ఈవీఎంల అక్రమ తరలింపు..వారణాసి ఏడీఎంపై చర్యలకు ఈసీ ఆదేశం!

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. వారాణాసి ఏడీఎంపై చర్యలకు ఆదేశించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో)ని ఆదేశించింది. ఈవీఎంల రవాణాలో నిబంధనలు ఉల్లంఘించిన వారణాసి ఏడీఎం ఎన్‌కే సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొనట్టు ఆ వర్గాలు తెలిపాయి.

అఖిలేశ్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) ఈవీఎంలను తరలించారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. ఈవీఎంలను తరలించేది ఇలానా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మన ఓట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని, అంతకంటే ముందు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు.

ఈవీఎంలను ఓ ట్రక్కులో తరలిస్తున్న వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన అనంతరం అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, వారణాసి కమిషనర్
evm మీడియాతో మాట్లాడిన వీడియోను ఈ ఉదయం సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.అందులో ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంల తరలింపులో లోపం ఉందని అంగీకరించారు. దీంతో అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలకు బలం చేకూరింది. ఇప్పుడు ఎన్నికల సంఘం వారణాసి ఏడీఎంపై చర్యలకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.