Suryaa.co.in

Telangana

పేదల సంక్షేమం కోసం కేసిఆర్ కంటే గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరు

-వృద్దులకు పెద్ద కొడుకుగా,ఒంటరి మహిళకు అన్నగా,ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా ఆసరైతున్నడు
-తెల్లారితే కేసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే బిజెపి,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేదల కోసం చేసేది ఏమీ లేదు
-ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇస్తున్న పెన్షన్ 750, ఉత్తర ప్రదేశ్ లో 500 మాత్రమే ఇస్తున్నరు
-గుజరాత్ లో పెన్షన్ల కోసం నెలకు 100 కోట్లు ఖర్చు చేస్తుంటే…కేసిఆర్ తెలంగాణలో 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు
– సంక్షేమ దినోత్సవ సంబురాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లబ్దిదారులతో జరిగిన సంక్షేమ సంబురాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబురాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి డప్పు చప్పుళ్లతో, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఘన స్వాగతం పలికారు. సమావేశంలో పలువురు వృద్ధులను,మహిళలను సంక్షేమ పథకాల లబ్దిదారులను ఆత్మీయంగా పలకరించారు. బాల్కొండ నియోజకవర్గంలో అందుతున్న సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్లు,కళ్యాణ లక్ష్మి,గొర్రెల పంపిణీ తదితర పథకాల కర పత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పలువురు కళ్యాణ లక్ష్మి లబ్ది దారులకు చెక్కులు పంపిణీ చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కుల వృత్తులకు నేటి నుంచి కొత్త పథకం ప్రారంభం
బిసి కుల వృత్తుల కుటుంబాలకు కేసిఆర్ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం కార్యక్రమం నేటితో ప్రారంభం అయ్యింది.అవుసుల,వడ్రంగి,చాకలి,ఆరే కటిక కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఐదుగురికి చెక్కులు అందజేశారు. కేసిఆర్ ప్రభుత్వం కుల వృత్తులకు భరోసా కల్పించేందుకు ఆర్ధికంగా తోడ్పాటు అందించే కార్యక్రమం నేడు శ్రీకారం చుట్టుకున్నమని మంత్రి వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఈ ఏడాది 1000 మందికి, రానున్న రోజుల్లో మిగతా కుల వృత్తుల అర్హులైన లబ్ధిదారులకు 1లక్ష రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పారు.

పేదల సంక్షేమం కోసం కేసిఆర్ కంటే గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు. వృద్దులకు పెద్ద కొడుకుగా,ఒంటరి మహిళకు అన్నగా,ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా,కేసిఆర్ కిట్ తో అన్ని వర్గాల వారికి ఆసరైతున్నడు అని వివరించారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 62వేల మందికి 910 కోట్ల పెన్షన్లు ఇచ్చామని,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25వేల మందికి 58 లక్షలు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు.

అప్పుడు కేవలం వృద్దులకు,భర్త చనిపోయిన వారికి, దివ్యంగులకు మాత్రమే 200 రూ.చొప్పున ఇచ్చేవారని కానీ కేసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్దులకు,ఒంటరి మహిళ,వితంతు,బీడీ కార్మికులు, కల్లు గీత కార్మికులు,చేనేత కార్మికులు,బోదకాలు,డయాలసిస్ వ్యాధి గ్రస్తులకు నెలకు 2వేలు.. దివ్యాంగులకు 3వేలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. మోర్తాడ్ సభలో కేసిఆర్ చేత బీడీ కార్మికులకు పెన్షన్ అనౌన్స్ చేసారని,తాను అప్పటి ఎంపి ప్రస్తుత ఎమ్మెల్సి కవితమ్మ తో కలిసి బీడీ కార్మికుల కోసం పుట్టించిన కార్యక్రమం అని వివరించారు.

అట్లాగే కళ్యాణ లక్ష్మి కోసం బాల్కొండ నియోజకవర్గంలో 10వేల మందికి 91 కోట్లు ఇచ్చామని తెలిపారు. 5వేల మందికి 12,13వేల చొప్పున కేసిఆర్ కిట్ అందజేశామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్య ఖర్చులు నిమిత్తం 8వేల మందికి 38 కోట్లు ఇచ్చామన్నారు. 35 కోట్ల విలువైన గొర్రెల యూనిట్ల ను పంపిణీ చేశామని వివరించారు.

బాల్కొండ నియోజకవర్గంలో 7 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 3,520 మంది పిల్లలు చదువుతున్నారని అందులో ఒక్కో విద్యార్థికి 1లక్ష 25 వేల రూపాయలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య,పౌష్ఠిక ఆహారం అందిస్తున్నమని తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వడం వల్ల ఎండ కాలంలో ఉండే నీటి బిందల గొడవలు నేడు లేవన్నారు. తెల్లారితే కేసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే బిజెపి,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేదల కోసం చేసేది ఏమీ లేదని విమర్శించారు.

వాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతే గోస పడతమన్నరు. వాళ్లు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలు ఏమీ లేవని వారిని ఎందుకు నమ్మాలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇస్తున్న పెన్షన్ 750, ఉత్తర ప్రదేశ్ లో 500 మాత్రమే ఇస్తున్నరుబీహార్ లో 600 ఇస్తున్నారని వివరించారు. గుజరాత్ లో పెన్షన్ల కోసం నెలకు 100 కోట్లు ఖర్చు చేస్తుంటే…కేసిఆర్ తెలంగాణలో 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. పేదల సంక్షేమం కోసం నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందనీ, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని తేల్చి చెప్పారు.

దేవుడి పేరు మీద,దేశం పేరు మీద యువకులను,మహిళల్ని మభ్యపెట్టే పనులకు పూనుకున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన సాంప్రదాయంలో భాగంగా ఎప్పటినుంచో బొట్టు పెట్టుకుంటున్నం, దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాం, సత్య నారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామని ఎవరో వచ్చి ఇప్పుడే కొత్తగా చేస్తున్నట్టు చెప్తే నమ్మొద్దని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బాల్కొండ నియోజకవర్గ మహిళలే తనకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారని మహిళల ఆశీర్వాదం అట్లాగే కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ పథకాల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE