-ద్వారంపూడి వ్యాఖ్యలతో భగ్గుమంటున్న మత్స్యకారులు
-క్షమాపణ చెప్పాలంటూ రోడ్డెక్కుతున్న మత్స్యకారులు
-వైసీపీకి ఓటేసేదిలేదంటూ భీషణ ప్రతిజ్ఞ
-చీరాల నుంచి విశాఖ వరకూ విసర్తించిన తీరం
-తీరప్రాంతాల్లో మత్య్సకారులదే హవా
-తాజా పరిణామాలతో తలపట్టుకుంటున్న వైసీపీ కోస్తా నేతలు
-ఎన్నికల సమయంలోనూ ఈ నోటిదురుసు ఏమిటని ఆగ్రహం
-తమ విజయంపై ద్వారంపూడి వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయన్న ఆందోళన
( మార్తి సుబ్రహ్మణ్యం)
కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు రోజుకోవిధంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు,,, పార్టీ కొంపముంచేలా ఉన్నాయని వైసీపీ అభ్యర్ధులు, శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. అయినా వారిపై నియంత్రణ లేకపోవడంతో, వారి వ్యాఖ్యల ప్రభావం ఎన్నికల బరిలో ఉండే, తమపై పడతాయన్నది వారి అసలు ఆందోళన.
ఇటీవల వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స పలు అంశాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సజ్జల రెండు ఓట్ల ఫిర్యాదు అంశాలు వైసీపీ వర్గాల్లో ఆందోళన కలిగించాయి. ఉమ్మడి రాజధానిపై వైవి సుబ్బారెడ్డి, దానిని ఖండిస్తూ మంత్రి బొత్స ప్రకటన, మంగళగిరిలో స్థానికులనే ఎన్నుకోవాలంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో అల్లకల్లోలం సృష్టించాయి.
అంతకుముందు సలహాదారు సజ్జలకు పొన్నూరు-మంగళగిరిలో రెండు ఓట్లు ఉన్న వైనం, ఎన్నికల సంఘం వరకూ వెళ్లింది. పార్టీలో ఇంత గందరగోళం జరుగుతున్నా.. అధినేత జగన్, ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం.. కనీసం నేతలను నియంత్రించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమయింది.
ఆ వివాదాలు పూర్తిగా సర్దుమణగకముందే.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మత్స్యకారులపై చేసిన వ్యాఖ్యలు, పార్టీలో దుమారం సృష్టిస్తున్నాయి. విశాఖ వరకూ ఉన్న విస్తరించి ఉన్న తీరప్రాంతంలో, మత్స్యకారుల సంఖ్య అధికం. ఏ ఎన్నికల్లో అయినా వారే విజయాన్ని శాసిస్తుంటారు.
ప్రధానంగా ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాల్లో అత్యధికంగా.. గుంటూరు జిల్లాలో రేపల్లె, ప్రకాశం జిల్లాలో చీరాల, బాపట్ల వంటి ప్రాంతాల్లో మత్స్యకారుల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక కాకినాడ, రాజమండ్రి, విశాఖ వంటి ప్రాంతాల్లోనయితే చెప్పాల్సిన పనిలేదు. ఇంత కీలకమైన సామాజికవర్గ నేతపై.. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలు, ఇప్పుడు తీరప్రాంత నియోజకవర్గాల్లో పోటీకి దిగుతున్న వైసీపీ అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
మత్స్యకార నేత, మాజీ ఎమ్మెల్యే కొండబాబునుద్దేశించి, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ సామాజికవర్గంలో కాకరేపుతున్నాయి. ‘కోటితో గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి, కుటుంబం నీది’ అంటూ ద్వారంపూడి, మత్స్యకార నేత కొండబాబుపై చేసిన విమర్శ.. ఇప్పుడు మత్స్యకార వర్గాన్ని రోడ్డెక్కించేలా చేస్తున్నాయి.
తమ నాయకుడిని విమర్శించడమే కాకుండా, తమ జాతిని అవమానిస్తూ విమర్శించిన ద్వారంపూడి తక్షణమే తమ జాతికి క్షమాపణ చెప్పాలంటూ, మత్స్యకారులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు-రాస్తారోకోలు చేస్తున్నారు. మత్స్యకార సంఘాలు కూడా గళం విప్పి, వైసీపీ సర్కారును హెచ్చరించే దిశగా నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటువేసేది లేదని, మత్స్యకార యువత భీషణ ప్రతిన ప్రారంభించడం ఆందోళన కలిగించే అంశం. ఇది ఎన్నికల బరిలో ఉన్న తీరప్రాంత వైసీపీ అభ్యర్ధులకు ప్రాణసంకటంలా పరిణమించింది.
గత ఎన్నికల్లో మత్స్యకారుల ఓట్ల కోసం చచ్చీ చెడీ పడిన కష్టం.. ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలతో గంగలో కలిసినట్లయిందని వైసీపీ అభ్యర్ధులు-సీనియర్లు తలపట్టుకుంటున్నారు. తీరప్రాంతాల్లో వారి ప్రభావం-శక్తి ఏమిటో తెలిసికూడా, ద్వారంపూడి వ్యాఖ్యలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
‘ద్వారంపూడి నియోజకవర్గంలో కూడా మత్స్యకారులున్నారు. కానీ మా నియోజకవర్గాల్లో వారిదే హవా. మత్స్యకారులు దయతలిస్తే తప్ప మేం గెలవలేం. ఇప్పుడు ద్వారంపూడి పుణ్యాన మాకు వాళ్ల ఓట్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా మా అధినేత మౌనంగా ఉండటమే మాకు ఆశ్చర్యంగా ఉంది’’ విశాఖకు చెందిన ఓ మత్స్యకార వైసీపీ నేత విస్మయం వ్యక్తం చేశారు.
అసలు ఎన్నికల సమయంలో, కులనాయకులపై విమర్శలకు దూరంగా ఉండాలన్న కనీస స్ప్పహ కూడా, మా నేతలకు లేకపోవడం మా దౌర్భాగ్యం అని కాకినాడకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలతో, మత్స్యకార వర్గం పూర్తిగా తమ పార్టీకి దూరమయినట్లేనని వైసీపీ సీనియర్లు అంగీకరిస్తున్నారు. ‘‘ఎన్నికల లోగా మరికొందరు నేతలు ఇలాగే మాట్లాడితే.. మా పార్టీని మిగిలిన పార్టీలు ఓడించాల్సిన పనిలేదు. మాకు మేమే ఓడించుకుంటామ’’ని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన, ఓ వైసీపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు.