Suryaa.co.in

Political News

ఎన్ని గదులు ఉన్నా…చివరికి పోయేది ఒక చిన్న గదిలోకే కదా?

రాజకీయాల్లో విలువలు దిగజారేయి అనీనూ ….రాజకీయ నాయకులు ఎక్కువమంది తమ నోటి నించి వచ్చే భాషని పరమ నీచంగా… జంకూగొంకూ లేకుండా విచ్చలవిడిగా వాడేస్తున్నారు అనీనూ..నేనేమీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .కానీ , గమనించి చూస్తే — జగన్ చేస్తున్న “కక్ష రాజకీయాలు” మాత్రం అన్ని గీతలూ దాటేసాయి అని సుస్పష్టంగా తెలుస్తూ నే ఉంది .ఈ సంగతిని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సైతం అర్ధం చేసుకుంటారనే ఆశిద్దాం ! లేకపోతే మరింతగా నష్టపోయేది ఆంధ్ర ప్రజలే కదా !జగన్ రాజకీయ రంగంలో రాణించదగ్గ పనులు ఏమీ చేయలేదు .చంద్రబాబు నాయుడిని అకస్మాత్తుగా ఎన్నికల ముందు జైలు పాలు చేయడం , కేసు మీద కేసు పెట్టడం వంటివి జగన్ కి రాజకీయంగా ఏమీ మేలు చేయలేవు .

సందేహం లేదు . “నాయుడేమన్నా దేశం వదిలి పారిపోతాడా ?”బెయిల్ ని అంతగా ఆలస్యం చేసి , ఆయన్ని ఇబ్బంది పెట్టాలని కాకపొతే !
రాజకీయాలు బేషుగ్గా చేసి ప్రజలకి మేలు చేస్తే , ఆ వ్యక్తిని అలాగే జనం గుర్తు పెట్టుకుంటారు .రాజకీయాలని కేవలం సొంత కార్పణ్యాలకి మాత్రమే వాడుకుంటే అప్పుడు సైతం ఆ వ్యక్తిని చరిత్ర లో అలాగే గుర్తు పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏమి తప్పు చేసాడో సరిగ్గా ఎవరికి తెలీదు .అర్ధం కూడా కాలేదు .

అర్ధం అయిన విషయం మాత్రం, ఎన్నికల్లో నాయుడిని తిరగకుండా చేస్తే లబ్ది పొందొచ్చును అని గాని…, జగన్ పార్టీ అనుకుంటే ..అది వాళ్ళకే బెడిసి కొడుతుంది అని .

చంద్రబాబు నాయుడి అరెస్ట్ కారణంగా అయినా జగన్ పాలన నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కలిగితే అది శుభపరిణామమే ! ఇంతాచేసి అసలు ఆంద్ర రాష్ట్ర అభివృద్ధికి, భవితకు ఏమీ చేయని జగన్ , గుజరాతీ బడా వ్యాపారస్తులకు, ఆంధ్రా సంపదని కట్టబెట్టేయడానికి, ఏమాత్రమూ వెరవని జగన్, ఎవరికి ఉపయోగపడుతున్నాడో …

ఎందుకని కేంద్రం లో ఉన్న అధికార పార్టీల వాళ్ళు జగన్ కి అండగా ఉన్నారో అంత అర్ధం కానీ రహస్యమే ఎవరికైనా ? ఇది ఒక బేతాళ ప్రశ్నరాష్ట్రం మీద , రాష్ట్ర ప్రగతి మీద ఏమాత్రమూ శ్రద్ధ లేకుండా , కేవలం కులం , ప్రాంతం ప్రాతిపదికగా రాజకీయాలు నడపడం చేస్తే అది ఆ రాజకీయ నాయకుడి పతనానికి పరాకాష్ట .

ఈ దేశంలో ఏ కులానికీ ఎప్పుడూ మెజారిటీ లేనే లేదు . అలాంటప్పుడు ఏ కులమైనా ఈ తరహా రాజకీయాలు ఎక్కువకాలం నడపలేరు . మొత్తంగా అధికార యంత్రాగం, అధికారం లో ఉన్న వాళ్లకి సాయం చేయడానికే గాని, ప్రజలకి కాదు…, అని ఒక సూచన గనక ఇలాగే బలంగా కొనసాగితే…, ప్రజలకి క్రమేపీ అన్ని వ్యవస్థల మీదా నమ్మకం పోతుంది .అది మరీ ఎక్కువ ప్రమాదం .

ఇవాళ్టి నాయకులు రేపు ఉంటారో ఊడతారో తెలీదు . కానీ వ్యవస్థలు ఉంటాయి . వ్యవస్థల్ని కాపాడుకోవడం ప్రగతికి అవసరం !అవ్యవస్థ సదా అరాచకానికే అండగా ఉంటుంది అందుకని వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి .లేనప్పుడు అది వట్టి గూండాల రాజ్యం గా మారుతుంది .ఇప్పటికే అలాంటి స్థితి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించింది .అందువలన వ్యవస్థపై ప్రజలకి నమ్మకం నిలబడాలంటే ..ఆ సదరు వ్యవస్థల లోని వ్యక్తులు, చట్టాల విషయంలో నిబద్ధత కలిగిన వారై ఉండాలి . అలా ఉన్నప్పుడే ప్రజాస్వామ్య పరిపాలన సాగుతుంది .లేకపోతే కష్టం . అరాచకం తధ్యం !

ఆంధ్ర రాష్ట్రం మరింతగా నష్టపోకుండా ఉండాలంటే , రాష్ట్ర ప్రజానీకం ముందు చూపుని , వారు తమ ఓటు వేసేటప్పుడు ప్రదర్శించాలి . చివరాఖరికి రాష్ట్రం అన్నది ప్రజలది గానీ , ముఖ్యమంత్రుల సొంత శాశ్వత చిరునామా కాదు .ఎంతగా ఊరికో ప్యాలస్ ని కట్టుకున్నా కూడా ! ఎన్ని వందల గదులు ఉన్నా …. చివరికి పోయేది ఒక చిన్న గదిలోకే కదా?

– జయప్రభ

LEAVE A RESPONSE