Suryaa.co.in

Editorial

టీడీపీకి ‘ఎన్టీఆర్’ సంకటం!

– విజయవాడకు ఎన్టీఆర్ పేరుపై స్పందించని టీడీపీ
– జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన పురంధీశ్వరి
– బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మౌనం
– వైసీపీ రాజకీయ వ్యూహంలో చిక్కిన టీడీపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగుదేశం పార్టీకి దివంగత ఎన్టీఆర్ పేరే ఆశ, శ్వాస. అలాంటిది ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం, ఆ పార్టీని రాజకీయ సంకటంలో పడేసింది. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడుతూ
ntrజగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ కూతురు, బీజేపీ జాతీయ నాయకురాలయిన పురంధీశ్వరి స్వాగతించగా.. పార్టీపరంగా తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటించడం చర్చనీయాంశంగా మారింది.

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జగన్ ప్రభుత్వం విజయవాడను ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా ఏర్పాటుచేసింది. నిజానికి జగన్ గతంలోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని గుడివాడలో ప్రకటించారు. ఆ మేరకు తాజాగా ఎన్టీఆర్ పేరు ప్రకటించారు. ఇది ఎన్టీఆర్ అభిమానులను సంతోషపెట్టింది. టీడీపీ హయాంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే దానికి కారణం. మరోవైపు కృష్ణా జిల్లాలో అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న కమ్మ సామాజికవర్గాన్ని కూడా, జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆనందపరిచింది.

కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ వ్యవహారం రాజకీయంగా మింగుడుపడకుండా ఉంది. ఏ కార్యక్రమం నిర్వహించినా ముందు ఎన్టీఆర్‌ను స్మరించుకునే సంప్రదాయం ఉన్న టీడీపీ.. ఆయన పేరును ఏకంగా ఒక జిల్లాకు పెట్టినా ఇప్పటిదాకా స్పందించకపోవడం బట్టి, ఆ పార్టీ ఏ స్థాయిలో రాజకీయ సంకటంలో పడిందో, జగన్ వ్యూహంలో టీడీపీ ఏ స్థాయిలో చిక్కుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే పలువురు టీడీపీ నేతలు మాత్రం, ఎన్టీఆర్ పుట్టిన మచిలీపట్నం జిల్లాకు ఆయన పేరు పెడితే బాగుండేది అంటున్నారే తప్ప, దానిని అధికారికంగా వ్యాఖ్యానించలేకపోతున్నారు. పార్టీ విధానపరమైన నిర్ణయం ప్రకటించకపోవడమే దానికి కారణం.

అటు టీడీపీ నాయకత్వం కూడా ఎన్టీఆర్ జిల్లాపై స్పందిస్తే, ఆ ఖ్యాతి జగన్ ఖాతాలో కలుస్తుందన్న ముందుచూపుతో మౌనంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తే.. అధికారంలో ఉండగా తాను
babu-ntr చేయలేని పనిని, జగన్ మూడేళ్లలో చేశారని అంగీకరించినట్టవుతుంది. అదే సమయంలో రంగా పేరు విజయవాడకు పెట్టాలన్న డిమాండ్ ఉన్నందున.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టినందువల్ల దాని స్వాగతిస్తే, కాపులు ఆగ్రహించే అవకాశం లేకపోలేదు. పైగా అసలు మొత్తం కొత్త జిల్లాల ప్రక్రియనే పార్టీపరంగా స్వాగతించినట్టవుతుంది. ‘ ఇప్పుడున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది అందరికీ తెలుసు. అది తెలియక చాలామంది జగన్ ట్రాప్‌లో పడుతున్నారు. మేం ఈ సమయంలో ఎన్టీఆర్ జిల్లాపై స్పందిస్తే మేం కూడా జగన్ ట్రాప్‌లో పడినట్టవుతుంది. పైగా అసలు జనగణన కాకుండా కొత్త జిల్లాల ఏర్పాటుసాధ్యం కాదు. ఇన్ని తెలిసి కూడా మేం మాట్లాడి, జగన్ పార్టీకి ఆయుధాలు అందివ్వడం ఎందుకు’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఇన్ని కారణాల దృష్ట్యా టీడీపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ఎన్టీఆర్ కూతురు కేంద్ర మాజీ మంత్రి అయిన పురంధీశ్వరి మాత్రం అభినందించారు. ఎన్టీఆర్ కుమార్తెగా తనకు ఈ నిర్ణయం సంతోషపరిచిందని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీపరంగా బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. తాము పార్టీపరంగా 26 జిల్లాలు ఎప్పుడో చేశామని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రకటించారు.

కానీ హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడయిన నందమూరి బాలకృష్ణ గానీ, ఎన్టీఆర్ మనుమడయిన జూనియర్ ఎన్టీఆర్ గానీ ఇప్పటిదాకా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జయంతిరోజు క్రమం తప్పకుండా ఫుల్‌పేజీ అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చి, నివాళులర్పించే జూనియర్ ఎన్టీఆర్.. తన తాత పేరు ఒక జిల్లాకు పెట్టినా మౌనంగా ఉండటం, అటు ఆయన అభిమానులనూ ఆశ్చర్యపరుస్తోంది. బాలకృష్ణ టీడీపీ నేత కాబట్టి ఆయన పార్టీ విధాన నిర్ణయం ప్రకారం వ్యవహరిస్తారని భావించవచ్చు. కానీ టీడీపీతో ‘ప్రస్తుతం’ఎలాంటి సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ కూడా, మౌనంగా ఉండటమే ఆశ్చర్యంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE