Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఏ ఉద్యోగి సంతోషంగా లేడు

– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

రాష్ట్రంలో ఏ ఉద్యోగి సంతోషంగా లేడని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఇలా ఏ ఉద్యోగి కూడా సంతోషంగా లేడు. ఇది నాయకుల వైఫల్యమని అధికారులు, అధికారుల వైఫల్యమని నాయకులంటున్నారు. లీడర్ షిప్ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. 13లక్షల42వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేనిదిగా మారింది.

ఉద్యోగస్థులకు 1వ తేదీనే జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 70 సంవత్సరాలు దాటినవారికి అడిషనల్ కోటా పెన్షన్ ను తీసేయడం అన్యాయం. తమ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వంలో చేరిన ఆర్టీసీ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇవ్వడం బాధాకరం. జాతీయ విద్యా ప్రమాణాల ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల శాతం ఉండాలి. 22 వేల మంది హెల్త్ కమిషన్ ఉద్యోగులకు కేంద్ర వాటా ఉంది రాష్ట్ర వాటా లేదు. ఉద్యోగుల ఖర్చుపై తప్పుడు లెక్కలు ఇచ్చి ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి ఇల్లు ఇస్తామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనిఉంది. ప్రభుత్వ విధానాలతో వ్యవస్థలు దిగజారిపోయి పరిపాలన అస్తవ్యస్థంగా మారింది.

ఉద్యోగుల పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫలితం శూన్యం. సీపీఎస్ తీసేసి, జీపీఎస్ పెట్టడం ఎవరూ ఆమోదించడంలేదు. సామాజికవేత్తలు, విద్యావేత్తలు ఎంతచెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుంది. ప్రభుత్వం డీఏ అరియర్స్ ఎందుకు ఇవ్వలేకపోతోంది? మాకేమిచ్చారని సామాన్య ఉద్యోగస్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగస్థుల నాయకత్వం ఫెయిల్ అయింది. వారు రాజకీయ పదవులు అడుక్కోవడానికే సరిపోతోంది. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. మున్సిపల్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగస్థులు చెప్పుకోవడానికి వ్యవస్థలు లేవు. 11వ పీఆర్సీలో రోడ్డుపై పడుతున్నారు. అందరికీ పనికొచ్చే హెల్త్ కార్డు ఎందుకూ పనికిరాకుండా పోతోంది.

రెగ్యులర్ ఉద్యోగులు, టీచర్లు, సీపీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఆర్టీసీ ఉద్యోగస్థులందరూ నిరుత్సాహంతో జీవిస్తున్నారు. పరిపాలన గాడితప్పింది. ఆర్థిక మంత్రి పట్టించుకోవడంలేదు. ఉద్యోగస్థులు కూడా సొసైటీలో భాగమే. వారి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సివుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. వ్యాట్ పెరిగింది. ఎక్సైజ్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా బాగానే వస్తోంది. పన్నులతో జనం వీపు ఎర్రగా మారింది. లోటు బడ్జెట్ ఉందుకొస్తోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఉద్యోగస్థులకు జీతాలు ఇవ్వడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందనడం తప్పు. ఆర్థిక మంత్రి ఎక్కడుంటున్నాడో ఎవరికీ తెలియటంలేదు. ఉద్యోగస్థులు సెక్రటేరియేట్ వచ్చి వారి సమస్యలు చెప్పుకోవాలన్నా వినేవారు లేరు. చిన్నపిల్లలను బాగా చూసుకునే అంగన్వాడీలకు మూడు నెలలుగా జీతాలు లేవు. పాల బిల్లు చెల్లించలేదని పాలసరఫరా ఆపేశారు. మున్సిపల్ వర్కర్లు రోడ్లపైకి వస్తే సిటీ జీవితం దుర్భరమవుతుంది. వ్యవస్థల్ని నలిపేయకండి. హెల్త్ కార్డులు సరిచేసి ఉద్యగస్థుల డబ్బులు కడితే రిటైర్ ఉద్యోగస్థులు ఆసుప్రతులకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు, ఏ ఉద్యోగి నష్టపోకూడదు, కష్టపడకూడదు. సమస్యలపై స్పందిస్తారో, నిద్రపోతారో వైసీపీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఉద్యోగస్థుల సమస్యలను కాలదన్నుకుండా సరిచేయాలని టీడీపీ నాయకులు సూచిస్తున్నారు. ఉద్యోగస్థులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు.

LEAVE A RESPONSE