మంగళగిరి: కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైకాపా గ్రామ సింహాల ఘోంకారాలు సహజం.. జనసైనికుల సింహ గర్జనలు సహజం అని వ్యాఖ్యానించారు.
‘ఘోంకారం అంటే మొరుగుట.. గ్రామ సింహాలంటే కుక్కలు. గ్రామ సింహాలు అంటే పళ్లు రాలగొట్టించుకునే కుక్కలు’ అని పవన్ వివరించారు. ‘‘భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతా. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా. వైకాపా అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైకాపా వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైకాపా నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా’’ అని అన్నారు.
ఎలా కావాలంటే అలా యుద్ధం చేస్తాం
‘‘ వైకాపా నేతలకు ఏ పద్ధతిలో కావాలంటే అలా యుద్ధం చేస్తాం. 2014లో తెదేపా, భాజపాకు కూడా అభివృద్ధి కోసమే మద్దతిచ్చా. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే అడుగుతా. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది. ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చా. రాజకీయాల్లో కలుపు మొక్కలను తీసేయగలను. నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాలి. ఏపీ ప్రభుత్వం నెలకు రూ.5000 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తుంది. రూ.500కే ప్రెసిడెంట్ మెడల్, మద్యం అమ్ముతున్నారు.
నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెత వైకాపా ప్రభుత్వం నిజం చేస్తుంది. నన్ను తిడితే ఏడుస్తానని వైకాపా నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను. నేను బలహీనపడక పోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను, నన్ను లాగితే వదలను. అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదు. ఏపీలో రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ప్రజలు నావారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నాను. కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.