– పగలయితే డ్రైవర్లకు రోడ్లపై మనుషులు కనిపిస్తారట
– కాబట్టి పగటి ప్రయాణాలే సురక్షితమట!
– ‘బొస్సు’ ప్రయాణీకులకు ‘మహా’ సందేశం
( మార్తి సుబ్రహ్మణ్యం)
అన్నీ వేదాలలో ఉన్నాయష.. అన్న కొటేషన్‌ను మించిన కొటేషన్ ఇది! సముద్రయానం చేయవద్దన్న పెద్దలమాట విన్నాం.సర్వసంగ పరిత్యాగులు సముద్రం దాటకూడదన్న పురాణాలు విన్నాం. కానీ రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దని పెద్దలు చెప్పినట్లు ఏ గిరీశం ఇప్పటిదాకా సూత్రీకరించలేదు. కన్యాశుల్కం పుస్తకం పేజీలన్నీ తిప్పినా ఎక్కడా కనిపించి చావదు. ఇప్పుడే ఉద్భవించిన ఓ ఆధునిక ‘మహా’ గిరీశం చెప్పిన నయా సూత్రీకరణ, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేదే.
అవును.. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిఝంగా నిజం. రాత్రి ప్రయాణం చేసినందుకే వేమూరి కావేవి బస్సు దహనమయిందట. అదే.. పెద్దలు-ప్రభుత్వాలు-అధికారులు చెప్పినట్లు పగలు ‘బొస్సు’ ప్రయాణం చేస్తే, ప్రాణాలు దక్కుతాయట. ఇది ఇప్పటివరకూ ఏ మేధావి ఇవ్వని ‘మహా’ సందేశం! కావాలంటే మీరే చదివి తరించండి.
ఇటీవల జరిగిన కర్నూలు వేమూరి కావేరి బస్సు దహనం కేసు విషాదానికి ఆంధ్ర-తెలంగాణ-కర్నాటక ప్రభుత్వాలు విచారణలోకి దిగాయి. ఏపీ సర్కారయితే వెంటనే ఫోరెన్సిక్ దళాలను దింపింది. రెండు తెలుగు ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాయి.
కావేరి కన్నీటి విషాద ఘటనతో దిద్దుబాటుకు దిగిన రెండు తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారులు.. ఒక్కసారిగా గాఢ మత్తునిద్ర నుంచి మేల్కొని, ఊరిమీద పడి ట్రావెల్స్‌ను జల్లెడపట్టాయి. లైసెన్సులూ, పర్మిషన్లు గట్రా దస్త్రాలను భూతద్దం వేసి పరిశీలించి, కేసులు కట్టాయి. కర్నూలు జిల్లాలో కావేవి విషాదం జరగకపోతే రవాణా శాఖ అధికారులు ఇంకా సుఖనిద్రలో ఉండేవారు. ఆ సంగతి ఇంకోసారి ముచ్చటించుకుందాం.
వేమూరి కావేవి బస్సు విషాదానికి ఇప్పటివరకూ అసలు కారణాలను ఎవరూ తేల్చలేదు. టూ వీలరు నడిపిన వ్యక్తి, ఎక్కడ పెట్రోలు పోయించుకున్నాడో ఫొటోలయితే వచ్చాయి. తర్వాత సదరు టూ వీలరు నడిపిన వ్యక్తి, బె ల్టుషాపులో మందు తాగి డ్రైవింగ్ చేశాడు కాబట్టి.. అసలు ఆ బె ల్టుషాపులకు అనుమతించిన సర్కారుదే ఈ తప్పని, వైసీపీ రెండవ రోజునుంచే కొండెక్కి బండలేయడం మొదలెట్టింది. సరే అది ప్రతిపక్ష ధర్మం. కానీ ప్రభుత్వం మాత్రం, అతగాడు వైన్‌షాపులోనే మందు బాటిల్ తీసుకున్నాడని వాదించింది. ఎదురుదాడి చేయడం పాలకుల ధర్మం మరి!
ఇలా వేమూరి కావేరి బస్సు దహనంపై ఇన్ని కోణాల్లో వాదోపవాదాలు, ఆరోపణ-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో.. అసలు ఎవరికీ రాని ఆలోచన .. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబుకు గానీ.. ఈనాడు-ఆంధ్రజ్యోతి-సాక్షి వంటి తెలుగు అగ్ర దినపత్రికలు, ఎన్ టివి, టీవీ 9, టీవీ5, ఈటీవీ, ఏబీఎన్ వంటి సరుకున్న మోతుబరి చానెళ్లకు గానీ… ఏఐఎస్-ఐపిఎస్‌ల దృష్టిలో ‘పెద్ద ముత్తయిదువ’గా పేరున్న ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ఇంగ్లీషు పేపర్లకు కూడా రాని ఆలోచన.. వెలగని బల్బు.. తట్టని కొత్త కోణం.. ఒక చిన్న తెలుగు టీవీ చానెల్‌కు రావడమే విశేషం.
నిజానికి సదరు చానెల్ టీవీ తెరపై కూర్చున్న ప్రఖ్యాత తెలుగు జర్నలిస్టు విరచిత వ్యాఖ్యలు చూసి- విని తరించాలే తప్ప, దానిని వర్ణించ నలవి కాదు. అలాంటి కొత్త కోణపు ఆలోచన తమకెందుకు రాలేదని మోతుబరి టీవీలు-పత్రికల ఎడిటర్లు సిగ్గుతో కుమిలిపోకతప్పదు. సీఎంలు ఎలా పాలించాలి? ప్రభుత్వాలు ఎలా నడవాలి? అధికారులు ఎలా పనిచేయాలనే రాజశాసనాలు తప్ప.. ఇప్పటివరకూ తెలుగుజాతికి అలాంటి కొత్త సందేశం ఇవ్వనందుకు, బహుశా ప్రతివారం జాతికి సందేశాలిచ్చే ‘కొత్తపలుకు’ కూడా.. ‘మహా’ ఉపదేశానికి ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోతుందేమో?
ఇంతకూ సదరు ప్రఖ్యాత తెలుగు జర్నలిస్టు తన ‘మహా’ తెరపై కూర్చుని జాతికి ఏం సందేశం ఇచ్చారో ఓ సారి చూద్దాం. ఈనాడు-ఆంధ్రజ్యోతి-సాక్షి వంటి అగ్రదినపత్రిక ఎడిటర్లు, సంపాదకవర్గంతోపాటు.. ఈటీవీ, ఎన్టీవీ, టీవీ9, టీవీ5 వంటి తెలుగు చానెళ్లు కూడా, తెలుగు ఎలా మాట్లాడాలో-ఎంత స్పష్టంగా మాట్లాడాలో ఆ జర్నలిస్టును చూసి నేర్చుకుని తీరాలి. ఇంతకూ ‘మహా’టీవీలో ఆ ప్రఖ్యాత జర్నలిస్టు.. వేమూరి కావేరి బస్సు దహనానికి కారణాలేమిటి? అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగిందన్న రహస్యాన్ని విప్పి, బ్రహ్మాండం ఎలా బద్దలు చేశారో చూద్దాం.
ఆయనేమన్నారంటే.. ‘‘లేకపోతే వాడు నిదరొచ్చినవాడో..లేకపోతే ఒకరకమైన వ్యక్తో. వాడొస్తే వాడి ఖర్మ బాగోలేక వీళ్లను కాజేస్తాడు కదా? అందుకనే రాత్రిపూట ప్రయాణాలు వద్దని పెద్దలు చెప్పినా, ప్రభుత్వం చెప్పినా, అధికారులు చెప్పినా రాత్రిపూట ప్రయాణాలు వద్దు. మాగ్జిమమ్ తగ్గించండి అని ఎందుకు చెబుతారు చిలక్కి చెప్పినట్లు? ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయనే! అదే ఉదయమయితే ఆ ‘‘బొస్సు’’ డ్రైవరుకు ఆ టూ వీలరు కనపడేది. అందుకే ‘‘నైటుకీ’’ పగలుకూ డ్రైవింగ్‌కు చాలా వ్యత్యాసం ‘‘ఉండిద్ది’’. అందుకని నైటు ప్రయాణాలొద్దు’’ అని అచ్చ తెనుగులో.. ఒక్క అక్షరం తప్పులేకుండా, జాతినుద్దేశించి పిలుపునిచ్చారు.
ఆ రకంగా కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి బస్సు దహనం వెనక జరిగిన రహస్యాన్ని ఇంత ధైర్యంగా బట్టబయలు చేసినందుకు, యావత్ తెలుగుజాతి కమ్ ప్రయాణికులు జమిలిగా, సదరు ప్రఖ్యాత జర్నలిస్టుకు రుణపడితీరాల్సిందే.
నిజానికి ఈమాట స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్క ముఖ్యమంత్రి గానీ.. ఒక్క పత్రిక గానీ.. ఒక్క చానెల్‌గానీ చెప్పిన పాపాన పోలేదు. ఎంతసేపటికి కట్నం తీసుకున్న వాడు గాడిద.. కులాలు లేని సమాజం నిర్మిద్దాం.. దమ్మున్న చానెల్ వంటి నినాదాలే తప్ప, ఇలాంటి సామాజిక బాధ్యత ఉన్న పిలుపులేవీ?
నిజమే కదా? రాత్రి పూట ప్రయాణాలు చేస్తే ఇలాగే ప్రమాదాలు జరుగుతాయని, ఇప్పటివరకూ మనకు చిలక్కి చెప్పినట్లు చెప్పిందెవరు? అందువల్ల ఉదయం ప్రయాణాలు పెట్టుకుంటే, డ్రైవర్లకు కళ్లు బాగా కనిపిస్తాయి కాబట్టి.. బస్సు ముందు ఎవరు వెళుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి.. ఉదయం ప్రయాణమే రైటు అన్నది ఎంతమందికి తెలుసు?
సో.. ‘మహా’ సందేశం ఇచ్చినట్లు.. తెలుగు ప్రయాణీకులే కాదు. భారద్దేశ ప్రయాణీకులంతా రాత్రి ఇంట్లో హాయిగా బజ్జోని, తెల్లారిగట్ల మొహం కడిగి, స్నానం చేసుకుని, రెండు ఇడ్డెన్లు తిని బస్సెక్కితే.. ఎవరి ప్రాణాలు వారికి భద్రంగా ఉంటాయి. ప్రభుత్వాలకూ ఎక్స్‌గ్రేషియా ఇచ్చే లంపటమూ తగ్గిపోతుంది. అలాగే మళ్లీ విడి సందేశాలు ఎందుకు? రాత్రి విమానం, రైలు, కార్లలో ప్రయాణించేవారూ ఈ సందేశం పాటిస్తే మరికొన్నేళ్లు హాయిగా బతికుంటారు. బతికుంటే బలుసాకయినా తినవచ్చు కదా. ఏతంటరేటి?
గొప్ప సామాజిక స్పృహ-సామాజిక బాధ్యత -జాతి ప్రయోజనాల కోసం, సమాజ హితం కోరే ఇలాంటి హితైషులు ఎంతమంది ఉంటారు చెప్పండి? కాబట్టి ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని… రాత్రి వేళ ప్రయాణాలు చేయవద్దంటూ, ‘జాతికి సందేశం’ ఇచ్చిన ఇలాంటి దిగ్గజ జర్నలిస్టు వ్యాఖ్యలను దయచేసి ట్రోల్ చేయకుండా.. వెటకారం ఆడకుండా.. ఆయన హితోక్తులు పాటిస్తే అందరి ప్రాణాలు హ్యాపీగా ఉంటాయన్నది పాత్రికేయలోకం ఉవాచ.
సరే.. సమాజంలో రకరకాల మనుషులుంటారు బొమ్మ-బొరుసు మాదిరిగా! అంటే సోషల్‌మీడియా మేధావులన్నమాట!! ఆ సోషల్‌మీడియా సైనికులు.. రాత్రివేళ ప్రయణాలు చేయవద్దన్న ‘మహా’ సందేశంపై తమ శైలిలో కౌంటర్ సందేశాలు ఇస్తున్నారు.
సోషల్‌మీడియా సైనికుల వాదన ఏమిటంటే.. రాత్రి ప్రయాణాలు మానుకుంటే కర్నూలు వంటి దుర్ఘటనలు ఆగిపోతాయా? తగ్గిపోతాయా? ఆ దుర్ఘటనలో ఎన్ని సంస్థాగత, వ్యవస్థాగత లోపాలు ఉన్నాయో వదిలేసి.. ఏమిటిది? అందరికీ గుర్తుండే ఉంటుంది. పదేళ్ల క్రితం బస్సు లగేజీలోని మండే స్వభావం గల పదార్ధాల వల్ల ఇలాంటి ఘటనే జరిగింది. పదేళ్ల తర్వాత కూడా, టెక్నాలజీ అభివృద్ధి చెందాక కూడా మళ్లీ అదే తప్పు.
ఎవరిది నిర్లక్ష్యం? పాసింజర్ వెహికల్లో కార్గోను ఎలా అనుమతిస్తారు? స్టేజి క్యారియర్‌గా ప్రైవేటు ఆపరేటర్లు బహిరంగంగా ఆన్లైన్లో టికెట్లు అమ్ముతుంటే, ప్రభుత్వం ఎలా చూస్తూ ఉంటుంది? అసలు హైవే పై 2డబ్ల్యు అదీ రాత్రి పూట విచ్చలవిడిగా వస్తూ ఉంటే పెట్రోలింగ్ ఏదీ? ఇలా ఇవి కదా చర్చించుకోవలసినవి?! అది వదిలేసి రాత్రి పూట ప్రయాణాలు వద్దు అనడం హేమిటో’’ అంటూ తెగ ఎకసెక్కాలాడుతున్నారు. లోకోభిన్నరుచి మరి! చూడటం.. వినడమే మన పని!!