మరణమే లేని యోధుడికి
మరణించాడో లేదో
తెలియని వీరుడికి..
మరణించి ఉంటే
ఎప్పుడు..ఎక్కడ..
ఎలా అసువులు బాసాడో
జాడే లేని
అమరుడికి వర్ధంతి..!
సుభాష్ బోస్ మరణం
ఎప్పటికీ తేలని ఓ నిజం(?)
తలవంచని ఆయన నైజం..
స్వతంత్ర సంగ్రామంలో నిఖార్సయిన కమ్యూనిజం!
బాపూ ఆపేస్తే
సహాయ నిరాకరణ..
సాయుధపోరాటమే
మన త్రికరణ అంటూ
జాతిని జాగృతం చేసి
అరెస్టుకు జంకక
జైల్లోనూ లొంగక..
కారాగారంలో నిరాహారమై
విడుదల పరిహారం సాధించాడు..
స్వరాజ్య సంగ్రామమంటే
సాయుధ పోరాటమని చాటి జాతికి సుభాష్ జీ
అయ్యాడు నేతాజీ!
అజాదు హిందు ఫౌజు
దళపతి నేతాజీ..
భరత జాతి కన్న
మరో శివాజీ..
సాయుధ సంగ్రామమే న్యాయమని..
స్వతంత్ర భారతావని
మన స్వర్గమని
ప్రతి మనిషోక సైనికుడై
ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్
అని గడిపాడు..!
ఎటు వెళ్ళాడో..
ఎక్కడ తిరిగాడో..
ఎన్ని దేశాలు దాటాడో..
ఎందర్ని కలిసాడో..
స్వరాజ్య సాధనే లక్ష్యమై..
పోరాటమే లక్షణమే..
స్వేచ్చే ఘోషై..
సాయుధపోరాటమే భాషై..
గగనసిగలకెగసి కనుమరుగయ్యాడు
జోహార్ జోహార్
సుభాష్ చంద్ర బోస్..!
అతడే ఒక సైన్యం..
తాను సైనికుడై జాతి మొత్తం
ఒక సేన కావాలని తలచాడు
అహింస మాట వద్దు..
ఆయుధమే ముద్దన్నాడు..
తెల్లదొరలపై పోరుకు
జాతిని ఏకం చేసి
జగతిని చుట్టి..
అంతటి శక్తిని చుట్టుముట్టి..
తానే తల్లి భారతి చేతి ఆయుధమయ్యాడు..!
ఆయన జీవితం ఓ హిస్టరీ
మరణం ఓ మిస్టరీ..
సాహసమే ప్రమోదమై..
అదే జాతికి ఆమోదమై..
పిలుపు సింహనాదమై..
తన యాత్ర ప్రమాదమై..
ప్రతి చర్య అద్భుత దృశ్యమై
కడకు తానే అదృశ్యమై..
ఉన్నాడేమో అన్న ఆశ..
ఆయన నింపిన స్ఫూర్తే శ్వాస
మొత్తానికి ఆప్పటికీ..ఇప్పటికీ
ఎప్పటికీ సుభాష్ బోసు..
సెభాష్ బోసు!
విప్లవం మరణించదు..
వీరుడు మరణించడు..
నేతాజీ అమర్ రహే!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286