– తెలంగాణ శాసనసభలో బీజేపీకి ఫ్లోర్ లీడర్ ఏరీ?
– ఏడాది క్రితమే రాజాసింగ్ సస్పెన్షన్
– రాజాసింగ్ సస్సెన్షన్ తర్వాత కొత్త నేతను నియమించని నాయకత్వం
– ఈటల, రఘునందన్ ఉన్నా పట్టించుకోని నాయకత్వం
– సభ సాగనందున నాయకుడు లేకున్నా ఫర్వాలేదన్న కిషన్‌రెడ్డి
– ఫ్లోర్‌లీడర్ లేకుండా తొలిసారి అసెంబ్లీలోకి వెళుతున్న బీజేపీ సభ్యులు
– జాతీయ పార్టీకి ఫ్లోర్ లీడర్ లేకపోవడం అవమానమేనంటున్న సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
సిద్ధాంతాల మడి కట్టుకునే బీజేపీ.. ఇప్పుడు ఆ సిద్ధాంతాలకే నీళ్లు ఒదులుతున్న వైనం, ఆ పార్టీ సంప్రదాయవాదులను కలచివేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత, ఫ్లోర్‌లీడర్‌ను నియమించిన బీజేపీ నాయకత్వం.. ఇప్పుడు కీలకమైన శాసనసభా పక్ష నేత ఎంపికను కూడా విస్మరించడం, విమర్శలకు దారితీస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న రాజాసింగ్‌ను, పార్టీ నుంచి ఏడాది క్రితమే సస్పెండ్ చేశారు. ఆయన తనకు వచ్చిన షోకాజ్‌కు సమాధానం ఇచ్చి కూడా, దాదాపు 10 నెలలవుతోంది. దానిపై ఇప్పటిదాకా నాయ త్వం నిర్ణయం తీసుకోలేదు. ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అలాగని కొత్తగా ఎవరినీ ఫ్లోర్‌లీడర్‌గా నియమించలేదు.
అసలు ఇది పెద్ద ప్రధానాంశం కాదన్నట్లుగా, నాయకత్వ తీరు కనిపిస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నప్పటికీ, ఫ్లోర్ లీడర్ లేకపోవడం అవమానకరమని పార్టీ సీనియర్లు వాపోతున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారిలో రాజాసింగ్ ప్రస్తుతం సాంకేతికంగా బీజేపీలో లేరు. బహిష్కరించలేదు కాబట్టి, సాంకేతికంగా బీజేపీ సభ్యుడి కిందే లెక్క. నిజానికి ఈ ముగ్గురిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీనియర్ నేత. లెక్కప్రకారమైతే ఫ్లోర్ లీడర్ ఆయనకే ఇవ్వాలి. ఉప ఎన్నికల్లో గెలిచిన ర ఘునందన్‌రావు కూడా, తనకు ఫ్లోర్‌లీడర్ ఇవ్వాలని ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు నాయకత్వాన్ని కోరారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడించారు.
సాంకేతికంగా పార్టీకి ఫ్లోర్‌లీడర్ లేనందున, ఉన్న రాజేందర్ లేదా రఘునందన్‌రావులో ఒకరిని ఫ్లోర్‌లీడర్‌గా నియమిస్తూ.. అసెంబ్లీకి లేఖ రాయాలన్న స్పృహ, తీరిక పార్టీ నాయకత్వానికి లేకపోవడంపై, పార్టీ సీనియర్లలో విస్మయం వ్యక్తమవుతోంది.
పైగా ఈవిషయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపె,ై సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సభనే సక్రమంగా జరగనప్పుడు.. ఫ్లోర్‌లీడర్ లేకపోయినా ఫర్వాలేదన్నట్లు మాట్లాడిన కిషన్‌రెడ్డి వైఖరిని, సీనియర్లు తప్పుపడుతున్నారు.
ఇటీవలి కాలం వరకూ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన కిషన్‌రెడ్డి నుంచి, ఇలాంటి మాటలు వినాల్సి రావడం దురదృష్టకరమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడికి సమాంతరంగా ఫ్లోర్‌లీడర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఎలాగూ ఇదే చివరి అసెంబ్లీ. కాబట్టి, తనకు పోటీగా మరొక నేతను తయారుచేయడం ఎందుకన్న ముందుచూపుతోనే, ్డ ఫ్లోర్‌లీడర్ ఎంపికకు కిషన్‌రెడ్డి, ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఫ్లొర్‌లీడర్ లేకుండానే బీజేపీ సభ్యులు సభలోకి అడుగుపెడుతున్నారు.
నిజానికి ఎన్నికల నేపథ్యంలో ఇదే చివరి సమావేశాలు. ఆ తర్వాత ఫ్లోర్‌లీడర్లకు ప్రాధాన్యం ఉండదు. కానీ సాంకేతికంగా ఒక పార్టీకి, తన శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ పదవి కాలపరిమితి ఎంతన్నది పక్కకుపెడితే, సాంకేతికంగా ఫ్లోర్‌లీడర్‌ను ఎంపిక చేయడం పార్టీల విధి. దానిని జాతీయ పార్టీ అయిన బీజేపీ విస్మరించడమే, విడ్డూరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.