Suryaa.co.in

Andhra Pradesh

రైతుకు బాబు కుచ్చు టోపి

– టీడీపీ హయాంలో వ్యవసాయానికి “నో సాయం”
– వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ
అధికారంలో ఉన్నంతకాలం రైతులను కాల్చుకు తిని, అధికారం పోయిన తర్వాత రైతుల కోసం తెలుగుదేశం అని అంటే టీడీపీని, చంద్రబాబును ఎవరు నమ్ముతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుకు టోపీ పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క చంద్రబాబే అని అన్నారు. టీడీపీ పాలనలో అసలు వ్యవసాయం ఎక్కడ ఉందని, ఎప్పుడూ కరువేనని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ధీమాగా ఉంటే.. టీడీపీ హయాంలో కోమాలో ఉన్నారన్నారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
అధికారంలో ఉన్నంతకాలం రైతులను కాల్చుకు తిని, అధికారం పోయిన తర్వాత రైతుల పట్ల తెలుగుదేశం అంటే ఎవరు నమ్ముతారు. రైతులపై టీడీపీ హఠాత్తుగా ప్రేమ ఎందుకు ఒలకపోస్తోందంటే.. రైతును మళ్ళీ మోసం చేయడం కోసమే. ‘రైతు మోసం తెలుగుదేశం- రైతుకు బాబు మోసం’ అనేలా టీడీపీ నేతలు రోడ్ల మీద తిరిగితే బాగుండేది. టీడీపీ హయాంలో.. రైతు అనే పదం పలకడానికే చంద్రబాబు ఇష్టపడేవారు కాదు.
ఇప్పుడు రైతు కోసం అంటూ డ్రామాలు చేస్తున్న టీడీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం. ఉద్యాన వన పంటలకు ఎంఎస్‌పీ లేదు. కొబ్బరి విషయంలో మార్కెట్లో ఈప్రభుత్వం జోక్యంచేసుకుంది. మీరెప్పుడైనా ఆ పని చేశారా? మీరెందుకు ఎంఎస్‌పీ పెట్టలేకపోయారు. ? జీడిమామిడికి క్వింటాల్‌కు రూ.9,250లు ప్రోత్సాహక రేటుగా ప్రకటించాం. చరిత్రలో ఎప్పుడూ కూడా మీరు జీడిమామిడికి ప్రోత్సాహక రేటు ఇవ్వలేదు.
మీ హయాంలో.. ప్రొత్సహకాలు కాదు కదా.. వరి అంటే సారీ అని… వరి అంటే రైతులు ఏరి అంటూ హైటెక్‌ విధానంలోనే మీరు ముందుకు వెళ్లారు. రకరకాల గ్రాఫిక్స్‌తో మాయ చేయాలని చూశారే కానీ, ఎప్పుడైనా రైతుకు మేలు చేసే ప్రయత్నం చేశారా?
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సారథ్యంలో రికార్డు స్థాయిలో రైతుల వద్ద నుంచి పంటను ప్రొక్యూర్‌మెంట్‌ చేయగలిగాం. మీరెప్పుడైనా చేశారా? మీ హయాంలో వ్యవసాయం అంటే నో సాయం అనేవాళ్లు. వ్యవసాయం అంటే దండుగ అని వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి, రైతుల్ని పట్టించుకోకపోతే పుట్టగతులు ఉండవని దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చెప్పడమే కాకుండా వ్యవసాయాన్ని అంటే పండుగలా మార్చిన మహనీయుడు. ఇక ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పాలనలో వ్యవసాయం అంటే నిండుగా.. అనేలా రైతులను ఆదుకుంటున్నారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆర్బీకేలు ఏర్పాటు చేసి, మనందరి రారాజు- రైతుల మహరాజు వైఎస్‌ జగన్‌ అని సగర్వంగా చెబుతున్నాం.
పంటకు సాగునీరు ఇవ్వడం లేదని టీడీపీ చెప్పడం పచ్చి అబద్ధం. సాగునీరు లేదనేది గడిచిన రెండున్నరేళ్ళ జగన్ గారి పాలనలో ఎక్కడా కూడా లేదు. పంటలకు ఇన్సురెన్స్‌ రాలేదంటూ టీడీపీ ధర్నాలు చేస్తున్నారు కానీ… పంటలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బీమా సౌకర్యం కల్పించింది ముఖ్యమంత్రి . జగన్ప్ర భుత్వంలో రైతులు ధీమాగా ఉంటే.. టీడీపీ హయాంలో కోమాలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు రైతుల పట్ల డ్రామా ఆడుతున్నారు.
ఒక్క రూపాయి బాకీ లేకుండా టీడీపీ హయాంలో చేసిన ఇన్సురెన్స్‌ సం‍స్థలకు బీమా బకాయిల చెల్లింపులు కూడా చేశాం. మీ హయాంలో ఎగ్గొట్టిన రూ. 1400 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీలు కూడా మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. ముఖ్యమంత్రి నాయకత్వంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి నష్టంలేదు. నష్టం ఏదైనా ఉందంటే అది టీడీపీకే. మీ హయాంలో మీటర్లు లేవు.. కరెంటూ కూడా లేదు. 96శాతం రైతులు ఇప్పటికే తమ అంగీకారం తెలిపారు.వారి సమక్షంలోనే మీటర్లు కూడా పెట్టారు. ఇవాళ నాణ్యమైన కరెంటును అందించడానికి, అదీ పగటిపూటే అందించడానికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంది. రూ.1700 కోట్లతో ఫీడర్లను బలోపేతం చేశాం, 10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును ప్రారంభించబోతోంది. వచ్చే 30 ఏళ్లపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర ఉచిత విద్యుత్తు, నాణ్యతతో అందించడానికి అన్నిరకాలుగా ఈచర్యలు తీసుకుంది. రైతులు పంటలసాగులో ఎక్కడా హాలిడే తీసుకోలేదు. హాలిడే తీసుకుంటున్నదల్లా చంద్రబాబు, లోకేష్‌లే. అదే మీ హయాంలో వ్యవసాయానికి పగటిపూట 9గంటల విద్యుత్‌ ఇవ్వగలిగారా?
పెదబాబు, చిన్నబాబు హాలిడే తీసుకుని జాలిడేగా హైదరాబాద్‌లో మకాం వేసి ఉంటున్నారు. రైతులకు ఏం చేశారని మీరు రైతుల కోసం కార్యక్రమం చేపట్టారో చెప్పాలి. కౌలు రైతులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంది. దేశంలో ఎక్కడైనా కౌలు రైతులకు రైతు భరోసా కల్పించిన దాఖలాలు ఉన్నాయా? రైతుల జీవన ప్రమాణలు మెరుగుపడాలనే వారికి ముఖ్యమంత్రి అన్నివిధాలా అండగా ఉంటున్నారు. దీనిపై ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. డ్రామాలు ఆడుతున్న టీడీపీ నేతలు ఇందుకు రెడీగా ఉన్నారా? గడిచిన రెండేళ్లలో లక్ష హెక్టార్లకు డ్రిప్‌ ద్వారా నీరు అందిస్తున్నాం. మరి మీరేం చేశారో చెప్పగలరా? అందుకే 2019 ఎన్నికల్లో రైతాంగం మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో.. అక్కడ పెట్టి తొక్కేశారు.
2014-19 మధ్య ఇచ్చిన ట్రాక్టర్లు తెలుగు తమ్ముళ్లకు ఇచ్చారు. వ్యవసాయానికి కాకుండా ఇసుక దందా చేయడానికే ఈ ట్రాక్టర్లు ఉపయోగపడ్డాయి. అది ఓ పెద్ద స్కామ్‌… రైతుకేమో స్కీమ్‌ అని చెబుతూ మభ్యపెట్టారు. ఇసుక దందా చేసి భూగర్బ గనులు పిండేసి, నదుల్లో ఇసుకను పిండేశారు. రైతులకు మేలు చేయాలనే ఆర్బీకే ల పరిధిలో దాదాపు రూ.15 లక్షల విలువైన యంత్రాలను 40శాతం సబ్సిడీతో అందుబాటులోకి తీసుకువస్తున్నాం. క్లస్టర్‌ స్థాయిల్లో కూడా హార్వెస్టర్‌లాంటి కొత్త యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఆక్వా రైతులకు ఈప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం చేయలేదు. రెండేళ్లలో రూ.1560 కోట్ల విద్యుత్తు సబ్సిడీ ఇచ్చాం.
టీడీపీ హయాంలో పొగాకు అంటే చిరాకుగా ఉండేది. అదే వైయస్సార్‌ సీపీ ప్రభుత్వ హయంలో చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా కనీస గిట్టుబాటు ధరను ప్రకటించి కొనుగోలు చేసింది, పొగాకు రైతులకు భరోసా ఇచ్చిందీ ఏపీ ప్రభుత్వమే. కరోనా సమయంలో కూడా మొక్కజొన్న, పసుపు పంటలను కొనుగోలు చేసింది.
రూ. 87వేల కోట్లు రుణమాఫీ అని చెప్పి, అయిదేళ్లపాటు హ్యాపీగా అధికారంలో ఉండి రైతులకు బీపీ తెప్పించి, చివరికి దిగిపోయేటప్పుడు చంద్రబాబు రైతులకు కుచ్చు టోపీ పెట్టారు. రైతు సంక్షేమం కోసం మీరు ఏం చేశారో చెప్పాలి? అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు భరోసా కింద ఏటా రూ. 13,500 అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.
కరువుసీమ రాయలసీమలో ఇవాళ పండుతున్నట్లు గతంలో ఎప్పుడైనా పంటలు పండాయా? రైతు సంక్షేమం కోసం గ్రామాల స్థాయిలో 11వేల మంది విలేజ్‌ అసిస్టెంట్లను మేం పెట్టాం. ఇంత స్థాయిలో ఎప్పుడైనా మీరు పెట్టగలిగారా? సీమ రైతులకు వేరుశెనగ విత్తనాలు కొరత లేకుండా ఎప్పుడైనా ఇవ్వగలిగారా? ఆర్బీకే అనేది దేశంలో ఎక్కడా లేదు. పంట వివరాలపై ముందుగానే ఒక క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం. ఎప్పుడైనా టీడీపీ హయాంలో అది జరిగిందా?. అగ్రి ఇన్‌ఫ్రా మీద దాదాపు రూ.14వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గోడౌన్ల నుంచి ప్రైమరీ ఫుడ్‌ ప్రాససింగ్‌నుంచి అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నాం.
మరి మీరు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క అంశాన్ని అయినా మీ ప్రభుత్వ హయాంలో అమలు చేయగలిగారా? మీకు రైతు కోసం అంటూ కార్యక్రమాలు చేసే అర్హత లేదు. రాష్ట్రంలోని రైతులంతా తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాలను గుర్తించాల్సిన అవసరం ఉంది.

LEAVE A RESPONSE