Suryaa.co.in

Andhra Pradesh

సోషల్ మీడియా పోస్టులలో వ్యక్తిగత దూషణలు వద్దు..సెటైరికల్ గా పోస్టులు ఉండాలి

-2024లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారం
-సోషల్ మీడియా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు.. వారికి తగిన గుర్తింపు ఇస్తాం-జులై 8 వతేదీన పార్టీ ప్లీనరీ
-పార్టీ కార్యాలయంలో హెల్ప్ లైన్
-సోషల్ మీడియా కార్యకర్తల సేవలను మరింతగా వినియోగించుకుంటాం
-సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తాం-పార్టీ సమావేశాలలో వారిని తప్పనిసరిగా ఆహ్వానించేలా ఆదేశాలు ఇస్తాం
– సభ్యత్వ నమోదు ఇతర రాజకీయపక్షాలన్నింటికంటే అత్యధికంగా జరగాలి
– సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో సమావేశమైన పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్,రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా కార్యకర్తల పాత్ర కీలకమైనదని, వారికి తగిన విధంగా గుర్తింపు ఇచ్చి ప్రోత్సహిస్తామని పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్,రాజ్యసభసభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల
vijayasai-so1సమావేశం జరిగింది. సమావేశంలో విజయసాయిరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.సోషల్ మీడియా కార్యకర్తలతో దాదాపు మూడు గంటలపాటు సమావేశమై వారి అభిప్రాయాలను సావధానంగా విన్నారు.

“తాము ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో అంకితభావంతో పనిచేశామని, కోఆర్డినేటర్లందరికి తగిన విధంగా గుర్తింపు ఇవ్వాలని” వారు కోరారు. దాదాపు 31 మంది నియోజకవర్గ కోఆర్డినేటర్లు వివిధ అంశాలపై లేవనెత్తిన పలు సమస్యలను స్వయంగా విజయసాయిరెడ్డి నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత వాటన్నింటికి సమాధానాలు ఇచ్చారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తనకు ఆదేశాలు ఇచ్చారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలు ఏ విధంగా పార్టీకి సేవకులో తాను కూడా అదేవిధంగా పార్టీకి సేవకుడ్నేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాకు సంబందించి నామినేటెడ్
vijayasai-so పోస్టులలో కొంతమందిని తీసుకోవడం జరిగిందన్నారు. వారికి తగిన గుర్తింపు ఇచ్చి వారి సేవలను మరింత విస్తృత స్దాయిలో వినియోగించుకుంటామని వివరించారు.

రాష్ట్రంలో 26 జిల్లాలు చేసుకోబోతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ని మండలాలు, నగరాలలోని డివిజన్లు,వార్డులు అన్నీ ఉంటాయి. ప్రతి మండలానికి ప్రతి వార్డుకు,ప్రతి పార్లమెంట్ జిల్లాకు సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ ను తీసుకోవాలని నిర్ణయించామన్నారు.

ఇదే గాక ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రైవేటు రంగంలోని పలు ఐటి,ఆటోమోబైల్,ఫార్మా,ఈ కామర్స్ తదితర కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ర్టంలోని మూడు ప్రాంతాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జోన్ లో కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు అనంతపురం లకు సంబంధించి ఏప్రిల్ 2,3 తేదీలలో తిరుపతిలోను, విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం,తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి విశాఖలో ఏప్రిల్ 16,17 తేదీలలో, కృష్ణా,గుంటూరు,ప్రకాశం,వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి తాడేపల్లిలో ఏప్రిల్ 30,మే ఒకటో తేదీన జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

ఈ జాబ్ మేళాల ద్వారా దాదాపు 15 వేల నుంచి 20వేలమంది వరకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హతలున్నవారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాబోతుంది. మన పార్టీ స్టాండ్ అదే. అక్కడ ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి ప్రతి కార్పోరేషన్ కు 500 గజాల నుంచి వేయి గజాల వరకు స్దలం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయించారన్నారు. మౌళికసదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.తగిన నిధులు ఆయా కార్పోరేషన్లకు కేటాయిస్తారన్నారు.

సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చురుకుగా వ్యవహరించి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అన్యాయాలను,చంద్రబాబు దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి పార్టీని ప్రజలకు చేరువ చేశారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు అడిగిన విధంగా వారికి ప్రత్యేకంగా యాప్ ను రూపొందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా అయితే సభ్యత్వ కార్డులు ఉంటాయో,వారికి సైతం అదే సభ్యత్వ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

జులై 8 వతేదీన పార్టీ ప్లీనరీ
జులై 8 వతేదీన పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుపుకుంటున్నాం. ఆ తర్వాత అధ్యక్షుడి ఆదేశాలమేరకు పార్టీకి సంబంధించిన రాష్ట్ర,జిల్లా,గ్రామస్దాయి కమిటీల వరకు పునర్ నిర్మాణం జరుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు గతంలో ప్రతిపక్షంలో ఉండగా సాధారణ స్థాయిలో జరిగిందని,ఇప్పుడు ఇతర రాజకీయపక్షాల కంటే అత్యధికస్ధాయిలో సభ్యత్వ నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. కార్యకర్తలు ప్రస్తావించిన విధంగా సభ్యత్వం తీసుకున్నవారికి ఇన్సూరెన్స్ అనేది పార్టీ అధ్యక్షునితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియచేశారు.

సభ్యత్వ నమోదు తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు జిల్లా కమిటీలకు,ఎంఎల్ఏ లకు,స్దానిక నాయకత్వాలకు పంపిస్తామని,ప్రోటోకాల్ ప్రకారం ఏ సమావేశాలు జరిగినా వారిని తప్పనిసరిగా పిలిచేవిధంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.జిల్లాలవారీగా సోషల్
vijasai-so3 మీడియా కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేశారు. ఇదే సమయంలో కార్యకర్తలు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించి పార్టీని విజయానికి చేరువచేయాలనేది తమ ఉధ్దేశ్యం అన్నారు.

పోస్టింగ్ లు పెడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వారు బెదిరిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే మీపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. వారందరికి ఒకటే చెబుతున్నాను…2024లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రానుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎస్సిఎస్టి,బిసి,మైనారిటీలకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు.

పార్టీలకు,కుల,మతాలు,ప్రాంతాలకు అతీతంగా వారికి పథకాలు అందిస్తున్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం న్యాయం చేశారు. అనేక ప్రయోజనాలు చేకూర్చారు.ఇవన్నీ కూడా మన పార్టీని మరో 30 సంవత్సరాలు అధికారంలో ఉండేలా చేస్తాయి. అపనమ్మకం ఏమాత్రం అవసరం లేదు. వ్యక్తిగత దూషణలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చంద్రబాబు,లోకేష్ లను గాని,తెలుగుదేశం పార్టీ నేతలను కాని సెటైరికల్ గా విమర్శలు చేయవచ్చని అన్నారు. అలా పోస్టింగ్స్ పెట్టినప్పుడు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.కేసులు సైతం పెట్టలేరన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలే కాని ఎగ్జిక్యూటివ్స్ ను గాని,జ్యూడిషయరీని కాని టచ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాంటప్పుడు మనపై ఎవ్వరూ కూడా కేసులు పెట్టే అవకాశం లేదన్నారు.

రాజకీయాలకు సంబంధించి మాత్రమే పరమితమైతే సరిపోతుందన్నారు. గతంలో మన సోషల్ మీడియాకార్యకర్తలపై ఏవైతే కేసులు ఉన్నాయో వాటిపై తగిన విధంగా స్పందించడం జరుగుతుందన్నారు.ప్రజాస్వామ్యపద్దతిలోనే మన పోరాటం సాగుతుందన్నారు. వ్యక్తిగత దూషణలు అవసరం లేదన్నారు. ఇకపై కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తానని వివరించారు.

పార్టీ కార్యాలయంలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా వారికి అందించడం జరుగుతుందన్నారు. పార్టీని నమ్ముకుని మనల్ని గెలిపించిన వారికి మేలు చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలనేది తన ఉధ్దేశ్యం అన్నారు.గ్రీవెన్స్ సెల్ కూడా తగిన విధంగా ఎఫెక్టివ్ గా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు లేేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీకోసం విజయసాయిరెడ్డి ఎంతో తపన,తాపత్రయపడుతుంటారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆలస్యం జరుగుతుందేమో కాని తప్పనిసరిగా గుర్తింపు లభించి తీరుతుందని అన్నారు. పార్టీ లో ఎవరికీ అన్యాయం జరగదని ప్రతి సోషల్ మీడియా కార్యకర్త ఈ అంశాన్ని గుర్తించాలన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొెందించారన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందనే అంశం గుర్తుంచుకోవాలన్నారు.సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. సమావేశంలో శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE