Suryaa.co.in

Andhra Pradesh International

ఉక్రెయిన్ నుంచి నెల్లూరు పిల్లలొచ్చేశారు!

– అందరూ.. క్షేమంగా..ఉక్రెయిన్ నుంచి జిల్లాకు చేరిన 31 మంది విద్యార్థులు
– జిల్లా యంత్రాంగం పనితీరు భేష్
– అవధులు లేని తల్లిదండ్రుల ఆనందం
– కలెక్టర్, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు

నెల్లూరు: ఎట్టకేలకు ఉక్రెయిన్ లో ఉన్న 31 మంది జిల్లాకు చెందిన విద్యార్థులందరూ క్షేమంగా వారి స్వస్థలాలకు చేరినట్లు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సోమవారం వెల్లడించారు.
ఉక్రెయిన్ లో ఏర్పడిన యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో తమ బిడ్డల పరిస్థితి ఏమిటన్న ఆందోళనతో తల్లడిల్లిన తల్లిదండ్రులకు జిల్లా యంత్రాంగం కొండంత అండగా నిలిచింది. జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో అధికారులు విద్యార్థులను సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.

ప్రతి ఒక్క విద్యార్థి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ వారి నుంచి అన్ని వివరాలు సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి వారిని సురక్షితంగా తీసుకురావడంలో జిల్లా యంత్రాంగం అవిరళ కృషి చేసింది. విద్యార్థుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు చేరవేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

అలాగే జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, అధికారులు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారి తల్లిదండ్రులకు అప్పగించిన తీరు ప్రశంసనీయం. ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుంచి అక్కడ ఉన్న విద్యార్థులను ఏ రోజుకారోజు జిల్లాకు తీసుకొచ్చేందుకు అధికారులు ఎంతో కృషి చేశారు. సోమవారం నాటికి జిల్లాకు చెందిన మొత్తం 31 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి జిల్లాలోని వారి స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తమ బిడ్డలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు శ్రమించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా యంత్రాంగానికి తమ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో తామంతా క్షేమంగా ఇంటికి చేరామని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE