– తెలంగాణ టీడీపీ కమిటీలో నందమూరి కుటుంబానికి అవమానం
– నందమూరి సుహాసినికి కొత్త కమిటీలో దొరకని చోటు
– గత కమిటీలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన సుహాసిని
– అన్న కుటుంబానికి అవమానంపై అన్న అభిమానుల ఆగ్రహం
– కాసానిపై కస్సుమంటున్న అన్న అభిమానులు
– మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనకూ మొండిచేయి
– అట్లూరి సుబ్బారావుకూ తప్పని నిరాశ
– జాబితాను జాతీయ నాయకత్వం ఆమోదించిందా? లేదా?
– ఆమోదిస్తే సుహాసిని పేరు లేకపోవడాన్ని గమనించలేదా?
– ఆమోదించకపోతే అది కాసాని సొంత జాబితానా?
– ‘కమ్మ కోటా’ పెట్టారంటూ సీనియర్ల ఫైర్
– ఎన్నికల్లో తాము అక్కర్లేదా అని ఆగ్రహం
– ఖమ్మం తమ్ముళ్ల కన్నెర్ర
– తెలంగాణ కమ్మవర్గానిదీ అదే బాట
– తమపై కథనాలు రాయిస్తున్నారని కమ్మవర్గం ఆగ్రహం
– సీనియర్ నేత సామా భూపాల్రెడ్డికీ దక్కని చోటు
– పలువురు మహిళా నేతలకు స్థానం దక్కని వివాదం
– కాసాని ఏకపక్ష నిర్ణయాలపై టీడీపీలో అసంతృప్తి
– చాలాకాలం నుంచి పార్టీ ఆఫీసు గడప తొక్కని సీనియర్లు
– పార్టీని కాసానికి అప్పగించినందుకు సీనియర్ల అలక
– తమను వ్యూహం ప్రకారం తొలగిస్తున్నారని సీనియర్ల ఆగ్రహం
– తెలంగాణ ఇన్చార్జి కంభంపాటికి తెలియకుండానే కమిటీని ప్రకటించారన్న ప్రచారం
– చంద్రబాబు నాయుడు మౌనంపై సీనియర్ల అసంతృప్తి
– తెలంగాణ తెలుగుదేశంలో కమిటీల కిరికిరి
( మార్తి సుబ్రహ్మణ్యం-హైదరాబాద్)
తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర విభాగంలో కమిటీల కిరికిరి .. చివరకు నందమూరి కుటుంబానికి అవమానం మిగిల్చింది. అది పరోక్షంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకూ ఇరకాటంగా పరిణమించింది. నందమూరి కుటుంబానికి కొత్త కమిటీలో స్థానం దక్కని వైనంపై, అన్న అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమోదంతోనే కమిటీలు వేశారన్న ప్రచారం.. అటు వ్యక్తిగతంగా పార్టీ అధినేతకూ సంకటంలా మారింది. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, నంద మూరి సుహాసినికి కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని, తెలంగాణ టీడీపీ కమిటీలో స్థానం దక్కకపోవడాన్ని ఎన్టీఆర్ అభిమానులు అవమానంగా భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి.. టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎన్టీఆర్ మనుమరాలు నందమూరి సుహాసినికి, తెలంగాణ టీడీపీ కొత్త కమిటీలో మొండిచేయి చూపించడం వివాదాస్పదంగా మారింది. దీనిని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది పార్టీ అధినేతచంద్రబాబునాయుడుకు తెలిసి తీసుకున్న నిర్ణయమా? తెలియక తీసుకున్న నిర్ణయమా? ఒకవేళ తెలియకుండా నిర్ణయం తీసుకుంటే, జాబితాను జాతీయ నాయకత్వం ఏవిధంగా ఆమోదించింది? అదీకాకపోతే.. జాతీయ నాయకత్వం ఆమోదం ప్రకారమే, నందమూరి సుహాసినికి కమిటీలో స్థానం కల్పించలేదా? అని ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నాస్ర్తాలు సంధిస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వకపోతే, ఎన్టీఆర్ అభిమానుల ఆత్మాభిమానం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా.. గత రెండు నెలల వరకూ పనిచేసిన ఎన్టీఆర్ మనుమరాలు, నందమూరి హరికృష్ణ కుమార్తె, నందుమూరి సుహాసినికి కొత్త కమిటీలో చోటు లేకపోవడంపై, తెలుగుమహిళలు మండిపడుతున్నారు. ఇది అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సొంతగా తయారుచేసిన జాబితానా? లేక జాతీయ
నాయకత్వం ఆమోదించిన జాబితానా ? తెలంగాణ ఇన్చార్జి కంభంపాటి రామ్మోహన్‌తో చర్చించిన తర్వాత విడుదల చేసిన జాబితానా? అసలు ఇందులో తెలంగాణ ఇన్చార్జి పాత్ర ఏమిటన్న దానిపై, స్పష్టత ఇవ్వాలని తెలుగుమహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మనుమరాలయినప్పటికీ.. సుహాసిని క్రమం తప్పకుండా పార్టీ ఆఫీసుకువచ్చి, కార్యక్రమాల్లో పాల్గొనేవారని తెలుగుమహిళా నేతలు గుర్తుచేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన నందమూరి సుహాసినికే న్యాయం జరగకపోతే, ఇక తమలాంటి వారి పరిస్థితి ఏమిటని మహిళా నేతలు వాపోతున్నారు.
ఇక మాజీ ఎమ్మెల్యే, గత రెండు నెలల వరకూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కాట్రగడ్డ ప్రసూన, పాత కమిటీలో ఉన్న అట్లూరి సుబ్బారావుకు సైతం, మొండిచేయి చూపడంపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లు పాతవారిని ఒక వ్యూహం ప్రకారం బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబుతో నేరుగా మాట్లాడే స్థాయి నేతలెవరినీ, కొత్త కమిటీలో ఉంచకూడదన్న పాలిసీ పెట్టుకున్నట్లు కనిపిస్తోందని సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోగా, మిగిలిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్శింహులు, కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్యలు మాత్రమే మిగిలారు. వీరిలో ముగ్గురికి పదవులిచ్చారు. అయితే పార్టీ స్థాపనలో ఉండి, తొలి ఎమ్మెల్యేగా పనిచేసిన కాట్రగడ్డ ప్రసూనను మాత్రం విస్మరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇక అదేవిధంగా కాసాని పార్టీ ప్రవేశంలో, కీలకపాత్ర పోషించిన అట్లూరి సుబ్బారావును కూడా పక్కనపెట్టడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే కమ్మవారికి ఎక్కువ పదవులిస్తే, పార్టీపై ‘కమ్మ-ఆంధ్రా’ ముద్ర పడుతుందన్న కారణంగానే.. నందమూరి సుహాసిని సహా, కమ్మ నేతలకు పదవులివ్వలేదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై కమ్మ వర్గం మండిపడుతోంది. తెలంగాణలో 36 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే కమ్మ వర్గం మద్దతు, పార్టీకి వద్దనుకుంటే ఆ విషయాన్ని తెలంగాణ తెలుగుదేశం నాయకత్వం బహిరంగంగా ప్రకటిస్తే, మా దారి మేం చూసుకుంటామని కమ్మ వర్గం స్పష్టం చేయడం గమనార్హం.
ప్రధానంగా నందమూరి సుహాసినికి కమిటీలో స్థానం కల్పించకపోవడంపై, ఖమ్మం జిల్లాకు చెందిన కమ్మవర్గం కన్నెర్ర చేస్తోంది. తెలంగాణలో బలంగా ఉన్న ఖమ్మం జిల్లాకు ఎవరు ఆయువుపట్టుః ఇటీవలి ఖమ్మం బహిరంగసభ ఎవరి కష్టంతో సక్సెస్ అయిందో , కొత్త అధ్యక్షుడు తెలుసుకుంటే మంచింద ంటున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాకు చెందిన కమ్మవర్గం మనోగతం కూడా ఇదేవిధంగా ఉండటం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదేవిధంగా అప్పటి అగ్రనేతలు.. చంద్రబాబునాయుడు దగ్గర ‘కమ్మ బూచి’ చూపించి, అన్యాయం చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీ ఉనికి కోల్పోయి, ఇప్పుడే మళ్లీ బలపడుతున్న ఈ సమయంలో కూడా అదే బూచి చూపిస్తే, పార్టీలో ఒక్క కమ్మవారు మిగలరని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఒక స్థానిక పత్రికలో తెలంగాణ టీడీపీలో కమ్మ పెత్తనం అంటూ కథనాలు రాయించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ప్రతిభ, చిత్తశుద్ధి ప్రాతిపదిక కాకుండా.. పార్టీ ఉనికి కోల్పోయిన ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా, ఇంకా కుల సమీకరణ చేయడం తెలివితక్కువ పని అని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘తెలంగాణలో టీడీపీ ఇంకా బతికిఉందంటే దానికి కమ్మవారే కారణం బహిరంగం. బీసీలు కూడా పార్టీకి కాపుకాస్తున్నారు. దాదాపు 36 నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంది. ఓవైపు కేసీఆర్ కమ్మవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, ఆ వర్గాన్ని పూర్తిగా మలచుకునే పనిలో ఉన్నారు. ఇంకోవైపు బీజేపీ కూడా కమ్మవారికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. ఈ పరిస్థితిలో వారిని కాపాడుకోవడం బదులు, అవమానిస్తే ఇక పార్టీలో కమ్మవాళ్లు ఎందుకు ఉంటారు? ఇప్పుడు పార్టీకి ఉనికి లేదు. పార్టీ ఆఫీసుకు వందమంది వస్తే ఎక్కువ. ఇలాంటి సమయంలో పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వర్గం కావలసి ఉంది. కాసాని కుల సంఘానికి తప్ప, ఎప్పడూ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసిన అనుభవం లేదు. అదీ అసలు సమస్య’ అది ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
ఇక పార్టీ స్థాపన నుంచి మేడ్చెల్‌లో పనిచేస్తున్న సామాభూపాలరెడ్డి, నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, వరంగల్ నేత శ్రీనివాసచారి, మహిళానేత షకీలారెడ్డి, పద్మాచౌదరి, సూర్యదేవర లత, నీల పద్మ, స్వప్నచౌదరి, ధనలక్ష్మి, ఇందిర, రజని వంటి పాతకాపులను పక్కనపెట్టడం వివాదంగా మారింది. దశాబ్దాల నుంచి పనిచేస్తున్న తమను కాదని, ఇంకా బీఆర్ఎస్లో ఉన్న పదవులకు రాజీనామా చేయించని, కుటుంబసభ్యులను ప్రోత్సహించడం ఏమటని తమ్ముళ్లు మండిపడుతున్నారు.
పార్టీ ఆఫీసులో నెలకొన్న కుటుంబ రాజకీయ వాతావరణంలో మార్పులు తీసుకువచ్చి, అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోకపోతే.. పార్టీలో సీనియర్లు ఎవరూ మిగలరని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కోర్ కమిటీని ఏర్పాటుచేసి, పార్టీని నడిపించాల్సిన అవసరం ఉందని సీనియర్లు సూచిస్తున్నారు.