్నాయి. భారతదేశం దివ్యంగా, భవ్యంగా వెలుగొందుతున్నది. అటల్ జీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE