– మేధోమధనానికి బొందపెట్టి, భజన చేసే సంస్థగా మారిపోయింది
– కేసీఆర్ ఆవేదన
నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో తాను కూడా ఉన్నానని, అప్పుడు ప్రధాని మాటలు తనకు ఎంతో నచ్చాయని చెప్పారు. శనివారం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
‘‘నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడంతో భారత్‌కు మంచి రోజులు వచ్చాయని ఆశపడ్డా. కానీ దురదృష్టవశాత్తూ అది ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది. మేధోమధనానికి బొందపెట్టి, ప్రధానమంత్రో మరొకరో చెప్పిన మాటలకు భజన చేసే సంస్థగా మారిపోయింది. ప్లానింగ్ కమిషన్‌కు నిర్దిష్టమైన నియమనిబంధనలు ఉండేవి, రాష్ట్రాల బడ్జెట్లలో కూడా మార్గదర్శకత్వం వహించేది. కానీ నీతిఆయోగ్ అది కూడా చెయ్యలేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, నీతి ఆయోగ్‌లో నీతి అంత ఉంది. ఏదో జరుతుందని ఆశిస్తే.. ఏం జరగలేదు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అయింది.
మోదీ వాగ్దానాలు, బీజేపీ వాగ్దానాలు, నీతిఆయోగ్ సృష్టి ఒక జోక్ అయిపోయింది. దేశంలో ఇప్పటి వరకు లేనట్లు నానాటికీ దిగజారిపోతున్న పరిస్థితి. విద్వేషం, అసహనం పెరిగిపోయి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో డిమాండ్లతో ధర్నాలు చేసేవారు. వీటితో కొన్నిసార్లు ఫలితాలు కూడా ఉండేవి. దేశ చరిత్రలో లేని విధంగా దేశ రైతాంగం మొత్తం రాజధానిలో 13 నెలలపాటు ధర్నా చేశారు. వారిలో 700-800 మంది చనిపోయారు. ఆ తర్వాత ప్రధాన మంత్రే క్షమాపణలు చెప్పి చట్టాలు వెనక్కు తీసుకున్నారు.
ఇది పరిస్థితి మెరుగైనట్లా? మేధోసంపత్తి పెరిగినట్లా? ఈ దుస్థితి మనం కళ్లారా చూస్తున్నాం. చేసిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా చెయ్యలేదు. డీజిల్ రేట్లు, విత్తనాల రేట్లు అన్నీ పెరిగిపోయాయి. రైతుల ఆదాయం డబుల్ చేస్తామంటే.. వారి పెట్టుబడి రెట్టింపు అయింది కానీ రాబడి కాదు. దేశంలో మంచి నీళ్లు కూడా సరిగా లేవు. నీతి ఆయోగ్ ఏం సాధించింది? తాగు, సాగు నీరు ఉండదు. కరెంటు ఉండదు, ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. లక్షలాది పెట్టుబడులు విదేశాలకు వెళ్లిపోతున్నాయి. చివరకు ఉపాధి హామీ ఉద్యోగులు కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే దౌర్భాగ్యం ఏర్పడింది.