Home » ఎవరి అహంకారం ?.. ఎవరి ఆత్మగౌరవం??

ఎవరి అహంకారం ?.. ఎవరి ఆత్మగౌరవం??

( ఎస్.కె. జకీర్, సీనియర్ జర్నలిస్టు)
”భోజనాల కోసం,మద్యం కోసం ప్రజలు TRS సమావేశాలకు వెళుతున్నారంటూ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు.ఇది పూర్తిగా దిగజారిన వైఖరి. ఆరు సార్లు నిన్ను గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను అవమానపర్చేలా మాట్లాడుతున్న రాజేందర్ కు మీరే తగిన గుణపాఠం చెప్పాలి.చిత్తు చిత్తుగా ఓడించాలి” అని మంత్రి హరీశ్ రావు హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో పలు చోట్ల వ్యాఖ్యానించారు. ”హుజూరాబాద్ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టారు.హుజురాబాద్ లో రాజకీయ వ్యవస్థ ఒకప్పుడు పచ్చటి సంసారంలాగా ఉండేది.ఐదు నెలలుగా హుజురాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
రకరకాల ప్రలోభాల పేరుతో హుజురాబాద్ ప్రజలు అసహ్యించుకునేలా చేసారు.ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఐదు నెలలుగా వాళ్లు బయపడకుండా నాకు ప్రజలు అండగా ఉన్నారు.5 నెలలుగా TRS నాయకుల హింసను ప్రజలు అనుభవించారు. ఏ ఇంటికి ఆ ఇంట్లో హీరోలు తయారుకావాలి. ఎన్నికల కదనరంగాన్ని నడపాలి.ఇది కెసిఆర్ అహంకారానికి, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక.సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూలు వచ్చింది.నేను మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చిన దాదాపు 5 నెలల నుంచి సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో హరీశ్ రావు, అరడజను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గొర్రెల మందల మీద తోడేళ్లలాగా పడ్డారు.యావత్ తెలంగాణ ఈటల గెలుపు కోసం చూస్తున్నారు. గ్రామాలను దావత్ లకు అడ్డాలుగా మార్చారు. స్వయంగా మంత్రులే టేబుల్స్ వేసి దావత్ లకు నాయకత్వం వహించే నీచానికి దిగారు.18 ఏళ్లపాటు నేను చేసిన సేవకు నాకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది.అక్టోబరు 30 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాహుటా ఎగురవేసే రోజు. దొంగఓట్ల నమోదుకు కూడా ప్రయత్నిస్తున్నా.ఇతర చోట్ల చెల్లినట్లుగా మీ కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ చెల్లవు.కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో బెదిరించే ప్రయత్నం చేస్తే మీకు హుజురాబాద్ ప్రజల చేతిలో శిక్ష తప్పదు” అని ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన కొన్ని గంటల్లోనే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు.
ఐదు నెలలుగా TRS నాయకులు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్ని,తన మద్దతుదారులను, అభిమానులను హింసించారని ఈటల చెబుతున్న మాటల్లో నిజమెంత? పచ్చని సంసారంగా ఉన్న హుజురాబాద్ ను సర్వనాశనం చేశారంటున్న ఆరోపణలు నిజమేనా?
కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం ఎట్లా అవుతుంది? హుజురాబాద్ ఉపఎన్నికకు కారణమెవరు? ఈ ఎన్నికను ప్రజలు కోరుకున్నవి కావు.ఈటల రాజేందర్ రాజీనామా వల్ల వచ్చినందున ఆయన బలవంతంగా రుద్దిన ఎన్నికలు కావా? ”మరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారు.బీజేపీ అధికారంలోకి రాదు.ఈటల మంత్రి కారు” అని మంత్రి హరీశ్ రావు అన్న వ్యాఖ్యలకు ఈటల దగ్గర ఉన్న జవాబు ఏమిటి?
శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహిస్తారన్న సంగతి తెలిసి కూడా తాను రాజీనామా చేసిన మరుసటి రోజే ఎన్నికలు జరపాలన్న ధోరణిలో ఈటల రాజేందర్ వ్యవహారశైలి కనిపిస్తూ వచ్చింది.మంగళవారం విలేకరుల సమావేశంలోనూ ‘సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది’ అని ఈటల అన్నారు.సుదీర్ఘ నిరీక్షణ ఏమిటి? ఈటలతో సంబంధాలు పూర్తిగా చెడిపోయింతర్వాత ఆయనను రెచ్చగొట్టే వ్యూహంలో భాగంగా TRS నాయకులు ‘రాజీనామా సవాలు’ చేసి ఉండవచ్చు.ఆ మాయలో,ఆ ఉచ్చులో పడి రాజీనామా చేయాలని ఆయన గొంతుపై కత్తి పెట్టిందెవరు? శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం,బీజేపీలో చేరిపోవడం అన్నీ యుద్ధ ప్రాతిపదికన ఆయన తీసుకున్న స్వీయ నిర్ణయాలు కాదా? శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కేసీఆర్ తో తలపడాలని తీన్మార్ మల్లన్న వంటి కొందరు వ్యక్తులు రెచ్చగొట్టి ఉండవచ్చు.కానీ ఆయనను రాజీనామా చేయరాదని కేసీఆర్ ట్రాప్ లో పడరాదని కరీంనగర్ జడ్ పీ.మాజీ చైర్మన్ తుల ఉమ సహా కొందరు దళిత మేధావులు,పూర్వాశ్రమంలో CPIML జనశక్తిలో పని చేసిన వారు సైతం సలహా ఇచ్చారు.కానీ ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్లనో,తనపై తనకు అతి విశ్వాసం వల్లనో ఈటల రాజేందర్ రాజీనామా చేసి కయ్యానికి సై అన్నారు.ఇందులో ఎవరి ఒత్తిళ్లు ఉన్నట్టు?
దళిత రాజకీయం చుట్టూ హుజూరాబాద్‌ చుట్టూ పరిశభ్రమిస్తున్న మాట నిజం. అధికార పార్టీ దళితబంధును తెరమీదకు తెచ్చింది. అ క్కడ దళితుల జనాభా 50 వేల పైనే ఉన్నది. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి, ఇందులో హుజురాబాద్ మండలంలో 5,323, కమలాపూర్ మండలంలో 4,346, వీణవంక మండలంలో 3,678, జమ్మికుంట మండలంలో 4,996 , ఇల్లంతకుంట మండలంలో 2,586 కుటుంబాలు ఉన్నాయి. BSP పోటీ చేసేదీ లేనిదీ ఇంకా స్పష్టత లేదు. ప్రవీణ్‌ కుమార్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.BSP రంగంలో ఉంటే రాజకీయ సమీకరణాల్లో,పార్టీల బలాబలాల్లో మార్పు ఎలా వుంటుందో? .టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే తేలిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ది ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్‌ అయింది.కాగా హుజురాబాద్ లో తనను ఓడించే దమ్ము ఎవరికీ లేదన్నది ఈటెల రాజేందర్‌ ధీమా. ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా హుజురాబాద్‌లో గెలుపు తనదే అని ఆయన అంటున్నారు.ఈ ఉపఎన్నిక ఫలితం పట్ల తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠ నెలకొందంటూ ఈటల పలు మార్లు చెప్పారు.తనకూ,ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య జరుగుతున్న ‘ధర్మయుద్ధం’ గ్గా కూడా అభివర్ణించారు.కేసీఆర్ కు తానే పోటీదారు అని ఆయన నమ్మకం.అందువల్ల కేసీఆర్‌ నియంతృత్వం, అహంకారం, రాచరికపు పోకడలు హుజూరాబాద్‌లో ఓడిపోతాయని ఈటల చెబుతున్నారు.
ఈటల అనుచరుల ‘నెట్ వర్క్’ ను మంత్రి హరీశ్ రావు చావు దెబ్బ తీశారు. ఆయన మద్దతుదారులంతా ఒక్కొక్కరుగా ‘సొంత గూటికి’ చేరుకోవడంతో రాజేందర్ భగభగ మండిపోతున్నారు. కొందరు న్నాయకులు కాషాయ పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోతున్నారు. బీజేపీ భావజాలంతో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని వారే స్వయంగా చెప్పారు.వారు తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. హుజూరాబాద్ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని కొందరు అలాంటి అవకాశాలు లేవని మరికొందరు అంటున్నారు. ”గెలిస్తే కేంద్రంలో అధికారం వస్తుందా ఓడి పోతే రాష్ట్రంలో అధికారం పోతుందా”? అని కేటీఆర్ తేల్చేశారు.”ఇది చాలా చిన్న ఎన్నిక.లోకల్ వాళ్ళు చూసుకుంటారు” అని మరో సందర్భంలో అన్నారు.కేటీఆర్ మాటలు నిజమే అయితే ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందాలు,ఎమ్మెల్యేలు,ఇతర నాయకులు ,పార్టీ బలగాలు… యుద్ధానికి మోహరించినట్టుగా మోహరించవలసిన అవసరం ఏమిటి? కనుక పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కొన్న్ని విషయాల్లో,కొన్ని సందర్భాల్లో ‘సంయమనం’ తో,నేర్పుగా మాట్లాడడం అలవరచుకోవాలని, తండ్రి దగ్గర ఇంకా శిక్షణ అవసరమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హుజూరాబాద్ లో హరీష్ రావు కాలికి బలపం కట్టుకొని ప్రతీ ఇంటికి తిరిగి ప్రచారం చేస్తుంటే , హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేనట్టు మాట్లాడడం వల్ల కేటీఆర్ ప్రతిష్టకే భంగమనే వ్యాఖ్యలు కూడా పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నవి. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా హరీష్ రావు మాత్రం ప్రతి రోజు హుజురాబాద్ లో ప్రతిరోజూ కులసంఘాలతో, అలాగే ప్రజలతో సభలు, సమావేశలు పెట్టి ప్రచారం మొత్తం తన భుజాలపైన వేసుకొని ప్రచారం చేస్తున్నాడు.హుజూరాబాద్ లో ‘భీకర సమరం’ జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నవి.ఈటల రాజకీయ భవిష్యత్తుతో ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నవి.

Leave a Reply