Suryaa.co.in

Features

ఎంత పులులైనా… కట్టు తప్పితే బోనే….!

అవి…. పచ్చి నెత్తురు తాగే క్రూర మృగాలే. అవి ఉండాల్సింది అటవీ ప్రాంతాలే! అక్కడే తిరుగుతూ…. దొరికిన వాటిని దొరికినట్టు చంపుకు తింటుంటే… ఎవరికీ అభ్యంతరం ఉండదు. అవి… పుట్టడమే క్రూర మృగాలుగా పుట్టినందున, దొరికిన వాటిని దొరికినట్టు చంపుకు తినడాన్నే ఆ మృగ లక్షణం గా భగవంతుడు నిర్దేశించి నందున… వాటిని మనుషులు తిరగని అటవీ ప్రాంతాలకు దేముడు పరిమితం చేశాడు.

వాటికి దయా డాక్షిణ్యాలు ఉండవు. పాప పుణ్యాలు తెలియవు. తమకు దొరికిన ప్రాణులను చంపి తినడమే వాటికి తెలుసు. కుక్కలు, ఎలుకలు , పిల్లులు, గుర్రాలు, గాడిదలు లాగా మనుషుల్లో ఉండడానికి అవి పనికి రావనే…. వాటిని భగవంతుడు అడవులకు పరిమితం చేశాడు.

‘ సరేలే…వాటి బతుకేదో అవి బతుకుతాయ్… మనకెందుకు? ‘ అనుకునే మనుషులు కూడా వాటి జోలికి వెళ్ళరు. కానీ , దేవుడు ఇచ్చిన ఆహారం సరిపోకో… కొత్త కొత్త రుచుల మీద మనసు పడో…. ఎన్నాళ్ళు ఈ అడవికే పరిమితమై ఉంటాం… అనుకునో… ఊళ్ల మీద పడి… జనాన్ని నోట కరిచే స్థితి కి ఆ క్రూర మృగాలు వస్తే….!

వ్యవస్థలు ఊరుకోవు. ఒడుపుగా బోనుల్లో బంధిస్తాయి. తీసుకెళ్ళి…. అటువంటి మృగ జాతులు నివసించే చోట పడేస్తాయి. బోను లో చిక్కేంత వరకే… దాని వైభోగం, రాజసం, లెవెలూ ను. ఒక్కసారి వ్యవస్థలు మేల్కొని, బోను లో వేసేసిన తరువాత…. ఎంత (చిరుత ) పులి అయినా… లెవెలు, దర్జా, రాజసం పోదామనుకుంటే కుదరదు. బోను లో నుంచి జనం వంక దీనపు చూపులు చూడాల్సిందే. మొన్న తిరుమల నడక దారిలో ఈ క్రూర మృగాలకు జరిగింది అదే.

అవి ఉండాల్సిన చోట ఉండకుండా జనం మీద పడ్డాయి. అటవీ శాఖ ఓ వ్యవస్థ. టీ టీ డీ ఓ వ్యవస్థ. ప్రజలను సంరక్షించడం వాటి విధి. వాటికీ ఓపిక నశించడం తో, పట్టుకుని బోను లో పడేశాయి. పులులం కదాని బోర విరుచుకు తిరిగితే కుదరదు అని చెప్పాయి. పులు లైనా…. పులుల్లాంటి మృగ లక్షణాలు కలిగిన వారైనా… వాటి వాటి పరిధులు దాటి జనం మీద పడతామంటే కుదరదని టీ టీ డీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.

‘ మన అడవే కదా! తినేది కూడా మనవాళ్ళను కాదు ‘ కదాని ఆయన చూసి చూడనట్టు వదిలేసి ఉంటే…! తిరుమల నడక దారి అనే కాదు. రాష్ట్రం లోని చాలా ప్రాంతాలలో ఈ క్రూర జంతువులు జనావాసాల్లో తిరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పులులు తిరగంగా లేనిది మేం తిరగ్గూడదా అనుకుంటూ ఎలుగు బంట్లు కూడా జనం లోకి వస్తున్నాయి. పులులాగా కోరలు బయట పెడుతూ బోర విరుచుకు తిరక్కుండా… తల వంచుకుని నేల చూపులు చూపులతో కొంచెం అమాయకత్వం నటిస్తూ, జనాలపై దాడి చేస్తుంటాయి.

ఇవి బాగా చిల్లర, లేకి ప్రాణులు. ఈ పూట ఎంత తిన్నాం అని తప్పితే , వీటికి ఓ హుందా తనం…., అడవి లో ఓ గౌరవం ఉండవు. వీటితో పోల్చుకుంటే…. పెద్దపులి కి హుందా తనం, పెద్దరికం బాగా ఎక్కువనే చెప్పాలి. ఎవరి మీదకు పడితే వారి మీదకు వెళ్లవు. ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినడానికి కక్కుర్తి పడవు. రాజసం ఎక్కువ.వీటితో పోల్చితే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిరుత పులులకు వినయం ఎక్కువ. బాగా చీప్. నక్కి నక్కి నడుస్తాయి. హఠాత్తుగా మీద పడి పీక పట్టుకుంటాయి.
మనమే జాగ్రత్తగా ఉండాలి.

భోగాది వేంకట రాయుడు
bhogadirayudu2152@gmail. com

LEAVE A RESPONSE